అరికాళ్ల మంటలు.. తగ్గేదెలా?

నా వయసు 38 సంవత్సరాలు. అరికాళ్ల మంటలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో రాత్రిపూట

Published : 26 Feb 2019 01:23 IST

సమస్య - సలహా

సమస్య: నా వయసు 38 సంవత్సరాలు. అరికాళ్ల మంటలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో రాత్రిపూట సరిగా నిద్ర పట్టటం లేదు కూడా. పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. ఏంటీ సమస్య? దీనికి పరిష్కారమేంటి?

-శ్రీ ప్రశాంతి, హైదరాబాద్‌

సలహా: అరికాళ్లలో మంట తరచుగా చూసేదే. మీలాగే చాలామంది దీంతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం పాదాల్లో నాడులు దెబ్బతినటం (న్యూరోపతీ). దీంతో నాడుల పోచలు అతిగా స్పందించి మంట పుట్టేలా చేస్తాయి. దెబ్బతిన్న నాడులు గాయాల వంటివేవీ లేకపోయినా మెదడుకు నొప్పి సంకేతాలు అందిస్తుంటాయి. ఫలితంగా మంట, నొప్పి వంటివి వేధిస్తుంటాయి. కొన్ని రకాల సమస్యల్లో.. ముఖ్యంగా మధుమేహంలో నాడులు దెబ్బతినటం ఎక్కువగా చూస్తుంటాం. థైరాయిడ్‌ హార్మోన్‌ తగినంత ఉత్పత్తి కాకపోవటం (హైపోథైరాయిడిజమ్‌), దీర్ఘకాల కిడ్నీ జబ్బు.. రోగనిరోధకశక్తి పొరపాటున మన మీదనే దాడి చేయటం వల్ల తలెత్తే రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటి సమస్యల్లోనూ నాడులు దెబ్బతిని సమస్యను తెచ్చిపెట్టొచ్చు. కొందరికి మానసిక సమస్యలతోనూ అరికాళ్ల మంటలు రావొచ్చు. ఆడవారిలో నెలసరి నిలిచిపోవటమూ దీనికి దారితీయొచ్చు. కొందరికి ఎలాంటి కారణం లేకుండానూ (ఇడియోపథిక్‌) కాళ్ల మంటలు రావొచ్చు. నాడులు దెబ్బతినటమే కాకుండా- పాదాలకు ఇన్‌ఫెక్షన్‌, కాళ్లలో రక్తనాళాలు దెబ్బతిని రక్తసరఫరా తగ్గటం వంటివీ అరికాళ్ల మంటలకు దారితీయొచ్చు. అయితే మనదేశంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విటమిన్‌ బి12 లోపం గురించి. నాడుల చుట్టూ రక్షణగా నిలిచే పొర ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్‌ బి12 అవసరం. ఇది లోపిస్తే నాడులు దెబ్బతినే అవకాశముంది. సాధారణంగా శాకాహారుల్లో బి12 లోపం ఎక్కువ. అలాగే కొన్నిరకాల మందులతోనూ బి12 తగ్గొచ్చు. ఉదాహరణకు- మధుమేహానికి వాడే మెట్‌ఫార్మిన్‌ మందుతో శరీరం విటమిన్‌ బి12ను గ్రహించుకునే సామర్థ్యం తగ్గుతుంది. కొందరిలో పేగులు బి12ను సరిగా గ్రహించుకోలేకపోవటమూ సమస్యగా మారుతుంది. అతిగా మద్యం తాగటం వల్ల కూడా కొందరికి బి12 లోపం తలెత్తొచ్చు. అలాగే బి5 (పాంటోథెనిక్‌ యాసిడ్‌), బి6 (పైరిడాక్సిన్‌), బి1 (థయమిన్‌) లోపంతోనూ అరికాళ్లు మంట పుట్టొచ్చు. బాగా పాలిష్‌ చేసిన బియ్యం తినటం వల్ల బి1 తగ్గిపోయి సమస్యను తెచ్చిపెట్టొచ్చు. అందువల్ల కాళ్ల మంటలకు కారణమేంటన్నది గుర్తించటం చాలా కీలకం. మధుమేహం ఉందా? బి12 లోపం ఉందా? థైరాయిడ్‌ సమస్య ఉందా? ఆటోఇమ్యూన్‌ సమస్యలేవైనా ఉన్నాయా? అనేది పరీక్షించాల్సి ఉంటుంది. అలాంటి సమస్యలేవైనా ఉంటే వాటికి చికిత్స తీసుకుంటే కాళ్ల మంటలు కూడా తగ్గుతాయి. నాడులు దెబ్బతినటాన్ని నిర్ధరించటానికి నర్వ్‌ కండక్షన్‌ స్టడీ చేయాల్సి ఉంటుంది. అరుదుగా కొందరికి నాడుల్లోంచి చిన్న ముక్కను తీసి పరీక్ష (బయాప్సీ) చేయాల్సి రావొచ్చు. కాబట్టి మీరు ఒకసారి నిపుణులైన వైద్యుడిని సంప్రతించటం మంచిది. మద్యపానం అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. విటమిన్‌ బి12 లభించే మాంసం, చేపలు, గుడ్లు, చికెన్‌, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవటం మంచిది. అవసరమైతే మాత్రలు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. కొందరికి మాత్రలు పనిచేయవు. అప్పుడు బి12 ఇంజెక్షన్లు అవసరపడతాయి. బి12తో పాటు బి5, బి6, బి1 కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా

* సమస్య - సలహా సుఖీభవఈనాడు ప్రధాన కార్యాలయం,  రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email:sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు