మోకాళ్ల నొప్పికి ఆయుర్వేద మందుందా?

సమస్య: నా వయసు 55 సంవత్సరాలు. ఐదారేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. దీనికి ఆయుర్వేదంలో ఏవైనా మందులున్నాయా?.....

Published : 26 Mar 2019 00:27 IST

సమస్య - సలహా

సమస్య: నా వయసు 55 సంవత్సరాలు. ఐదారేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. దీనికి ఆయుర్వేదంలో ఏవైనా మందులున్నాయా?

- నర్సయ్య, హైదరాబాద్‌

సలహా: మోకాళ్ల నొప్పులను ఆయుర్వేదంలో ‘సంధివాతం’ అంటారు. ఇది వాతదోషం వికారం చెందటం వల్ల వస్తుంది. సంధివాతంలో కొందరికి ఒక మోకాలులోనే నొప్పి, వాపు ఉండొచ్చు. కొందరికి రెండు మోకాళ్లలోనూ, ఇతరత్రా కీళ్లలోనూ సమస్య ఉండొచ్చు. కొందరికి వాపు లేకుండా కూడా నొప్పి వస్తుండొచ్చు. మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తుంటే రెండు మోకాళ్లలోనూ నొప్పి ఉన్నట్టు అనిపిస్తోంది. మీరు ఉదయం పూట రుమార్తో గోల్డ్‌, రుమార్తో ప్లెయిన్‌ ఒక్కొక్క మాత్ర.. సాయంత్రం రుమార్తో ప్లెయిన్‌ రెండు మాత్రల చొప్పున వేసుకుంటే గుణం కనబడుతుంది. అయితే వీటిని నిపుణుల సలహాతోనే తీసుకోవాలి. అందువల్ల మీరు ఆయుర్వేద వైద్యుడిని సంప్రతించటం మంచిది. అశ్వగంధాది చూరాన్ని పాలతో కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనబడుతుంది. అయితే అశ్వగంధ చూర్ణంతో పాలు చేదవుతాయి. కాబట్టి ముందుగా కొద్దిగా పాలు తీసుకొని అందులో చెంచాడు అశ్వగంధాది చూర్ణం కలిపి తాగాలి. తర్వాత మిగతా పాలు తాగాలి. ఇలా ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. అలాగే మహా నారాయణ తైలం మోకాళ్ల మీద నెమ్మదిగా మర్దన చేసుకోవచ్చు. ఈ తైలం మర్దన చేసుకున్నాక.. దాని మీద వెచ్చజేసిన వావిలాకును గుడ్డలో చుట్టి కాపడం పెడితే మరింత గుణం కనబడుతుంది. వీలైతే రాత్రిపూట మోకాళ్లపై పసుపు చల్లి.. దానిపై వావిలాకును వేసి కట్టు కట్టుకొని పడుకోవచ్చు. అయితే మీరు మధుమేహం ఉందో లేదో తెలియజేయలేదు. మధుమేహులకు వేడి కాపడంతో గుల్లల వంటివి తలెత్తొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం.


మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని