జ్వరమా? కరోనా కాకపోవచ్చు!

అసలే కరోనా విజృంభణ, ఆపై వాన కాలం! ఇక చెప్పేదేముంది? ఏమాత్రం ఒళ్లు వెచ్చబడ్డా కరోనా కావొచ్చనే చాలామంది బెంబేలెత్తిపోతున్నారు. నిజానికి ఒక్క కరోనా మాత్రమే కాదు. కాలానుగుణంగా వచ్చే జలుబు, ఫ్లూ.. దోమలతో వ్యాపించే డెంగీ, చికున్‌ గన్యా, మలేరియాలాంటివన్నీ జ్వరాలను వెంటబెట్టుకొచ్చేవే. ఇప్పుడివి పెరుగుతున్నాయి కూడా. అందుకే జ్వరమా? కరోనా కాకపోవచ్చనీ అనుమానించాల్సి వస్తోంది.

Published : 18 Aug 2020 01:09 IST

అసలే కరోనా విజృంభణ, ఆపై వాన కాలం! ఇక చెప్పేదేముంది? ఏమాత్రం ఒళ్లు వెచ్చబడ్డా కరోనా కావొచ్చనే చాలామంది బెంబేలెత్తిపోతున్నారు. నిజానికి ఒక్క కరోనా మాత్రమే కాదు. కాలానుగుణంగా వచ్చే జలుబు, ఫ్లూ.. దోమలతో వ్యాపించే డెంగీ, చికున్‌ గన్యా, మలేరియాలాంటివన్నీ జ్వరాలను వెంటబెట్టుకొచ్చేవే. ఇప్పుడివి పెరుగుతున్నాయి కూడా. అందుకే జ్వరమా? కరోనా కాకపోవచ్చనీ అనుమానించాల్సి వస్తోంది.

నమ్మినా నమ్మకపోయినా జ్వరం జబ్బు కాదు. ఒంట్లో బ్యాక్టీరియా, వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వంటి రకరకాల సమస్యలకు ఇదో సంకేతం! ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి మన రక్షణ వ్యవస్థకు తోడ్పడే గొప్ప సాధనం! మన శరీర ఉష్ణోగ్రతను మెదడులోని హైపోథలమస్‌ నియంత్రిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌ల వంటివి ప్రవేశించినట్టు గుర్తించగానే రోగనిరోధక కణాలు కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి హైపోథలమస్‌ను ప్రేరేపించి, ఉష్ణోగ్రత పెరిగేలా చేస్తాయి. ఫలితంగా మన ఒంట్లో హాని కారక క్రిములు వృద్ధి చెందకుండా, వాటికి ప్రతికూల వాతావారణం ఏర్పడుతుంది. అంటే జ్వరం మనకు మేలు చేసేదే అన్నమాట. అలాగని జ్వరాలు అంతటితోనే ఆగిపోవు. కొన్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా తగ్గిపోతే.. కొన్ని తీవ్రమై ప్రాణాల మీదికీ తేవొచ్ఛు కాబట్టే జ్వరం తీవ్రం కాకుండా చూడటానికి, వీలైనంత త్వరగా తగ్గించటానికే వైద్యులు ప్రయత్నిస్తుంటారు. కరోనా కాలంలో దీనికి మరింత ప్రాధాన్యమూ పెరిగింది. ఎందుకంటే వర్ష కాలంలో జ్వరాల ముప్పు ఎక్కువ. ఒకవైపు తేమ, చల్లగాలి వంటి వాతావరణ మార్పులు.. మరోవైపు జబ్బులను వెంటబెట్టుకొచ్చే దోమలు, కలుషిత నీరు, ఆహారం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తుంటాయి. కరోనా జబ్బుకు ఇవన్నీ తోడవటం కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. ఏది ఎలా పరిణమిస్తుందో తెలియక అంతా సతమతమైపోతున్నారు. కరోనాలో చాలామందికి లక్షణాలు కనిపించిక పోతున్నప్పటికీ కొందరిలో జ్వరానికీ దారితీస్తోంది. కాబట్టి ఏది, ఎలాంటి జ్వరమో తెలుసుకొని ఉండటం మంచిది. రోజురోజుకీ దేశంలో కరోనా పాజిటివిటీ సగటు రేటు.. అంటే పరీక్షలు చేయించుకుంటున్నవారిలో బయటపడుతున్న కేసుల శాతం తగ్గుతున్న తరుణంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఆయా లక్షణాలను బట్టి సమస్యను పోల్చుకోగలిగితే రకరకాల జ్వర పరీక్షల అవసరం తప్పుతుంది. అన్నింటికీ మించి కరోనా భయం తొలగిపోతుంది. ఇప్పుడు కరోనా కన్నా దాని భయమే తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది కదా.


కరోనా- ప్రత్యేకం

కొవిడ్‌-19లో తలెత్తే జ్వరం ప్రత్యేకమైంది. దీనికి మిగతా వాటితో పోలికే లేదు. ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లలో హఠాత్తుగా, తీవ్రంగా జ్వరం వస్తే ఇందులో చాలావరకు స్వల్ప స్థాయిలోనే (99-100 డిగ్రీల ఫారన్‌హీట్‌) ఉండిపోతోంది. కాబట్టే చాలామందికి అసలు జ్వరం వచ్చినట్టే తెలియటం లేదు. న్యుమోనియా, కణజాలాల్లో వాపు ప్రక్రియ మొదలైతే తప్ప జ్వరం తీవ్రం కావటం లేదు. పైగా కరోనా జ్వరం నడక, పనుల వంటి శారీరక శ్రమతో పెరుగుతుండటం గమనార్హం. అందుకేనేమో చాలామందిలో పగటి పూట, సాయంత్రం వేళల్లో జ్వరం బయటపడుతోంది. వీటిని బట్టి చూస్తుంటే ఒక్క జ్వర తీవ్రత ఆధారంగానే కరోనా జ్వరమా? కాదా? అన్నది పోల్చుకోవచ్చని తెలుస్తోంది.


మలేరియా- చలి ప్రధానం

చలి జ్వరం అనగానే ముందుగా అనుమానించాల్సింది మలేరియా గురించే. ఇది చలితోనే మొదలవుతుంది మరి. తర్వాత వణుకు, తీవ్ర జ్వరం తలెత్తుతాయి. చెమట్లతో ఒళ్లంతా తడిసిపోయి జ్వరం తగ్గుతుంటుంది. ఇందులో జ్వరం 104 డిగ్రీల వరకు ఉండొచ్ఛు కరోనా జ్వరం వచ్చినవారికి చలి పెట్టొచ్చు గానీ వణకటమనేది ఉండదు. దీన్ని గుర్తించటం ముఖ్యం. మలేరియా జ్వరం కొందరికి రోజూ ఉండొచ్ఛు కొందరికి రోజు విడిచి రోజు రావొచ్ఛు ప్రతి మూడు రోజులుకు ఒకసారీ రావొచ్ఛు కరోనా జ్వరంలో ఇలాంటి మార్పులేవీ ఉండవు.


ఫ్లూ- ఉన్నట్టుండి

ఫ్లూలో జ్వరం ఉన్నట్టుండి, హఠాత్తుగా మొదలవుతుంది. జ్వరం 101 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒళ్లునొప్పులూ ఎక్కువే. తుమ్ములు, ముక్కు కారటం, గొంతునొప్పి, చెవి నొప్పి, దగ్గు, గొంతు గరగర, కళ్ల నుంచి నీరు రావటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరికి గొంతు బొంగురుపోతుంది. అదే కరోనాలోనైతే జ్వరం తక్కువ. ముక్కు కారదు. గొంతు మామూలుగానే ఉంటుంది. గొంతునొప్పి ఉంటే ఉండొచ్ఛు ఫ్లూ లక్షణాలు ఒకట్రెండు రోజుల్లోనే మొదలైతే కరోనా లక్షణాలు చాలామందిలో ఐదారు రోజులకు గానీ బయటపడటం లేదు. ఫ్లూ ముప్పు పిల్లలకు ఎక్కువైతే, కరోనా జబ్బు పెద్దవారినే ఎక్కువగా వేధిస్తోంది.


డెంగీ- కళ్ల వెనక నొప్పి

డెంగీలో తీవ్రమైన జ్వరం రావటమే కాదు, తల పగిలిపోతుందేమో అన్నంతగా తలనొప్పి వేధిస్తుంది. ముఖ్యంగా కళ్ల వెనక నుంచి నొప్పి వస్తుంది. ఎవరైనా తలకు బదులు కళ్లను పట్టుకొని నొప్పితో బాధపడుతుంటే డెంగీ అనుకోవచ్ఛు ఇందులో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులూ ఎక్కువే. డెంగీలో పెద్ద సమస్య ప్లేట్‌లెట్లు తగ్గటం. దీంతో కొందరికి దద్దు రావొచ్ఛు జ్వరం తగ్గుముఖం పట్టాకే ఇవి మొదలవుతాయి. కొందరికి ఒళ్లంతా దురద పుట్టొచ్ఛు కరోనాలో ఇలాంటివేవీ ఉండవు. తలనొప్పి కూడా మాడు మీదుగా వస్తుంటుంది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్నప్పుడే సమస్యంతా. తగ్గిన తర్వాత పెద్ద ఇబ్బందేమీ ఉండదు.


చికున్‌ గన్యా- కీళ్ల నొప్పి

చికున్‌ గన్యా ప్రధాన లక్షణాలు కీళ్ల నొప్ఫి ముఖ్యంగా మోకాలు, తుంటి, మోచేయి వంటి పెద్ద కీళ్లలో నొప్పులు తీవ్రంగా ఉంటాయి. మనిషి కదలటమే కష్టం. ముడుచుకొని కూర్చుంటారు. అలా కూర్చుంటేనే హాయిగా ఉంటుంది. కరోనా జబ్బులో ఇలా కీళ్ల నొప్పులేవీ ఉండవు. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు కరోనా కాదని. చికున్‌ గన్యా లక్షణాలు కొంతకాలం విడవకుండా వేధించినా, ప్రాణాంతకం కావు. అదే కరోనా తీవ్రమైతే ప్రాణాల మీదికీ వస్తుంది.


టైఫాయిడ్‌- విడవని జ్వరం

కరోనాలోనూ కొందరికి విరేచనాలు కావొచ్ఛు అంత మాత్రాన కచ్చితంగా కరోనా కావాలనేమీ లేదు. టైఫాయిడ్‌ జ్వరంలోనూ విరేచనాలు, వాంతులు కావొచ్ఛు దీనికి మూలం ఆహారం, నీరు కలుషితం కావటం. వర్షకాలంలో ఇది ఎక్కువ. టైఫాయిడ్‌లో జ్వరం 102 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండొచ్ఛు ఇది విడవకుండా వేధించే జ్వరం. రోజురోజుకీ పెరుగుతూ వస్తుంటుంది.

ఇవి కూడా..●

● మూత్ర ఇన్‌ఫెక్షన్‌తోనూ జ్వరం రావొచ్ఛు ఇందులో వణుకు, మూత్రంలో మంట ఉంటాయి.

● ఎలుకలతో వ్యాపించే లెప్టోస్పైరోసిస్‌లోనూ జ్వరం వస్తుంది. ఇందులో జ్వరంతో పాటు కళ్లు ఎర్రబడటం, కామెర్లూ ఉంటాయి.

● పిల్లలో కీళ్లవాతంలో (రుమాటిక్‌) జ్వరంతో పాటు గొంతునొప్పి ఉంటుంది.


అతి కాఫీ అనర్థమే

తరచూ ఆందోళనకు గురవుతున్నారా? నిద్ర పట్టకపోవటం, కోపం రావటం, చిరాకు పడటం వంటివీ కనిపిస్తున్నాయా? అయితే కాఫీ మరీ ఎక్కువగా తాగుతున్నారేమో చూసుకోండి. కాఫీలో కెఫీన్‌ ఉంటుంది. ఇది హుషారును కలిగించేదే అయినా మితిమీరితే ప్రమాదమే. దీంతో ఆందోళన, నిద్రలేమి, చిరాకు వంటివే కాదు.. కడుపులో ఇబ్బంది, వికారం, వాంతి వంటివీ మొదలవుతాయి. గుండె, శ్వాస వేగమూ పెరుగుతాయి. రక్తపోటు సైతం ఎక్కువవుతుంది. కాఫీ ఎక్కువగా తాగేవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే కాస్త తగ్గించి చూడండి. ఫలితం వెంటనే తెలుస్తుంది.


రక్తనాళాలకు నైట్రిక్‌ రక్ష

గుండె, మెదడు వంటి అవయవాలను కాపాడుకోవటానికి శరీరం నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. వీటిల్లో ఒకటి నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తి. ఇది రక్తనాళాలు విప్పారేలా చేసి, రక్త సరఫరా సజావుగా సాగేలా చూస్తుంది. రక్తపోటు పెరగకుండా కాపాడుతుంది. వయసు మీద పడుతున్నకొద్దీ నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తీ తగ్గుతుంటుంది. ఫలితంగా రక్తనాళాల్లో సాగే గుణం తగ్గి, దెబ్బతింటాయి. ఇది గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులకు దారితీస్తుంది. వ్యాయామం ద్వారా వీటిని తప్పించుకోవచ్ఛు వ్యాయామం చేయటం వల్ల రక్తనాళాల లోపలి పైపొర కణాలు చురుకుగా ఉంటాయి. నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేసేవి ఇవే.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని