Pumpkin Benefits: అమ్మా.. గుమ్మాడీ.. దీంతో ఇన్ని ప్రయోజనాలున్నాయా?

గుమ్మడికాయతో చేసే వంటకాల రుచుల్ని బాగా ఇష్టపడుతుంటారా?అయితే గుమ్మడితో వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. 

Updated : 23 Apr 2023 16:42 IST

అమ్మా.. గుమ్మాడీ!

సాంబారులో వేసుకునో.. హల్వా చేసుకునో గుమ్మడికాయ (Pumpkin) రుచులను ఆస్వాదించటం కొత్తేమీ కాదు. మరి దీనిలోని పోషకాల గురించి.. వాటితో ఒనగూడే ప్రయోజనాల (Pumpking Benefits) గురించి మీకు తెలుసా?

కంటికి వెలుగు

క్యారట్లు, చిలగడ దుంపల్లో మాదిరిగానే గుమ్మడికాయలోనూ బీటా కెరొటిన్‌ దండిగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసే ఇది ఒంట్లోకి చేరుకున్నాక విటమిన్‌ ఎ రూపంలోకి మారిపోతుంది. అరకప్పు గుమ్మడి ముక్కలతోనే మనకు రోజుకు అవసరమైన విటమిన్‌ ఎ లభిస్తుంది! కళ్లు బాగా కనబడటానికి, పునరుత్పత్తి అవయవాలు సజావుగా పనిచేయటానికి విటమిన్‌ ఎ చాలా అవసరమనే సంగతి తెలిసిందే. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి కీలక అవయవాల ఆరోగ్యానికీ ఇది దోహదం చేస్తుంది. కొన్నిరకాల క్యాన్సర్ల ముప్పు తగ్గటానికీ విటమిన్‌ ఎ తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

రోగనిరోధకశక్తి బలోపేతం

బీటా కెరొటిన్‌తో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, ఐరన్‌, ఫోలేట్‌ కూడా గుమ్మడిలో ఎక్కువే. ఇవన్నీ రోగనిరోధకశక్తిని బలోపేతం చేసేవే కావటం గమనార్హం. అందువల్ల ఇది ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడటమే కాదు.. వాటి నుంచి త్వరగా బయటపడటానికీ తోడ్పడుతుంది.

హైబీపీ తగ్గుముఖం

నారింజ రంగులో నిగనిగలాడే గుమ్మడి ముక్కల్లోని పొటాషియం రక్తపోటు తగ్గటంలోనూ సాయపడుతుంది. ఫలితంగా పక్షవాతం ముప్పూ తగ్గుముఖం పడుతుంది. అంతేనా? ఎముక సాంద్రత కూడా మెరుగవుతుంది. గుమ్మడి గింజలు కూడా తక్కువేమీ కాదు. వీటిల్లోనూ బోలెడన్ని ఖనిజాలుంటాయి. కొలెస్ట్రాల్‌ మాదిరి వృక్ష స్టెనాల్స్‌ కూడా ఎక్కువే. ఇవి మంచి కొవ్వు స్థాయులు పెరిగేలా చేస్తాయి.

బరువు అదుపు

గుమ్మడిలో పీచు ఎక్కువ. కేలరీలు తక్కువ. ఇలా ఇది త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం కూడా దూరమవుతుంది.

మంచి నిద్ర

గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్‌ అనే రసాయనం ఉత్పత్తి కావటానికి తోడ్పడుతుంది. సెరటోనిన్‌ హాయి భావనను కలిగించటంలోనే కాదు.. నిద్ర కూడా బాగా పట్టేలా చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని