బొడ్డు నుంచి రసి, చీము.. ఏంటీ పరిష్కారం?

మా అబ్బాయి వయసు పదేళ్లు. వాడికి రెండేళ్ల వయసు నుంచి అప్పుడప్పుడు బొడ్డు నుంచి రసి వస్తుంటుంది. కొన్నిసార్లు చీము కూడా వస్తుంది. ఈ సమయంలో బొడ్డు ఎర్రగా అవుతుంది.

Published : 16 Apr 2019 00:27 IST

సమస్య - సలహా

సమస్య: మా అబ్బాయి వయసు పదేళ్లు. వాడికి రెండేళ్ల వయసు నుంచి అప్పుడప్పుడు బొడ్డు నుంచి రసి వస్తుంటుంది. కొన్నిసార్లు చీము కూడా వస్తుంది. ఈ సమయంలో బొడ్డు ఎర్రగా అవుతుంది. యాంటీబయోటిక్‌ మందులు వేస్తే తగ్గుతుంది. మున్ముందు ఇది పెద్ద సమస్యగా మారుతుందేమోనని భయంగా ఉంది. దీనికి పరిష్కారమేంటి?

- విశ్వనాథ్‌, హైదరాబాద్‌

సలహా: పిల్లల్లో బొడ్డు నుంచి రసి రావటమనేది అరుదైన సమస్యేమీ కాదు. తరచుగా చూసేదే. కొందరికి రసి మామూలుగానే ఉండొచ్చు. కొందరిలో రక్తం, చీముతో కూడుకొని వస్తుండొచ్చు. కొందరిలో మూత్రం లేదా మల పదార్థం కూడా కనబడొచ్చు. కొందరు పిల్లలకు పుట్టుకతోనే ఇలా బొడ్డు నుంచి రసి వస్తుండొచ్చు. కొందరికి ఇతరత్రా కారణాలతోనూ రావొచ్చు. బొడ్డుకు ఇన్‌ఫెక్షన్‌, తిత్తి (గ్రాన్యులోమా), మూత్రాశయం వంటి భాగాల్లోంచి బొడ్డులోకి దారి ఏర్పడటం (సైనస్‌), పుట్టుకతో తలెత్తే లోపాల వంటి రకరకాల అంశాలు దీనికి దోహదం చేయొచ్చు. ఊబకాయం, బొడ్డులో ఏదైనా గుచ్చుకోవటం, బొడ్డు భాగాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోవటం వంటి మామూలు కారణాలు కూడా రసి, చీము రావటానికి కారణం కావొచ్చు. మీరు పిల్లాడికి పదేళ్లని అంటున్నారు. తరచుగా బొడ్డు నుంచి  రసి వస్తోందని అంటున్నారు. అందువల్ల వెంటనే దీనికి గల కారణమేంటో గుర్తించి, చికిత్స చేయటం అత్యవసరం. కాబట్టి మీరు నిపుణులైన పిల్లల శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించటం మంచిది. కారణాన్ని కచ్చితంగా గుర్తించి, చికిత్స చేస్తారు. ఇన్‌ఫెక్షన్‌ అయితే యాంటీబయోటిక్‌ మాత్రలు లేదా ఇంజెక్షన్లు బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ వీటితో ఫలితం కనబడకపోతే చిన్న కోత పెట్టి చీమును బయటకు తీయాల్సి ఉంటుంది. బొడ్డు కింద తిత్తి ఉండి, అది ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంటే తిత్తిని తొలగించాల్సి వస్తుంది. ఒకవేళ పేగులతో గానీ మూత్రాశయంతో గానీ అనుసంధానమై ఉంటే శస్త్రచికిత్స చేసి ఆ మార్గాన్ని మూసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బొడ్డు కింద చిన్న కోతతోనే దీన్ని సరిచేసే అవకాశముంది. పెద్దగా మచ్చ కూడా పడదు. ఈ పద్ధతిలో బొడ్డు కింద చిన్న కోత పెట్టి.. బొడ్డు భాగాన్ని కాస్త పైకి లేపి.. తిత్తిని తొలగించటం లేదా మార్గాన్ని మూసేయటం చేస్తారు. తర్వాత కోతకు కుట్లు వేసి బొడ్డును తిరిగి ఏర్పాటు చేస్తారు.


మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
‘సమస్య - సలహా’ సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని