ఉమ్మితే రక్తం.. ఎందుకు?

నేను ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్నాను. ఆ మధ్యన బస్సులు వెళ్లే ఊర్ల పేర్లను బిగ్గరగా కేకలు వేస్తూ చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత ఉదయం నిద్రలేస్తూనే ఉమ్మితో పాటు రక్తం పడటం మొదలైంది. కొన్నిసార్లు పగటిపూట కూడా ఇలాగే రక్తం పడుతోంది. చాలామంది నిపుణులను సంప్రతించాను. అన్నిరకాల పరీక్షలు చేశారు.

Updated : 01 Jan 2019 15:04 IST

సమస్య - సలహా 

ఉమ్మితే రక్తం.. ఎందుకు?

సమస్య: నేను ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్నాను. ఆ మధ్యన బస్సులు వెళ్లే ఊర్ల పేర్లను బిగ్గరగా కేకలు వేస్తూ చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత ఉదయం నిద్రలేస్తూనే ఉమ్మితో పాటు రక్తం పడటం మొదలైంది. కొన్నిసార్లు పగటిపూట కూడా ఇలాగే రక్తం పడుతోంది. చాలామంది నిపుణులను సంప్రతించాను. అన్నిరకాల పరీక్షలు చేశారు. చివరికి జీర్ణకోశ సమస్యగా భావించి మందులు ఇచ్చారు. అయినా సమస్య తగ్గలేదు. దీనికి పరిష్కారమేంటి?

- భీమవరపు కార్తికేయ (ఈమెయిల్‌ ద్వారా)

ఉమ్మితే రక్తం.. ఎందుకు?సలహా: మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే జీర్ణకోశ సమస్య కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే జీర్ణకోశ సమస్యల్లో వాంతి అయినప్పుడు రక్తం పడుతుంటుంది. అదీ రక్తం నల్లగా ఉంటుంది. అంతేగానీ ఉమ్మితో పాటు రక్తం పడటమనేది జరగదు. పైగా మీరు బిగ్గరగా కేకలు వేస్తూ అరిచిన తర్వాత రక్తం పడటం మొదలైందని అంటున్నారు. అందువల్ల దీనికి స్వరపేటిక వాపు (లారింజైటిస్‌) కారణం కావొచ్చని తోస్తోంది. బిగ్గరగా అరచినపుడు స్వరపేటిక మీద తీవ్రమైన ఒత్తిడి పడి, వాపు తలెత్తుతుంది. ఫలితంగా గొంతు బొంగురుపోవటం వంటి లక్షణాలు కనబడతాయి. మీకు మొదట్లో గొంతు కూడా మారిపోయి ఉండొచ్చు. ఇలాంటి సమయంలో కొద్దిరోజుల పాటు మాట్లాడటం తగ్గించి.. అవసరమైతే యాంటీబయోటిక్‌ మాత్రలు వేసుకుంటే సమస్య నయమైపోయి ఉండేది. అయితే మీరు అలా చేసినట్టు కనబడటం లేదు. దీంతో సమస్య తీవ్రమై ఉండొచ్చు. బహుషా మీకు స్వరతంత్రులు (వోకల్‌ కార్డ్స్‌) బిగుసుకుపోవటమో.. లేదంటే వాటి కింద ఎక్కడైనా చిన్న పుండు పడటమో జరిగి ఉండొచ్చు. మీరు నొప్పి ఉందో లేదో తెలియజేయలేదు. పుండు పడినప్పుడు నొప్పి కూడా ఉంటుంది. అందువల్ల మీరు ముక్కు, చెవి, గొంతు (ఈఎన్‌టీ) సమస్యల చికిత్సలో మంచి నైపుణ్యం గల డాక్టర్‌ను ఒకసారి సంప్రతించటం మంచిది. సమస్యను కచ్చితంగా నిర్ధరిస్తే తేలికపాటి యాంటీబయోటిక్‌ మందులతోనే నయమయ్యే అవకాశముంది. అలాగే మీకు దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా పరీక్షించుకోవటం మంచిది. ఎందుకంటే ఇలాంటి సమస్యలతోనూ ఉమ్మినపుడు రక్తం పడే అవకాశముంది. విటమిన్‌ సి లోపం మూలంగానూ రక్తం పడొచ్చు. కాబట్టి స్వరపేటిక సమస్యలేవీ లేకపోతే జనరల్‌ ఫిజీషియన్‌ను, దంత నిపుణులను కలిసి చికిత్స తీసుకోవటం ఉత్తమం.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512  email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు