పిల్లాడి అల్లరి భరించలేకపోతున్నాం..

సమస్య: మా బాబు వయసు 8 ఏళ్లు. మాటలు ఆలస్యంగా వచ్చాయి. మాట్లాడితే కొంచెం నత్తి వస్తుంది. చెడ్డీలోనే మూత్రం పోసుకుంటాడు. అల్లరి ఎక్కువ. విపరీతమైన కోపం. పుస్తకాలు చించివేయటం, రోడ్ల మీద తిరగటం, ఒక్కడే దుకాణాల దగ్గరకు వెళ్లి చాక్లెట్ల వంటివి కొనుక్కోవటం చేస్తుంటాడు. కోపమొస్తే డబ్బులు కూడా చించేస్తాడు.

Updated : 19 Feb 2019 06:31 IST

సమస్య - సలహా

సమస్య: మా బాబు వయసు 8 ఏళ్లు. మాటలు ఆలస్యంగా వచ్చాయి. మాట్లాడితే కొంచెం నత్తి వస్తుంది. చెడ్డీలోనే మూత్రం పోసుకుంటాడు. అల్లరి ఎక్కువ. విపరీతమైన కోపం. పుస్తకాలు చించివేయటం, రోడ్ల మీద తిరగటం, ఒక్కడే దుకాణాల దగ్గరకు వెళ్లి చాక్లెట్ల వంటివి కొనుక్కోవటం చేస్తుంటాడు. కోపమొస్తే డబ్బులు కూడా చించేస్తాడు. పిల్లాడి అల్లరిని భరించలేకపోతున్నాం. స్కూల్లో కాస్త బుద్ధిగానే ఉంటాడు గానీ చదువులో మొద్దు. దయచేసి సలహా చెప్పగలరు?

-బి.జె.ఆర్‌. పటేల్‌, సూర్యాపేట

 

సలహా: మాటలు ఆలస్యంగా రావటం, ఇప్పటికీ చెడ్డీలో మూత్రం పోసుకోవటం వంటివి చూస్తుంటే ముందుగా మీ పిల్లాడి బుద్ధి కుశలతను- ఇంటెలిజెన్స్‌ కోషెంట్‌(ఐక్యూ) పరీక్షించటం ఎంతైనా అవసరమని అనిపిస్తోంది. ఇందులో వయసుకు తగ్గట్టుగా తెలివి తేటలు ఉన్నాయోలేవో పరిశీలించి విశ్లేషిస్తారు. ఐక్యూ తక్కువగా ఉన్న పిల్లల్లో ఎదుగుదల కుంటుపడుతుంది. అంటే మొట్టమొదటిసారి కూచోవటం, నిలబడటం, తప్పటడుగులు వేయటం, మాటలు రావటం వంటివి ఆలస్యమవుతాయన్నమాట. మీరు మాటలు ఆలస్యమయ్యాయని తెలిపారు గానీ మిగతా వివరాలేవీ రాయలేదు. నిజానికి కొందరిలో ఇలాంటి ఎదుగుదల మార్పులు ఆలస్యమయ్యాయో లేదో అనేది అర్థం చేసుకోవటం సాధ్యం కాదు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో తోబుట్టువులు.. ముఖ్యంగా ముందు పుట్టిన పిల్లలను లేదా అదే వయసు తోటి పిల్లలతో పోల్చి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ మీ అబ్బాయి వయసు 8 సంవత్సరాలైనా మానసిక ఎదుగుదల 4 ఏళ్ల పిల్లల స్థాయిలోనే ఉండి ఉంటే  చెడ్డీలోనే మూత్రం పోసుకోవటం వంటివి చేసే అవకాశముంది. అలాగే అల్లరి కూడా బాగా చేస్తున్నాడని అంటున్నారు. అందువల్ల ఏకాగ్రతను దెబ్బతీసే అతి చురుకుదనం (ఏడీహెచ్‌డీ) సమస్య కూడా ఉందేమో కూడా చూడాల్సి ఉంది. ఏడీహెచ్‌డీ పిల్లలు ఒకదగ్గర కుదురుగా కూచోరు. దేని మీదా మనసు పెట్టలేరు. విచక్షణ లేకుండా, అనాలోచితంగా వేడి వస్తువులను ముట్టుకోవటం, రోడ్ల మీద పరుగెత్తటం.. పుస్తకాలు, నోట్లు చించివేయటం వంటి పనులు చేస్తుంటారు. వద్దన్నా వినరు. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటుంటారు. వస్తువులను ఎక్కడో పెట్టి మరచిపోతుంటారు. హోంవర్క్‌, స్కూల్‌వర్క్‌ల్లో చిత్రమైన తప్పులు చేస్తుంటారు. అంతేకాదు.. ఐక్యూ తక్కువున్న పిల్లలు అతి చురుకుదనంతోనూ ప్రవర్తిస్తుంటారు. అందువల్ల మీరు ఒకసారి పిల్లల మానసిక నిపుణులను సంప్రతించటం మంచిది. బుద్ధి కుశలతను విశ్లేషించి సమస్య ఏంటన్నది నిర్ధరిస్తారు. ఇలాంటివారికి సైకియాట్రిస్ట్‌, సైకాలజిస్ట్‌, ప్రత్యేక నిపుణులు ఒక బృందంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రవర్తన మారటానికి తోడ్పడే బిహేవియర్‌ థెరపీ, మాటలు సరిగా వచ్చేలా చూసే స్పీచ్‌ థెరపీ ఉపయోగపడతాయి. అవసరమైతే తనను తాను గాయపరచుకోకుండా చూసుకోవటానికి, అతి చురుకుదనం తగ్గటానికి మందులు ఇస్తారు.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ

ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని