కాలేయం బాగా పనిచేయాలంటే?

కాలేయం దెబ్బతింటోందని గుర్తించటమెలా? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? కాలేయం...

Updated : 11 Feb 2020 00:09 IST

సమస్య - సలహా

సమస్య: కాలేయం దెబ్బతింటోందని గుర్తించటమెలా? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- జక్కా శోభనాద్రి, నూజివీడు

సలహా: పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లను విడగొట్టటం.. జీర్ణక్రియకు తోడ్పడే పైత్యరసాన్ని ఉత్పత్తి చేయటం, విషతుల్యాలను బయటకు పంపటం వంటి ఎన్నో పనులకు కాలేయం చాలా కీలకం. దీన్ని దెబ్బతీసే సమస్యల్లో ప్రధానమైంది హెపటైటిస్‌. దీనికి మూలం హెపటైటిస్‌ వైరస్‌లు. కొన్ని రకాల మందులు, మద్యం, మాదక ద్రవ్యాలు, విషతుల్యాల వంటివీ దీనికి దారితీయొచ్ఛు హెపటైటిస్‌ చాలామందికి రెండు, మూడు నెలల్లో తగ్గిపోతుంది. కొందరికి ఆరు నెలలు పట్టొచ్ఛు ఇలా ఆరు నెలల్లోపు తగ్గే సమస్యను అక్యూట్‌ ఇన్‌ఫెక్షన్‌ అంటారు. ఆరు నెలలు దాటినా తగ్గకపోతే దీర్ఘకాల కాలేయ సమస్యగా భావిస్తారు. హెపటైటిస్‌ బారినపడ్డవారిలో కళ్లు, చర్మం, మూత్రం పచ్చబడుతుంది. మలం పాలిపోయినట్టు ఉంటుంది. ఆకలి, బరువు తగ్గుతాయి. కడుపునొప్పి రావొచ్ఛు పొగ తాగేవారికి దాని మీద ఆసక్తి తగ్గుతుంది. అక్యూట్‌ హెపటైటిస్‌ నూటికి 99 మందిలో నయమైపోతుంది. కొందరు దీనికి పసరు మందులు వాడుతుంటారు. ఇది తగదు. చర్మం మీద వాతలు పెట్టించుకోవటం, పథ్యాల వంటివీ చేయొద్ధు క్రమం తప్పకుండా డాక్టర్‌కు చూపించుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలి. ప్రత్యేకమైన మందులేవీ అవసరం లేదు. కొందరిలో సమస్య తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా మగతగా ఉన్నా, మూత్రం తగ్గినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ఇక దీర్ఘకాల సమస్యలో కాలేయ సామర్థ్యం తగ్గుతుంది. ప్లీహం పెరగటం, కాలేయం కుంచించుకుపోవటం, పొట్టలో నీరు చేరటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కాలేయం గట్టి పడుతోందనటానికి సూచనలు. దీర్ఘకాల హెపటైటిస్‌ గలవారు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాల్సి ఉంటుంది. పరిశుభ్రతను పాటించటం ద్వారా హెపటైటిస్‌ బారినపడకుండా కాపాడుకోవచ్ఛు ఒకరు వాడిన సూదులు, బ్లేడ్లు, టూత్‌బ్రష్‌లు మరొకరు వాడకపోవటం మంచిది. మద్యం అలవాటుకు దూరంగా ఉండటం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్ఛు అలాగే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు