గుండె వైరిస్‌!

తుపాను వెలిసిందని సంతోషించాలా? వాటిల్లిన నష్టాన్ని తలచుకొని విచారించాలా? కొవిడ్‌-19 ఇప్పుడిలాంటి సందిగ్ధంలోనే పడేస్తోంది. ఇది చిన్నారులకు, యుక్త వయసు పిల్లలకు పెద్ద సంక్షోభాన్నే తెచ్చిపెడుతోంది. గుండెను అతలాకుతలం చేయటమే కాదు, ఇతరత్రా అవయవాలనూ దెబ్బతీసి షాక్‌లోకి నెడుతోంది. కొన్ని లక్షణాలు గుండెజబ్బులను తలపిస్తున్నా అసలు సమస్య అంతు చిక్కటం లేదు. పిల్లలను కరోనా పెద్దగా ఇబ్బంది పెట్టటం లేదనుకుంటున్న తరుణంలో ఇది పెద్ద కలవరమే పుట్టిస్తోంది. కరోనా జబ్బుతో బాధపడుతున్నప్పుడే కాదు, తగ్గిన తర్వాతా దీని దుష్ప్రభావాలు మొదలవుతుండటం ఆందోళనకరం....

Published : 26 May 2020 00:42 IST

తుపాను వెలిసిందని సంతోషించాలా? వాటిల్లిన నష్టాన్ని తలచుకొని విచారించాలా? కొవిడ్‌-19 ఇప్పుడిలాంటి సందిగ్ధంలోనే పడేస్తోంది. ఇది చిన్నారులకు, యుక్త వయసు పిల్లలకు పెద్ద సంక్షోభాన్నే తెచ్చిపెడుతోంది. గుండెను అతలాకుతలం చేయటమే కాదు, ఇతరత్రా అవయవాలనూ దెబ్బతీసి షాక్‌లోకి నెడుతోంది. కొన్ని లక్షణాలు గుండెజబ్బులను తలపిస్తున్నా అసలు సమస్య అంతు చిక్కటం లేదు. పిల్లలను కరోనా పెద్దగా ఇబ్బంది పెట్టటం లేదనుకుంటున్న తరుణంలో ఇది పెద్ద కలవరమే పుట్టిస్తోంది. కరోనా జబ్బుతో బాధపడుతున్నప్పుడే కాదు, తగ్గిన తర్వాతా దీని దుష్ప్రభావాలు మొదలవుతుండటం ఆందోళనకరం. ప్రస్తుతానికి ‘పీడియాట్రిక్‌ మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌’గా, ‘మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రెన్‌’గా పిలుచుకుంటున్నప్పటికీ దీనికింకా కచ్చితమైన పేరు పెట్టలేదు. ఇంతకీ ఏంటీ సమస్య? పిల్లలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోంది?

పీఎంఎస్‌ఐఎస్‌ 5 నెలల పసికందు దగ్గర్నుంచి 18 ఏళ్ల పిల్లల వరకూ ఎవరికైనా రావొచ్చు

పీఎంఎస్‌ఐఎస్‌ సమస్యలు ఒకదాంతో మరోటి కలిసిపోయి ఉండటం వల్ల గుర్తించటం కష్టమైపోతోంది

కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ వచ్చిపోయిన తర్వాత 2-4 వారాల్లో పీడియాట్రిక్‌ మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ తలెత్తే ప్రమాదముంది.

రోగనిరోధకశక్తి సరిగా అభివృద్ధి చెందకపోవటం, అతిగా స్పందించటం పిల్లల పాలిట శాపంగా మారుతోంది

కొత్త కరోనా వైరస్‌ పిల్లలకు అంతగా సోకటం లేదు. సోకినా తేలికపాటి లక్షణాలకే పరిమితమవుతోంది. ఇప్పటివరకూ మనం భావిస్తున్నది, మనకు భరోసా ఇస్తున్నది ఇదే. నిజమే. కరోనా వైరస్‌ పిల్లల్లో 2.5% మందిలోనే కనిపిస్తోంది. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా మామూలు చికిత్సతోనే తగ్గిపోతోంది. కొవిడ్‌ బాధితుల్లో శ్వాసకోశ వ్యవస్థ ముఖ్యంగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటుండటం చూస్తున్నదే. ఇలాంటి తీవ్ర సమస్య కూడా పిల్లల్లో చాలా తక్కువే. కథ అక్కడితోనే ముగియటం లేదు. కొందరు పిల్లల్లో కరోనా జబ్బు గుండెను, ఇతర అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇదే పీడియాట్రిక్‌ మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌ఐఎస్‌). ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వంటి దేశాల్లో ఎంతోమంది పిల్లలు దీని బారినపడుతుండటం, అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుండటం కలవరపెడుతోంది. కొందరు మృత్యువాత పడుతున్నారు కూడా. మనదేశంలోనూ ఇలాంటి సమస్య కనిపించటం ఆరంభమైంది. కానీ దీన్ని చాలామంది పోల్చుకోలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగానూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. నిపుణులను సైతం అయోమయంలో పడేస్తోంది. ఉన్నట్టుండి గుండె, ఇతర అవయవాలు, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థలన్నీ ఎందుకు, ఎలా ప్రభావితం అవుతున్నాయనేది అంతు పట్టటం లేదు. దీని బారినపడుతున్న పిల్లలంతా అంతకుమందు ఎలాంటి గుండెజబ్బులు లేనివారే. అంతా ఆరోగ్యంగా ఉన్నవారే కావటం గమనార్హం. కొవిడ్‌-19 ఉద్ధృతంగా ఉన్న ప్రాంతాల్లోని పిల్లలకు దీని ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. ఇది 5 నెలల పసికందు దగ్గర్నుంచి 18 ఏళ్ల పిల్లల వరకూ ఎవరికైనా రావొచ్ఛు అదృష్టవశాత్తు చికిత్సతో చాలావరకు పిల్లలు పూర్తిగా కోలుకుంటున్నారు. కాకపోతే దీన్ని సత్వరం గుర్తించి, స్పందించటం అత్యవసరం. లేకపోతే ప్రాణాపాయానికి దారితీసే అవకాశముంది.

కొందరిలోనే వైరస్‌

కొత్త కరోనా వైరస్‌లో ‘ఎల్‌’, ‘ఎస్‌’ అని రెండు రకాలున్నాయి. ‘ఎల్‌’ రకం చాలా తీవ్రమైంది. దీంతో పోలిస్తే ‘ఎస్‌’ రకం అంత ప్రమాదకరమైంది కాదు. మనదేశంలో చాలావరకు ‘ఎస్‌’ రకం వైరసే వ్యాపిస్తున్నట్టు తోస్తోంది. అలాగని అజాగ్రత్త పనికిరాదు. పిల్లల విషయంలో నిర్లక్ష్యం అసలే వద్ధు కొవిడ్‌-19తో బాధపడుతున్న సమయంలో గానీ ఇన్‌ఫెక్షన్‌ తగ్గిపోయిన తర్వాత గానీ గుండె వైఫల్యం వంటి లక్షణాలు పొడసూపే అవకాశముంది. మరో ముఖ్యమైన విషయం- దాదాపు సగం మందిలోనే వైరస్‌ పాజిటివ్‌గా ఉండటం. మిగతా సగం మందిలో నెగెటివ్‌గా తేలుతున్నా అప్పటికే ఇంట్లో ఎవరో ఒకరు వైరస్‌ బారినపడి ఉంటుండటం, కొందరు పిల్లల్లో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు కనిపిస్తుండటం గమనార్హం. అంటే పెద్దవాళ్ల నుంచి పిల్లలకు వైరస్‌ సోకి, పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోయి ఉండొచ్చన్నమాట. ఆ తర్వాతే తీవ్ర సమస్యగా పరిణమిస్తోందన్నమాట. మనదేశంలో ప్రస్తుతం లక్షణాలు లేనివారికి కరోనా పరీక్షలు నిర్వహించటం లేదు. అందువల్ల ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో తేల్చుకోవటం కష్టమైపోతోంది. ఇంట్లో పెద్దవాళ్లకు కరోనా సోకినా కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్ఛు లక్షణాలున్నా అంత తీవ్రంగా ఉండకపోవచ్ఛు ఇన్‌ఫెక్షన్‌ అంతటితోనే తగ్గిపోనూ వచ్ఛు కానీ వారి నుంచి వైరస్‌ పిల్లలకు సోకకూడదనేమీ లేదు. కొందరిలో కొవిడ్‌ పాజిటివ్‌గా రావటానికి, కొందరిలో లేకపోవటానికి ఇదే కారణమవుతుండొచ్ఛు ఏదేమైనా ప్రస్తుతం పిల్లల్లో హఠాత్తుగా గుండె వైఫల్యం వంటి లక్షణాలు కనిపించటం కొవిడ్‌-19 దుష్ప్రభావాల ఫలితమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం పేర్కొంటోంది. కొవిడ్‌ వచ్చి పోయిన ఒకట్రెండు వారాల్లో ఇలాంటి సంకేతాలు కనిపించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తోంది. అందుకే పిల్లల్లో ఆయాసం, కాళ్లవాపు, దద్దు వంటి విపరీత లక్షణాలు కనిపిస్తే ముందుగా ఇంట్లో ఎవరికైనా కరోనా సోకిందా అనేది చూడటం ముఖ్యం. తల్లిదండ్రులకు తప్పకుండా కరోనా పరీక్ష చెయ్యాల్సి ఉంటుంది.

ఏంటీ కారణం?

ఏదైనా కొత్త వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన తర్వాత ఒంట్లో రోగనిరోధకశక్తి దాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. పిల్లల్లో ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. మరోవైపు రోగనిరోధకశక్తి అతిగా స్పందించటమూ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇన్‌ఫెక్షన్లు తలెత్తినప్పుడు రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టి కణాలు వైరస్‌ను ఎదుర్కొవటానికి ఇమ్యునోగ్లోబులిన్‌ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి (కణ మాధ్యమ రోగనిరోధకశక్తి). వైరస్‌ను ఎదుర్కోవటానికిది సరిపోతుంది. కొందరు పిల్లల్లో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకపోవటానికి కారణం ఇదే. ప్రొటీన్‌ తగినంత తీసుకోనివారిలో, పోషణలోపం గలవారిలో ఇమ్మునోగ్లోబులిన్‌ సరిగా ఉత్పత్తి కాకపోవచ్ఛు కొందరిలో స్వభావరీత్యానూ అంతగా తయారుకాకపోవచ్ఛు ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. మరోవైపు- కొందరిలో వైరస్‌ను ఎదుర్కోవటానికి యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి అవుతుండొచ్చు (యాంటీబాడీ డిపెండెంట్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌). ఇవి విపరీతంగా స్పందిస్తూ అదేపనిగా దాడిచేయొచ్చు (రోగనిరోధక వ్యవస్థ గతి తప్పటం). అంటే ఒంట్లో వైరస్‌ లేకపోయినా యాంటీబాడీలు గుండె, రక్తనాళాలు, పేగుల వంటి వాటిపై దాడిచేసి దెబ్బతీయొచ్చన్నమాట. పీడియాట్రిక్‌ మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌కు ఇదే కారణమవుతుండొచ్చని భావిస్తున్నారు. కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ వచ్చిపోయిన తర్వాత 2-4 వారాల్లో ఇది తలెత్తే ప్రమాదముంది.

సమస్యలు 3 రకాలు

పీడియాట్రిక్‌ మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ప్రధానంగా మూడు రకాలుగా కనిపిస్తోంది. ఇవి ఒకదాంతో మరోటి కలిసిపోయి ఉండటం వల్ల గుర్తించటం, చికిత్స చేయటం కష్టమైపోతోంది. ఈ నేపథ్యంలో వీటి గురించి అవగాహన కలిగుండటం అత్యవసరం.

1. టాక్సిక్‌ షాక్‌ సిండ్రోమ్‌: పిల్లలు హఠాత్తుగా జబ్బు పడిపోవటం దీని ప్రత్యేకత. దీనికి మూలం ఇన్‌ఫెక్షన్‌ మూలంగా పుట్టుకొచ్చే విషతుల్యాలు అవయవాల మీద దాడి చేయటం. అలాగే రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన శరీరం మీదే దాడి చేయటం, ఇన్‌ఫెక్షన్‌ వచ్చిపోయాక రోగనిరోధక శక్తి మారిపోవటమూ ఇందుకు దోహదం చేస్తుండొచ్ఛు షాక్‌ సిండ్రోమ్‌ బారినపడ్డవారిలో ఉన్నట్టుండి రక్తపోటు పడిపోతుంది. గుండె, శ్వాస వేగం పెరుగుతాయి. చివరికి షాక్‌లోకి వెళ్లిపోతారు. మొదట్లో ఇది ఇటలీ, బ్రిటన్‌లో ఎక్కువగా కనిపించగా.. ఇప్పుడు అమెరికాలోనూ అధికంగా కనిపిస్తోంది. మనదేశంలోనూ ఇలాంటి కేసులు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి గానీ గుర్తించటంలో పొరపడుతున్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే గానీ అసలు విషయం బయటపడటం లేదు.

2. గుండె వాపు (మయో కార్డైటిస్‌): షాక్‌ సిండ్రోమ్‌తో పోలిస్తే ఇదంత తీవ్రమైంది కాదు. ఇందులో గుండె మాత్రమే ప్రభావితమవుతుంది. గుండె కండరం దెబ్బతిని పంపింగ్‌ సామర్థ్యం తగ్గిపోతుంది. సాధారణంగా గుండె సామర్థ్యం 70% వరకు ఉండాలి. వీరిలో ఇది 30% కన్నా తక్కువకు పడిపోతుంది. దీంతో ఆయాసానికి తలెత్తుతుంది. గుండె వైఫల్యం దీర్ఘకాలంగా ఉంటే దాన్ని తట్టుకునేలా శరీరం సన్నద్ధమవుతూ వస్తుంటుంది. ఉన్నట్టుండి గుండె వైఫల్యం సంభవించటం వల్ల వీరిలో ఊపిరితిత్తుల్లో, కడుపులో నీరు చేరుతుంది. ఆయాసం తలెత్తుతుంది. మనదేశంలోనూ ఇలాంటి లక్షణాలతో కొన్ని కేసులు ఆసుపత్రులకు వస్తున్నాయి. దీన్ని గుర్తించటం, అవసరమైన చికిత్స చేయటం చాలా ముఖ్యం.

3. కవాసాకి తరహా జబ్బు: ఎక్కువమందిలో కనిపిస్తున్నది ఇదే. నిజానికి కవాసాకి జబ్బు మనకు కొత్త కాదు. మనదేశంలో చాలాకాలంగా చూస్తున్నదే. ఇది ఐదేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువ. ఇందులో శరీరమంతా ఎర్రటి దద్దు కనిపిస్తుంది. కళ్లు, నాలుక ఎర్రబడుతుంటాయి. రక్తనాళాల్లోంచి ద్రవం బయటకు వచ్చి కణజాలాల్లోకి చేరటం వల్ల కాళ్ల వాపులు మొదలవుతాయి. కీళ్లు, పెదాల్లోనూ వాపు తలెత్తుతుంది. ఒక్కోసారి మెడ దగ్గర లింఫు గ్రంథులూ వాస్తాయి. మిగతా సమస్యలతో పోలిస్తే ఇందులో జ్వరం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చిరాకు పడిపోతుంటారు. స్థిమితంగా ఉండరు. కరోనా జబ్బు బారినపడ్డ కొందరు పిల్లల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి కవాసాకి జబ్బు మాదిరిగానే ఉంటున్నాయి కానీ పూర్తిగా లక్షణాలు సరిపోవటం లేదు. అందుకే దీన్ని కవాసాకి తరహా జబ్బుగా భావిస్తున్నారు.

నిర్ధారణ ముఖ్యం

చాలావరకు ఆయా లక్షణాలతోనే మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ను పోల్చుకోవచ్ఛు దీన్ని అనుమానిస్తే కొన్ని పరీక్షలు చేసి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్లలో మాదిరిగా పిల్లల్లో సీటీ స్కాన్‌, ఎక్స్‌రే ద్వారా సమస్యను నిర్ధారించలేం. వీరికి రక్త పరీక్షలే కీలకం.

మామాలుగా సీఆర్‌పీ 3 మి.గ్రా. కన్నా తక్కువగా ఉండాలి. కానీ మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌లో విపరీతంగా పెరిగిపోతోంది. కొందరిలో 100 మి.గ్రా. దాటొచ్ఛు ఈఎస్‌ఆర్‌ సైతం ఎక్కువగానే ఉంటుంది. ప్రొకాల్సిటోనిన్‌, ఫెరిటిన్‌ మోతాదులూ పెరుగుతాయి. ఇవన్నీ వాపు ప్రక్రియ ఉద్ధృతంగా ఉందనటానికి సూచికలే. ఈ పరీక్షలతో పాటు డి-డైమర్‌, ట్రొపోనిన్‌ పరీక్షలు చేస్తే సమస్య స్పష్టంగా బయటపడుతుంది.

ఎకో కార్డియోగ్రామ్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో గుండె సామర్థ్యం బయటపడుతుంది. ఊపిరితిత్తుల చుట్టూ, కడుపులో నీరు చేరటం, గుండె కవాటాలు లీక్‌ అవ్వటం వంటివీ తెలుస్తాయి. కొందరిలో గుండె కండరానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల గోడ అక్కడక్కడా పలుచబడి ఉబ్బిపోవచ్చు (అన్యూరిజమ్‌). ఇదీ ఎకో కార్డియోగ్రామ్‌లో తెలుస్తుంది. ●

గుర్తించేదెలా?

పీడియాట్రిక్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ను తేలికగానే గుర్తించొచ్ఛు ప్రధాన లక్షణం తీవ్రమైన జ్వరం. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, ఒంటిపై దద్దు, తీవ్రమైన అలసట వంటివీ ఉండొచ్ఛు

●మామూలు జ్వరం, దగ్గు, తుమ్ముల వంటివి ఉంటే అంతగా భయపడాల్సిన పనిలేదు. జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఉన్నట్టుండి జ్వరం మరీ తీవ్రంగా పెరుగుతుంటే ప్రమాదకరమని తెలుసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారన్‌హీట్‌, అంతకన్నా ఎక్కువగా ఉంటూ.. ఏమాత్రం తగ్గకపోతున్నట్టయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, గుండె వేగం పెరగటం, అస్థిమితం, తికమకపడటం వంటివి ఉంటే ఇంకా తీవ్రంగా పరిగణించాలి.

జ్వరం మామూలుగానే ఉంటూ ఆయాస పడుతున్నా, శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నా గుండె వాపు ఉందేమో అనుమానించాలి.

జ్వరం నాలుగైదు రోజుల పాటు మాములుగా ఉండి.. కాళ్లు చేతుల వాపులు, ఒంటిపై ఎర్రటి దద్దు, కళ్లు ఎర్రబడటం, పెదాలు పగలటం, నాలుక ఎర్రబడటం వంటివి ఉంటే కవాసాకి తరహా జబ్బును అనుమానించాలి. ●

సమస్యలను బట్టి చికిత్స

మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌లో ఆయా సమస్యలను బట్టి చికిత్స చేస్తారు. శ్వాస సరిగా తీసుకోకపోతే వెంటిలేటర్‌ మీద పెట్టాల్సి ఉంటుంది. బీపీ పడిపోతే నార్‌ అడ్రినలిన్‌, డొపమైన్‌, అడ్రినలిన్‌ వంటి మందులు (ఐనోట్రొపిక్‌ మెడికేషన్స్‌) ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే మిథైల్‌ ప్రెడ్నిసోలన్‌ అనే స్టిరాయిడ్‌ ఇస్తారు. రోగనిరోధకశక్తిని సరిదిద్దే ఐవీ గామాగ్లొబులిన్‌, మొనోక్లొనల్‌ యాంటీబాడీలు ఉపయోగపడతాయి. మందులతో పాటు మంచి పోషకాహారమూ ముఖ్యమే. వీటితో కొంతవరకు సమస్యను నయం చేయొచ్ఛు కాకపోతే టాక్సిక్‌ షాక్‌ సిండ్రోమ్‌కు చికిత్స చేయటం చాలా కష్టం. దీన్ని తొలిదశలోనే గుర్తించి, తగు చికిత్స చేయకపోతే అవయవాలన్నీ దెబ్బతినే ప్రమాదముంది. ఇలాంటి స్థితిలోకి వెళ్లిన పిల్లల్లో సుమారు 50-80% మంది మృత్యువాత పడుతుండటం గమనార్హం. ఇది అరుదుగా దాడిచేస్తుండటమే ఒకింత ఊరట కలిగించే విషయం. అందువల్ల పరిస్థితి ముదరక ముందే మేల్కోవాలి.●

జాగ్రత్తలు తప్పనిసరి

పెద్దవాళ్లకు దగ్గు, జ్వరం వంటి లక్షణాలుంటే పిల్లలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

పిల్లలకూ చేతులను కడుక్కోవటం, ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు నేర్పించాలి.

పిల్లలకు ఆయాసం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌కు చూపించాలి.

కరోనా వైరస్‌ నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో చెప్పలేం. ఇందుకు ఆరు నెలలు పట్టొచ్చు, ఏడాది, రెండేళ్లు పట్టొచ్ఛు అందుకే మున్ముందూ జాగ్రత్తలు అవసరం. పిల్లలు బడి బస్సు ఎక్కటానికి ముందే చేతులకు శానిటైజర్‌ రాసుకునేలా, బస్సులో ఇతర పిల్లలతో అంటుకొని కూర్చోకుండా చూసుకోవాలి. మూడేళ్లు దాటిన పిల్లలంతా ఎల్లవేళలా మాస్కు ధరించటం తప్పనిసరి. బడిలోనూ పక్క పక్క సీట్లలో కూర్చోనీయొద్ధు భోజనాల వేళలో అందర్నీ ఒకే దగ్గర గుమిగూడనీయొద్ధు ఒకరోజున సగం మంది పిల్లలను, మిగతా వారిని తర్వాతి రోజున బడికి వచ్చేలా చూసుకోవాలి. బడికి రాని పిల్లలకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పించొచ్ఛు ఆటల విషయంలోనూ జాగ్రత్త అవసరం. మైదానంలో సామూహిక ఆటలు ఆడకుండా చూసుకోవాలి. స్కిప్పింగ్‌, జంపింగ్‌ వంటి ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని