Antacids Usage: ‘అగ్ని మాపక’ మందులు! ఆచి.. తూచి..

మందుల గురించైతే ఇలాగే చెప్పుకోవాలి. జబ్బుల పని పట్టి, ఆరోగ్యాన్ని కాపాడే అమృత తుల్యమైన ఔషధాలను అనవసరంగా, అనుచితంగా వాడితే విషంగానే పరిణమిస్తాయి! కడుపు మంటను చల్లార్చి.. ప్రాణానికి హాయినిచ్చే ‘గ్యాస్‌’ మాత్రలను మనం ఇప్పుడిలాగే మార్చేసుకుంటున్నాం. ఎంత మంచివైనా వీటికీ ఓ పరిమితి ఉంది. అవసరం లేకపోయినా అదేపనిగా దీర్ఘకాలం వాడితే మేలు కన్నా కీడే ఎక్కువ.

Updated : 07 Aug 2022 17:42 IST

అనవసరం అమృతం విషం! మందుల గురించైతే ఇలాగే చెప్పుకోవాలి. జబ్బుల పని పట్టి, ఆరోగ్యాన్ని కాపాడే అమృత తుల్యమైన ఔషధాలను అనవసరంగా, అనుచితంగా వాడితే విషంగానే పరిణమిస్తాయి! కడుపు మంటను చల్లార్చి.. ప్రాణానికి హాయినిచ్చే ‘గ్యాస్‌’ మాత్రలను మనం ఇప్పుడిలాగే మార్చేసుకుంటున్నాం. ఎంత మంచివైనా వీటికీ ఓ పరిమితి ఉంది. అవసరం లేకపోయినా అదేపనిగా దీర్ఘకాలం వాడితే మేలు కన్నా కీడే ఎక్కువ.

మనం తిన్న ఆహారం జీర్ణం కావటంలో జీర్ణాశయంలోని ఆమ్లం కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణాశయ కణాల నుంచి పుట్టుకొచ్చే ఇది ఎంజైమ్‌లను ప్రేరేపిస్తూ ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, బి12 వంటి లవణాలు, ఖనిజాలు, విటమిన్లను శరీరం గ్రహించుకోవటానికీ తోడ్పడుతుంది. మరోవైపు జీర్ణాశయం గోడలోని ఇతర కణాలు బైకార్బోనేట్‌, జిగురును ఉత్పత్తి చేస్తుంటాయి. ఇవి ఆమ్లం గాఢత పెరగకుండా, సున్నితమైన జీర్ణాశయం గోడ దెబ్బతినకుండా కాపాడుతుంటాయి. కొందరిలో ఈ ఆమ్లం అవసరానికి మించి ఉత్పత్తి అవుతుంటుంది. జీర్ణాశయాన్నీ దాటుకొని వచ్చేస్తుంటుంది. ఛాతీలో మంట, జీర్ణాశయ పుండ్ల (అల్సర్ల) వంటి సమస్యలకు ఇదే మూలం. ఆమ్లం పైకి ఎగదన్నుకొని వస్తే అన్నవాహిక గోడను చికాకుకు గురిచేయొచ్చు, వాచిపోయేలా చేయొచ్చు. మోతాదులు మరీ పెరిగితే జీర్ణాశయంలో, ఆంత్రమూలంలో (డియోడినమ్‌) పుండ్లు పడొచ్చు. ఇలాంటి సమస్యల చికిత్స కోసం పుట్టుకొచ్చిన గొప్ప ఔషధాలు ఓమిప్రజోల్‌ వంటి ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ (పీపీఐలు). మనం ‘మార్నింగ్‌ గ్యాస్‌ పిల్స్‌’గా పిలుచుకునే మందులివే. జీర్ణాశయంలో ఆమ్లం స్థాయులను తగ్గించే ఇవి ఛాతీలో మంట, అల్సర్ల చికిత్సలో విప్లవాత్మక మార్పునే తీసుకొచ్చాయి. అల్సర్‌ అంటే శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేదని భావించే స్థితి నుంచి మామూలు సమస్య స్థాయికి తీసుకొచ్చేశాయి. ఇంతటి మహత్తరమైన ఔషధాలను అనుచితంగా, అనవసరంగా వాడుతుండటమే విషాదం. ఆసుపత్రుల్లో చేరినవారిలోనూ 68% మందిలో వీటిని సరైన విధంగా వాడటం లేదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముందు జాగ్రత్త చికిత్సలో భాగంగానూ సుమారు 52.5% మందికి అవసరం లేకపోయినా ఇచ్చేస్తుండటం గమనార్హం. అంతేకాదు, కోర్సు పూర్తయిన తర్వాతా ఎంతోమంది డాక్టర్‌ సలహా తీసుకోకుండానే సొంతంగా కొనుక్కొని వేసుకోవటమూ పరిపాటిగా మారిపోయింది. గమనించాల్సి విషయం ఏంటంటే- పీపీఐలు స్వల్ప కాలిక చికిత్స కోసం ఉద్దేశించినవే. అవసరాన్ని బట్టి కొందరికి దీర్ఘకాలం వాడుకోవాల్సి రావొచ్చు. అనవసరంగా, అదేపనిగా వాడితే ఇబ్బందులు తప్పవు. అందువల్ల ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్‌ మందులు ఎవరికి? ఎందుకు? ఎంతకాలం అవసరం? అన్నది తెలుసుకొని ఉండటం మంచిది.


దుష్ప్రభావాలపై కన్నేయండి

పీపీఐలు చేసే ప్రధానమైన పని ఆమ్లం స్థాయులను తగ్గించటం. ఇది ఇతరత్రా సమస్యలకు దారితీయొచ్చు. వీటి గురించి తెలుసుకొని జాగ్రత్త పడటం మంచిది.
* విరేచనాలు: దీర్ఘకాలం పీపీఐ మందులు వాడేవారికి క్లోస్ట్రిడియమ్‌ డిఫికల్‌ ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే విరేచనాల ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధకశక్తి తగ్గినవారికి, వృద్ధులకు, ఆసుపత్రిలో చికిత్స తీసుకునేవారికి, కొన్నిరకాల యాంటీబయోటిక్‌ మందులు (అమాక్జసిలిన్‌, సిఫ్రాఫ్లాక్జసిన్‌ వంటివి) వేసుకునేవారికి దీని ముప్పు ఎక్కువ.
* పేగుల్లో ఇన్‌ఫెక్షన్‌: ఛాతీ మంట మందుల మూలంగా చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందే అవకాశముంది. దీంతో షిగెల్లా, సాల్మోనెల్లా ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్చు. ఫలితంగా విరేచనాలతో పాటు వికారం, వాంతి, ఆకలి వేయకపోవటం వంటి సమస్యలు బయలుదేరొచ్చు.
* ఎముకలు గుల్లబారటం: తిన్న ఆహారంలోని క్యాల్షియాన్ని చిన్నపేగుల నుంచి శరీరం గ్రహిస్తుంది. ఆమ్లం ఉత్పత్తిని తగ్గించే ఛాతీమంట మందులతో ఈ సామర్థ్యం తగ్గుతుంది. దీంతో ఎముకలు గుల్లబారి తేలికగా విరిగిపోయే ప్రమాదముంది. కటి ఎముక విరిగిపోయే ముప్పు ఎక్కువ.
* విటమిన్ల లోపం: జీర్ణాశయ ఆమ్లం విటమిన్‌ బి12, ఐరన్‌ గ్రహించుకోవటానికి తోడ్పడుతుంది. ఆమ్లం తగ్గితే వీటి మోతాదులూ తగ్గుముఖం పడతాయి.
* మెగ్నీషియం తగ్గుముఖం: పీపీఐలు దీర్ఘకాలం వాడితే మెగ్నీషియం స్థాయులు పడిపోవచ్చు. దీంతో కండరాల బలహీనత, కండరాలు పట్టేయటం వంటి సమస్యలు బయలుదేరొచ్చు.
* న్యుమోనియా: ఆమ్లం స్థాయులు తగ్గితే ఒంట్లోని బ్యాక్టీరియా ఇతర భాగాలకు చాలా తేలికగా వ్యాపిస్తుంది. పడుకున్నప్పుడు కొందరికి జీర్ణాశయంలోని పదార్థాలు వెనక్కి గొంతులోకి రావొచ్చు. కొన్నిసార్లు ఇవి ఊపిరితిత్తుల్లోకీ వెళ్లిపోవచ్చు. వీటితో పాటు బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి న్యుమోనియాకు దారితీయొచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారికి, వృద్ధులకు, పొగ తాగేవారికి, ఆస్థమా గలవారికి దీని ముప్పు ఎక్కువ. పడుకున్నప్పుడు తల ఎత్తుగా ఉండేలా చూసుకుంటే దీన్ని చాలావరకు నివారించుకోవచ్చు.
* ఇతర మందులతో ఢీ: గుండెజబ్బు గలవారు గుండెపోటు, పక్షవాతం నివారణరకు క్లోపిడోగ్రెల్‌ మందు వాడుతుంటారు. ఇది రక్తాన్ని పలుచగా చేస్తూ రక్తం గడ్డలు ఏర్పడకుండా కాపాడుతుంది. పీపీఐలు.. ముఖ్యంగా ఓమిప్రజోల్‌ మందు దీని సామర్థ్యాన్ని తగ్గించే అవకాశముంది. అలాగే పీపీఐలతో క్యాన్సర్‌ చికిత్సలో వాడే మెథోట్రిక్సేట్‌ మందు మోతాదులూ పెరగొచ్చు. ఇది ఇతరత్రా దుష్ప్రభావాలకు దారితీయొచ్చు.


మానటానికీ పద్ధతుంది

పీపీఐ మాత్రలను వెంటనే మానెయ్యటం మంచిది కాదు. సగం మోతాదు నుంచి మొదలుపెట్టి క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. లేకపోతే ఆమ్లం ఉత్పత్తి పెరగొచ్చు. ఛాతీమంట ఉద్ధృతం కావొచ్చు. మాత్రల మోతాదును తగ్గించుకుంటూనే ర్యాంటిడిన్‌, యాంటాసిడ్‌ వంటి ఇతరత్రా మందులు వేసుకోవాలి.


వీటికి స్వల్పకాలమే..

* ఛాతీలో మంట: మన జీర్ణాశయానికి అన్నవాహికకు మధ్య బిగుతైన కండర వలయం (స్పింక్టర్‌) ఉంటుంది. ఇది ముద్ద కిందికి దిగగానే గట్టిగా బిగుసుకుపోతుంది. ఇలా జీర్ణాశయంలోని ఆమ్లం పైకి రాకుండా అడ్డుకుంటుంది. కొందరిలో కండర వలయం బిగువు తగ్గటం వల్ల ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని వస్తుంది (జీఈఆర్‌డీ). దీంతో ఛాతీలో మంట, పుల్లటి తేన్పులు, నోరంతా చేదుగా అనిపించటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సాధారణంగా ఛాతీలో మంటకు పీపీఐ మాత్రలను రెండు వారాల పాటు వాడుకోవాలి. అవసరమైతే 15 రోజుల చొప్పున ఏడాదికి మరో రెండు సార్లు వేసుకోవచ్చు. అల్సర్లు గలవారికైతే 1-2 నెలలు అవసరం.
* బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌: జీర్ణాశయంలో అల్సర్లకు దారితీసే హెలికోబాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా చికిత్సలో భాగంగా కొందరికి పీపీఐలు ఇవ్వాల్సి వస్తుంది. దీనికి 2-4 వారాల పాటు తీసుకుంటే సరిపోతుంది.  
* ఎన్‌ఈఆర్‌డీ: కొందరికి జీఈఆర్‌డీ లక్షణాలు వేధిస్తున్నా గ్యాస్ట్రోస్కోపీ పరీక్షలో ఎలాంటి మార్పులూ కనిపించవు. ఇలాంటివారికి రెండు వారాల పాటు పీపీఐలు ఇవ్వచ్చు. కొందరికి దీర్ఘకాలం అవసరమవ్వచ్చు.


జీవనశైలి మార్పులూ ముఖ్యమే

రెండు వారాల పాటు మందులు వాడినా ఛాతీలో మంట తిరగబెడితే ముందుగా జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ముఖ్యం. బరువు తగ్గించుకోవటం, తిన్న వెంటనే నిద్రించకపోవటం, పొగ అలవాటు మానెయ్యటం, పడుకున్నప్పుడు తల ఎత్తుగా ఉండేలా చూసుకోవటం మంచిది. అవసరమైతే ర్యాంటిడిన్‌, యాంటాసిడ్‌ వంటి ఇతరత్రా మందులు తీసుకోవచ్చు. అప్పటికీ ఫలితం కనిపించకపోతే మరో దఫా పీపీఐలు తీసుకోవచ్చు.


అన్నింటికీ కాదు!

మనదగ్గర చాలామంది పొట్ట ఉబ్బినా, తేన్పులు వస్తున్నా, కింది నుంచి గ్యాస్‌ పోతున్నా, ఏమాత్రం కడుపునొప్పిగా ఉన్నా వెంటనే పీపీఐలు వేసుకుంటుంటారు. ఇది తప్పు. ఛాతీలో మంట లేకపోతే వీటిని వాడుకున్నా ఉపయోగం ఉండదని గుర్తించాలి. కడుపు సమస్యలన్నింటికీ ఇవే పరిష్కారమని భావించటం తగదు.


దీర్ఘకాలం ఎవరికి?

ముందు జాగ్రత్త కోసమో, లక్షణాలు అదుపులో ఉండటానికో కొందరికి దీర్ఘకాలం పీపీఐలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. క్రమం తప్పకుండా పరిశీలిస్తూ అవసరమైతే మోతాదులు మార్చుకోవాల్సి ఉంటుంది.
* అల్సర్లు మానాక: జీర్ణాశయంలో పుండ్లకు చికిత్స తీసుకున్నాక సమస్య అదుపులో ఉండటానికి పీపీఐలను ఎక్కువకాలం ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పుండ్ల నుంచి రక్తం రావటం, పేగులకు రంధ్రం పడటం, సమస్య తిరగబెట్టటం వంటి ముప్పులు ఎక్కువగా గలవారికి ఇస్తారు.
* అన్నవాహిక సన్నబడటం: ఆమ్లం పైకి ఎగదన్నుకువచ్చేవారిలో కొందరికి అన్నవాహిక కణజాలం పేగుల మాదిరిగా మారిపోతుంది (బ్యారెట్స్‌ ఈసోఫేగస్‌). కొందరికి అన్నవాహిక మార్గం సన్నబడొచ్చు (స్ట్రిక్చర్‌). ఇలాంటివారికి లక్షణాలు అదుపులో ఉండటానికి దీర్ఘకాలం వాడుకోవాల్సి ఉంటుంది.
* ఆస్ప్రిన్‌ వాడేవారికి: గుండెపోటు, పక్షవాతం నివారణ కోసం తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ వేసుకునేవారికీ.. ముఖ్యంగా 75 ఏళ్లు పైబడినవారికి  దీర్ఘకాలం అవసరమవుతాయి. ఎన్‌ఎస్‌ఐడీ రకం నొప్పి మందులు వాడేవారికీ ఎక్కువకాలం ఇవ్వాల్సి రావొచ్చు.
* జీర్ణాశయ కణితి: అరుదుగానే అయినా కొందరికి జీర్ణాశయంలో కణితి (గ్యాస్ట్రినోమా) మూలంగా ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది. ఇలాంటివారికీ ఎక్కువ కాలం ఇవ్వాల్సి వస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని