కాళ్లు చేతులు వణుకుతున్నాయేం?

సమస్య: నా వయసు 25 సంవత్సరాలు. సన్నగా ఉంటాను. కొన్నిసార్లు నాకు కాళ్లు చేతులు వణికినట్టుగా అదురుతున్నాయి. దీంతో రాసేటప్పుడు, గ్లాసుతో నీళ్లు తాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటోంది.

Updated : 22 Jan 2019 00:39 IST

సమస్య - సలహా

కాళ్లు చేతులు వణుకుతున్నాయేం?

సమస్య: నా వయసు 25 సంవత్సరాలు. సన్నగా ఉంటాను. కొన్నిసార్లు నాకు కాళ్లు చేతులు వణికినట్టుగా అదురుతున్నాయి. దీంతో రాసేటప్పుడు, గ్లాసుతో నీళ్లు తాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటోంది. ఏంటీ సమస్య? పరిష్కారమేంటి?

-శివ ప్రసాద్‌ (ఈమెయిల్‌ ద్వారా)

 

సలహా: మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తుంటే ఎసెన్షియల్‌ ట్రెమర్‌లాగా తోస్తోంది. ఇందులో శరీరంలో ఒకటి, అంతకన్నా ఎక్కువ అవయవాలు మన ప్రమేయమేమీ లేకుండా అదిరినట్టు, కాళ్లు చేతులు వణుకుతున్నాయేం?వణికినట్టుగా కదిలిపోతుంటాయి. ఎక్కువగా చేతుల్లో ఇలాంటి అదురు చూస్తుంటాం. దీంతో ఏవైనా వస్తువులు పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతుంటాయి. ఇదేమీ ప్రమాదకరమైన సమస్య కాదు. కాకపోతే రోజువారీ పనులు చేసుకునేటప్పుడు, నలుగురిలోకి వెళ్లినపుడు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కొందరు దీన్ని పార్కిన్సన్స్‌ జబ్బేమో అనీ పొరపడుతుంటారు. సాధారణంగా పార్కిన్సన్స్‌లో ఖాళీగా ఉన్నప్పుడే వణుకు కనబడుతుంది. పనులు చేస్తున్నప్పుడు తగ్గుతుంది. కానీ ఎసెన్షియల్‌ ట్రెమర్‌లో అలా కాదు. పనులు చేస్తున్నప్పుడు ఎక్కువయ్యే అవకాశముంది. ఎసెన్షియల్‌ ట్రెమర్‌ ఎందుకు వస్తుందనేది కచ్చితంగా తెలియదు. కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే వచ్చే అవకాశమూ ఉంది. థైరాయిడ్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి (హైపర్‌ థైరాయిడిజమ్‌) అయినా కూడా ఇలా కాళ్లు చేతులు వణకొచ్చు. కాబట్టి మీరు ఒకసారి థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవటం మంచిది. కొందరికి ఆందోళన మూలంగానూ వణుకు ఆరంభమై కాళ్లు చేతులు అదిరినట్టుగా కదలొచ్చు. అలాగే ఎసెన్షియల్‌ ట్రెమర్‌ వచ్చే స్వభావం గలవారు ఆస్థమా కోసం నెబ్యులైజర్‌ వాడుకునే సమయంలోనూ ఇది ప్రేరేపితం కావొచ్చు. కొద్దిమందికి న్యూరోపతీ వంటి సమస్యల్లోనూ వణుకు రావొచ్చు. దీన్ని నర్వ్‌ కండక్షన్‌ పరీక్ష ద్వారా నిర్ధరణ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా మీరు ఒకసారి నిపుణులైన న్యూరాలజిస్టును సంప్రతిస్తే వణుకు ఎందుకొస్తుందన్నది కచ్చితంగా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి తగు చికిత్స తీసుకోవచ్చు.

-డా।। జి.వి.సుబ్బయ్య చౌదరి
సీనియర్‌ న్యూరాలజిస్ట్‌

 

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని