ఏడేళ్లకే తెలుపు.. ఎందుకు?

మా పాప వయసు 7 సంవత్సరాలు. తనకి రెండేళ్లుగా తెలుపు అవుతోంది. ఒకసారి డాక్టర్‌కు చూపించాం. వాసన, దురద వంటివేవీ లేవు కాబట్టి పెద్ద సమస్యేమీ కాదని చెప్పారు.

Published : 12 Feb 2019 00:28 IST

సమస్య - సలహా 

సమస్య: మా పాప వయసు 7 సంవత్సరాలు. తనకి రెండేళ్లుగా తెలుపు అవుతోంది. ఒకసారి డాక్టర్‌కు చూపించాం. వాసన, దురద వంటివేవీ లేవు కాబట్టి పెద్ద సమస్యేమీ కాదని చెప్పారు. అయినా మాకు ఆందోళనగానే ఉంది. అసలేంటీ సమస్య? దీనికి పరిష్కారమేంటి?

- కె. సంతానం, గోరంట్ల, అనంతపురం జిల్లా

 

సలహా: చిన్న వయసులోనే జననాంగం నుంచి స్రావాలు రావటమనేది తరచుగా చూసే సమస్యే. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే పెద్ద ఇబ్బందేమీ లేకపోవచ్చనే అనిపిస్తోంది. ఆడపిల్లల్లో రజస్వల కావటానికి ముందు శరీరంలో కొన్ని మార్పులు తలెత్తుతుంటాయి. వీటి ఫలితంగా తెలుపు కావటం వంటి సమస్యలు మొదలవుతుంటాయి. అందువల్ల రొమ్ములు ఎదుగుతున్నాయా? చంకల్లో వెంట్రుకలు మొలుస్తున్నాయా? అనేవి చూడాల్సి ఉంటుంది. త్వరలో రజస్వల అయ్యే అవకాశముంటే ఇలాంటి మార్పులు కనబడతాయి. అలాంటప్పుడు కొద్దిగా తెలుపు అవుతుంటుంది. కటి భాగంలో ఇన్‌ఫెక్షన్‌తోనూ కొందరికి తెలుపు కావొచ్చు. అయితే దురద, వాసన వంటివేవీ లేవని అంటున్నారంటే ఇన్‌ఫెక్షన్‌ లేదనే అనుకోవచ్చు. అలాగే కొందరిలో నులి పురుగుల మూలంగానూ తెలుపు కావొచ్చు. కాకపోతే ఇందులో దురద కూడా ఉంటుంది. మీ అమ్మాయికి ఇతరత్రా ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. మరీ దుస్తులు తడిసిపోయేంతగా తెలుపు కాకపోతే కంగారు పడాల్సిన పనేమీ లేదు. అప్పుడప్పుడు లోదుస్తుల్లో మరకల వంటివి కనబడితే పెద్ద ఇబ్బందేమీ లేదనే చెప్పుకోవచ్చు. నొప్పి, దురద వంటివి లేకపోతే మున్ముందు సమస్యాత్మకంగానూ పరిణమించకపోవచ్చు. కాకపోతే అమ్మాయికి శుభ్రతను పాటించటం నేర్పించాలి. కాటన్‌ లోదుస్తులు ధరించేలా, తరచుగా లోదుస్తులను మార్చుకునేలా చూసుకోవాలి. మరీ బిగుతుగా ఉండే జీన్స్‌ జోలికి వెళ్లకపోవటం మంచిది. కొందరు శుభ్రంగా ఉండటం కోసం మూత్రానికి వెళ్లినపుడు, మల విసర్జన చేసినపుడు యాంటీసెప్టిక్‌ ద్రావణాలను నీటితో కలిపి శుభ్రం చేసుకోవాలని చెబుతుంటారు. వీటితో మంచి కన్నా చెడే ఎక్కువ. ఇలాంటి ద్రావణాలతో జననాంగాల వద్ద ఉండే మంచి సూక్ష్మక్రిములు చనిపోయి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. కాబట్టి శుభ్రంగా ఉండే మామూలు నీటితో కడుక్కోవాలి. అలాగే మల విసర్జన చేశాక ముందు నుంచి వెనక్కు కడుక్కోవటం నేర్పించాలి. ఎందుకంటే ఆడవాళ్లలో మలద్వారం జననాంగానికి దగ్గరగా ఉంటుంది. సరిగ్గా కడుక్కోపోతే జననాంగంలోకి మల పదార్థం వెళ్లిపోయి ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. దీంతో తెలుపు వంటి సమస్యలు బయలుదేరొచ్చు. కాబట్టి శుభ్రత చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. 

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా 

సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం, 
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 
email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని