శృంగార పప్పులు!

బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్‌) చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర్నుంచి ఉత్సాహం, మేధోశక్తి, మూడ్‌ పుంజుకోవటం వరకూ ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి.

Published : 30 Jul 2019 00:43 IST

బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్‌) చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర్నుంచి ఉత్సాహం, మేధోశక్తి, మూడ్‌ పుంజుకోవటం వరకూ ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. ఇవి శృంగార జీవితం మెరుగుపడటానికీ తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. రోజుకు 60 గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటంతో పాటు మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం గమనార్హం. తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహార అలవాట్లు గల కొందరిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరికి తమ మామూలు ఆహారం, మరికొందరికి బాదం, అక్రోట్లు, హేజెల్‌ నట్స్‌ కూడా తినమని సూచించారు. ఇలా 14 వారాలు చేసిన తర్వాత పరిశీలించగా.. గింజపప్పులు జతచేసినవారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి మెరుగుపడినట్టు తేలింది. గింజపప్పుల్లో ప్రొటీన్‌, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడేవే. వీటిల్లో ఫాలీఫెనాల్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి స్తంభనలోపం తగ్గటానికే కాకుండా గుండె రక్తనాళ వ్యవస్థకూ మేలు చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారానికి గింజపప్పులనూ జోడించినట్టయితే అంగ స్తంభన, శృంగారాసక్తి మెరుగయ్యే అవకాశమున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని