వృషణాన్ని తొలగించారు.. మున్ముందు ఇబ్బందా?

మా అబ్బాయి వయసు ఐదేళ్లు. ఒకరోజు వృషణాలు బాగా నొప్పి పెడుతున్నాయన్నాడు. చూస్తే వృషణాలు ఎర్రగా కందిపోయాయి. దగ్గర్లోని ఆసుపత్రికి తీసువెళ్తే వృషణాలు మెలితిరిగాయని చెప్పారు. రక్తసరఫరా నిలిచిపోయిందని అత్యవసరంగా ఆపరేషన్‌ చేశారు.

Published : 08 Jan 2019 00:31 IST

సమస్య - సలహా

వృషణాన్ని తొలగించారు.. మున్ముందు ఇబ్బందా?

సమస్య: మా అబ్బాయి వయసు ఐదేళ్లు. ఒకరోజు వృషణాలు బాగా నొప్పి పెడుతున్నాయన్నాడు. చూస్తే వృషణాలు ఎర్రగా కందిపోయాయి. దగ్గర్లోని ఆసుపత్రికి తీసువెళ్తే వృషణాలు మెలితిరిగాయని చెప్పారు. రక్తసరఫరా నిలిచిపోయిందని అత్యవసరంగా ఆపరేషన్‌ చేశారు. ఒక వృషణాన్ని పూర్తిగా తొలగించారు. దీంతో పెద్దయ్యాక ఏదైనా సమస్య వస్తుందా? అని భయంగా ఉంది.

- ఎస్‌. సత్యనారాయణ

వృషణాన్ని తొలగించారు.. మున్ముందు ఇబ్బందా?సలహా: మీ అబ్బాయి విషయంలో బాధపడాల్సిన పనేమీ లేదు. పెద్దయ్యాక శృంగారంలో పాల్గొనటానికి, సంతానాన్ని కనటానికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. అదృష్టం కొద్దీ మన శరీరంలో కొన్ని అవయవాలు రెండేసి చొప్పున ఉంటాయి. ఒకటి దెబ్బతిన్నా రెండోది పనిచేస్తుంది. ఎవరికైనా కిడ్నీ మార్పిడి అవసరమైతే దగ్గరి బంధువులు దానం చేయటం చూస్తూనే ఉన్నాం. ఒక కిడ్నీని దానం చేసినా మామూలుగానే జీవించొచ్చు. అలాగే వృషణాలు కూడా. ఒక వృషణాన్ని తొలగించినా కూడా పెద్దయ్యాక సంతానం కనటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సాధారణంగా ప్రమాదాల్లో వృషణాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, ఇన్‌ఫెక్షన్లు తలెత్తినపుడు, మెలితిరిగి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు వృషణాలను తొలగించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కొందరికి క్యాన్సర్‌ కణితుల మూలంగానూ తొలగిస్తుంటారు. వృషణాలు రెండు వైపులా వేర్వేరుగా ఎదుగుతూ వస్తాయి. కిందికి దిగుతుంటాయి. ఈ క్రమంలో కొందరికి వృషణాలు మెలితిరగొచ్చు. కొందరు పిల్లలు ఒక వృషణంతోనూ పుట్టటం చూస్తుంటాం. వృషణాలు చేసే ముఖ్యమైన పని పురుష హార్మోన్‌ అయిన టెస్టోస్టీరాన్‌ను, వీర్యాన్ని ఉత్పత్తి చేయటం. సంతానాన్ని కనటానికి ఒక వృషణం ఉన్నా సరిపోతుంది. కాబట్టి మీ అబ్బాయి విషయంలో బెంగ అవసరం లేదు. అయితే ఉన్న వృషణం దెబ్బతినకుండా చూసుకోవటం చాలా అవసరం. ఎత్తు నుంచి కింద పడకుండా.. సైకిల్‌ తొక్కేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. దెబ్బలు తగిలే అవకాశం గల బాక్సింగ్‌, కరాటే వంటి ఆటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మూత్ర ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండానూ చూసుకోవాల్సి ఉంటుంది. మగవారిలో మూత్ర ఇన్‌ఫెక్షన్లు తలెత్తితే ప్రత్యుత్పత్తి అవయవాల మీదా దుష్ప్రభావం పడుతుంది. అందువల్ల నీరు ఎక్కువగా తాగేలా చూసుకోవాలి. ప్రతి 3 గంటలకు ఒకసారి మూత్ర విసర్జన చేయమని చెప్పాలి. మలబద్ధకంతోనూ మూత్ర ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు కాబట్టి పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email:sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని