గుండెకూ కుంగుబాటు!

కుంగుబాటు (డిప్రెషన్‌) మానసికంగానే కాదు, శారీరకంగానూ తీవ్రంగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా గుండె మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కుంగుబాటు బాధితులకు గుండె లయ తప్పే (ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌) ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా బయటపడింది. కుంగుబాటు, కుంగుబాటు తగ్గటానికి వేసుకునే మందులకూ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌...

Updated : 31 Dec 2018 20:39 IST

గుండెకూ కుంగుబాటు!కుంగుబాటు (డిప్రెషన్‌) మానసికంగానే కాదు, శారీరకంగానూ తీవ్రంగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా గుండె మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కుంగుబాటు బాధితులకు గుండె లయ తప్పే (ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌) ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా బయటపడింది. కుంగుబాటు, కుంగుబాటు తగ్గటానికి వేసుకునే మందులకూ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ ముప్పునకూ గల సంబంధంపై ఆర్హస్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అరుదుగానే అయినా కుంగుబాటు మందులు గుండె లయ తప్పే సమస్యకు కారణమవుతుంటాయి. అందువల్ల వీటితో ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ ముప్పూ పెరగొచ్చని చాలాకాలంగా అనుమానిస్తున్నారు. అయితే కుంగుబాటు మందులకూ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌కూ ఎలాంటి సంబంధం కనబడకపోవటం గమనార్హం. అంటే కుంగుబాటు సమస్య నేరుగానే గుండె లయ తప్పటానికి దోహదం చేస్తుందన్నమాట. గుండె లయ సమస్యల్లో (అరిత్మియా) తరచుగా కనబడేది ఏట్రియల్‌ ఫిబ్రిలేషనే. దీని బారినపడ్డవారిలో గుండె దడ, శ్వాస ఆడకపోవటం, అలసట, ఛాతీనొప్పి, తల తిప్పు వంటి లక్షణాలు కనబడతాయి. గుండె కొట్టుకునే క్రమం దెబ్బతినటం వల్ల పక్షవాతం ముప్పు పెరుగుతుంది. పక్షవాతం బాధితుల్లో సుమారు 20-30% మంది ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ బాధితులే కావటం గమనార్హం. కాబట్టి కుంగుబాటును తేలికగా తీసుకోవటానికి వీల్లేదని నిపుణులు సూచిస్తున్నారు. సమస్యను వీలైనంత త్వరగా గుర్తించటం.. అవసరమైతే మందులు వేసుకోవటం తప్పనిసరి. వీటితో పాటు ఆహారంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో మంచిది.

* గింజపప్పులు, అవకాడో, ఆలివ్‌ నూనె, చేపలు వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి కుంగుబాటుతో పోరాడటంలో కీలకంగా పనిచేస్తాయి. 
* ఫోలేట్‌ మోతాదులు తగ్గితే కుంగుబాటు లక్షణాలు పొడసూపటం, కుంగుబాటు మందులు ప్రభావం తగ్గే అవకాశముంది. కాబట్టి ఫోలేట్‌ దండిగా ఉండే పాలకూర వంటి ఆకుకూరలు తరచుగా తీసుకోవాలి. 
* మెదడు ప్రశాంతంగా ఉండటానికి పాలు, అరటిపండు తోడ్పడతాయి. కాబట్టి వీటితో చేసిన మిల్క్‌షేక్‌లు అప్పుడప్పుడు తీసుకోవటం మంచిది.  అరటిపండులో సంతోషాన్ని కలిగించే ట్రిప్టోథాన్‌ అనే హార్మోన్‌ కూడా ఉంటుంది. ఇది మూడ్‌ మెరుగుపడటానికీ దోహదం చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని