భంగిమ దెబ్బతింటే తిప్పలే!

రోజంతా ఆఫీసులో కుర్చీలో కూలబడతాం. తల వంచుకొని మొబైల్‌ఫోన్లను తేరిపార చూస్తుంటాం. సోఫాలో దిగబడి ఎటుపడితే అటు వంగిపోతాం. నడుం, మెడను ఏమాత్రం పట్టించుకోకుండా ఇలాంటి పనులెన్నో...

Published : 06 Nov 2018 05:18 IST

భంగిమ దెబ్బతింటే తిప్పలే!

రోజంతా ఆఫీసులో కుర్చీలో కూలబడతాం. తల వంచుకొని మొబైల్‌ఫోన్లను తేరిపార చూస్తుంటాం. సోఫాలో దిగబడి ఎటుపడితే అటు వంగిపోతాం. నడుం, మెడను ఏమాత్రం పట్టించుకోకుండా ఇలాంటి పనులెన్నో చేసేస్తుంటాం. చివరికి ‘మెడనొప్పి, నడుంనొప్పి బాబోయ్‌’ అని బాధ పడుతుంటాం. శరీర భంగిమ సరిగా లేకపోవటం వల్ల ఇలాంటి నొప్పులు మాత్రమే కాదు.. నిలబడినప్పుడు తూలిపోవటం, తలనొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందుల వంటివీ వేధించొచ్చు. మలవిసర్జన సమయంలో సరిగా కూచోకపోతే మలబద్ధకం కూడా తలెత్తొచ్చు. ఆశ్చర్యంగా అనిపించినా మూత్రం లీక్‌ కావటం, ఛాతీలో మంట వంటి సమస్యలూ బయలుదేరొచ్చు. 
* మూత్రం లీక్‌: శరీర భంగిమ సరిగా లేకపోవటం మూలంగా ఒత్తిడితో ముడిపడిన మూత్రం లీక్‌ సమస్య తలెత్తొచ్చు. ఎక్కువసేపు బాగా ముందుకు వంగినప్పుడు కడుపు మీద ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో మూత్రాశయం మీదా ఒత్తిడి పడుతుంది. అంతేకాదు.. కటిభాగంలోని కండరాల దృఢత్వమూ దెబ్బతింటుంది. ఇవన్నీ మూత్రాన్ని పట్టి ఉంచే సామర్థ్యం తగ్గిపోయేలా చేస్తాయి. ఫలితంగా నవ్వినా, దగ్గినా తెలియకుండానే మూత్రం లీకయ్యే ముప్పు పెరుగుతుంది. 
* ఛాతీలో మంట, అజీర్ణం: భోజనం చేసిన తర్వాత చాలాసేపు ముందుకు వంగిపోతుంటే ఛాతీలో మంట తలెత్తొచ్చు. ఎందుకంటే ముందుకు వంగినపుడు కడుపు మీద ఒత్తిడి పడుతుంది. దీంతో జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావొచ్చు. పేగుల్లోంచి ఆహారం కిందికి కదిలే వేగం నెమ్మదించే అవకాశమూ ఉంది. ఫలితంగా జీర్ణప్రక్రియ కూడా ఆలస్యం కావొచ్చు.

 

ఏం చేయాలి? 
వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవటం ముఖ్యం. నిరంతరం నిటారుగా ఉండటం ఎవరికైనా కష్టమే గానీ ఎక్కువసేపు మరీ ముందుకు గానీ వెనక్కు గానీ వంగిపోకుండా చూసుకోవటం మంచిది. ఎప్పుడైనా ముందుకు వంగినట్టు అనిపిస్తే.. భుజాలను వదులుగా కిందికి వేలాడేలా చేసి.. వెనక్కి లాక్కోవాలి. తలను కూడా వెనక్కి లాక్కోవాలి. ఇప్పుడు కడుపును లోపలికి లాక్కొని (ప్యాంటు బొత్తాలు పెట్టుకుంటున్నప్పుడు కడుపును లోపలికి తీసుకున్నట్టుగా) కాసేపు అలాగే ఉండాలి. దీంతో కడుపు భాగంలోని కండరాలు కుదురుకొని వెన్నెముకకు మంచి దన్ను లభిస్తుంది. ఇక శరీర భంగిమ సరిగా లేకపోవటం వల్ల సమస్యలు వస్తున్నట్టు గుర్తిస్తే కడుపు, కటిభాగం, వెన్ను కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. దీంతో వెన్నెముక కూడా బలపడుతుంది. కటి కండరాలను దృఢపరచే ప్రత్యేకమైన వ్యాయామాలతో మూత్రం లీక్‌ కాకుండా చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని