అల్జీమర్స్‌కు ఫ్లూ టీకా రక్ష

ఒక టీకా తీసుకుంటే మరో రక్షణ ఉచితం! ఫ్లూ, న్యుమోనియా టీకాల గురించి ఇలాగే చెప్పుకోవాలేమో. ఇవి వృద్ధాప్యంలో తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే అల్జీమర్స్‌ ముప్పు తగ్గటానికీ

Published : 04 Aug 2020 01:25 IST

ఒక టీకా తీసుకుంటే మరో రక్షణ ఉచితం! ఫ్లూ, న్యుమోనియా టీకాల గురించి ఇలాగే చెప్పుకోవాలేమో. ఇవి వృద్ధాప్యంలో తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే అల్జీమర్స్‌ ముప్పు తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు తేలింది మరి. 65-75 ఏళ్ల వయసులో న్యుమోనియా టీకా తీసుకున్నవారికి అల్జీమర్స్‌ ముప్పు సుమారు 40% తగ్గుతున్నట్టు బయటపడింది. కనీసం ఒకసారి ఫ్లూ టీకా తీసుకున్నవారికీ అల్జీమర్స్‌ ముప్పు 17% తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ వంటి సూక్ష్మక్రిములకు అల్జీమర్స్‌ జబ్బుకు సంబంధం ఉంటున్నట్టు చాలాకాలం కిందటే గుర్తించారు. ఇందుకు రోగనిరోధకశక్తి క్షీణించటం కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. కొన్ని టీకాలు వాటికి ఉద్దేశించిన ఇన్‌ఫెక్షన్ల మీద పనిచేయటమే కాదు, ఇతరత్రా ప్రయోజనాలూ కల్పిస్తాయి. బీసీజీ టీకా కొవిడ్‌-19 రక్షణకూ ఉపయోగపడుతున్నట్టు ఇటీవల తేలిన సంగతి తెలిసిందే. టీకాలు విస్తృత స్థాయిలో రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుండొచ్చని, అందుకే ఇతరత్రా సమస్యల నుంచీ రక్షణ కల్పిస్తుండొచ్చన్నది పరిశోధకుల భావన. ఫ్లూ, న్యుమోనియా టీకాలు సైతం ఇలాగే ఉపయోగపడుతుండొచ్చనీ అనుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని