పులిరాజాను లేపొద్దు!

ఎంత అదుపులో ఉన్నా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ ఇప్పటికీ పెద్ద ప్రజారోగ్య సమస్యగానే నిలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 3.8 కోట్ల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారని అంచనా. ప్రజల్లో ఎంత అవగాహన పెరిగినా గత సంవత్సరం 17 లక్షల మంది కొత్తగా హెచ్‌ఐవీ బారినపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏఆర్‌టీ చికిత్స విరివిగా అందుబాటులోకి వచ్చినా గత సంవత్సరం 69 లక్షల మంది హెచ్‌ఐవీ సంబంధ కారణాల మూలంగా మృత్యువాత పడటం..

Updated : 23 Aug 2022 11:18 IST

నేడు వరల్డ్‌ ఎయిడ్స్‌ డే

పులి పడుకుంది కదా అని వెర్రివేషాలు వేయొద్దు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ విషయంలో ఇప్పుడిలాంటి విజ్ఞతే కావాలి. జబ్బు గుట్టుమట్లు పట్టుబడటం, దీనిపై ప్రజల్లో అవగాహన పెరగటం, పరీక్షలకు వెనకాడకపోవటం, సత్వరం యాంటీరెట్రోవైరల్‌ చికిత్స (ఏఆర్‌టీ) ఆరంభించటం వంటి వాటితో  హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను గణనీయంగానే తగ్గించాం. ఒకరకంగా ఇప్పుడిది మధుమేహంలాంటి దీర్ఘకాలిక సమస్యగానూ మారి పోయింది. అలాగని ఆదమరిస్తే ప్రమాదాన్ని తిరిగి కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి వరల్డ్‌ ఎయిడ్స్‌ డే సందర్భంగా దీని గురించి మరోసారి తెలుసుకొని, జాగ్రత్త పడటం అవసరం.

ఎంత అదుపులో ఉన్నా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ ఇప్పటికీ పెద్ద ప్రజారోగ్య సమస్యగానే నిలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 3.8 కోట్ల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారని అంచనా. ప్రజల్లో ఎంత అవగాహన పెరిగినా గత సంవత్సరం 17 లక్షల మంది కొత్తగా హెచ్‌ఐవీ బారినపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏఆర్‌టీ చికిత్స విరివిగా అందుబాటులోకి వచ్చినా గత సంవత్సరం 69 లక్షల మంది హెచ్‌ఐవీ సంబంధ కారణాల మూలంగా మృత్యువాత పడటం.. కేవలం 68% మందే దీర్ఘకాల ఏఆర్‌టీ చికిత్స పొందుతుండటం గమనార్హం. ఇవన్నీ హెచ్‌ఐవీని అరికట్టటానికి, మరణాలను తగ్గించటానికి ప్రజలు, ప్రభుత్వాలు ఇంకాస్త గట్టిగా కృషి చేయాల్సిన అవసరముందనే గుర్తుచేస్తున్నాయి.
హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌కు మూలం హ్యూమన్‌ ఇమ్యునోడెఫిసెన్సీ వైరస్‌ (హెచ్‌ఐవీ).ఇది రోగనిరోధక వ్యవస్థ మీద దాడిచేసి, మన రక్షణ శక్తిని బలహీనం చేస్తుంది. రోగ నిరోధక కణాలు దెబ్బతింటున్నకొద్దీ వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతూ వస్తుంది. క్యాన్సర్లూ తలెత్తే ప్రమాదమూ ఉంది. హెచ్‌ఐవీ సోకగానే ఎయిడ్స్‌ (అక్వయిర్డ్‌ ఇమ్యునోడెఫిసెన్సీ సిండ్రోమ్‌) వచ్చిందనే చాలామంది భావిస్తుంటారు. హెచ్‌ఐవీ బారినపడ్డా ఇది పూర్తిస్థాయి, తీవ్రమైన ఎయిడ్స్‌గా మారటానికి చాలాకాలం పడుతుంది. ఏఆర్‌టీ చికిత్స తీసుకుంటూ అందరిలా మామూలు జీవితం గడపొచ్చు. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటే ఎయిడ్స్‌గా మారకుండా చూసుకోవచ్చు. లేకపోతే వైరస్‌ మందులను తట్టుకునేలా, మొండిగా తయారవ్వచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఇతరులకు వ్యాపించొచ్చు. అందువల్ల హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితులు, వారి కుటుంబ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.


భాగస్వామికి ఉంటే?

ర్త లేదా భార్యకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్నట్టు తేలితే జీవిత భాగస్వామికీ పరీక్ష చేయాలి. భాగస్వామికి వైరస్‌ సోకకపోతే లైంగికంగా కలవకుండా చూసుకోవాలి. నోట్లో ఉమ్మి కలిసిపోయేలా గాఢంగా ముద్దు పెట్టుకోవద్దు. కండోమ్‌ వాడితే సరిపోతుందని అనుకోవటం తగదు. ఇది అన్నిసార్లూ సురక్షితం కాదు. కండోమ్‌ చిరిగిపోయి వైరస్‌ వ్యాపించొచ్చు. పక్కన కూర్చోవటం, తాకటం, కబుర్లు చెప్పుకోవటం వంటివన్నీ మామూలుగానే చేసుకోవచ్చు గానీ లైంగిక సంపర్కం విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఏఆర్‌టీ చికిత్స తీసుకుంటున్నాం కదా, ఏం కాదులే అని కొందరు శృంగారంలో పాల్గొంటుంటారు. ఇది మంచిది కాదు. మందులు వేసుకుంటున్నా వీర్యంలో, లాలాజలం వంటి శరీర స్రావాల్లో వైరస్‌ ఉండొచ్చని గుర్తుంచుకోవాలి. భాగస్వాములిద్దరూ హెచ్‌ఐవీ పాజిటివ్‌ అయితే మందులు వాడుకుంటూ శృంగారంలో పాల్గొన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. సంతానం వద్దనుకుంటే కండోమ్‌ వాడుకోవటం మంచిది. అప్పటికే పిల్లలుంటే సంతానం కోసం ప్రయత్నించకపోవటమే ఉత్తమం. భార్యాభర్తల్లో ఎవరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉన్నా పిల్లలకూ పరీక్ష చేయాలి. ఒకవేళ పిల్లలకు పాజిటివ్‌  అని తేలితే వెంటనే చికిత్స ఆరంభించాలి.


మందులు ఆపొద్దు!

హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేసే చికిత్సలేవీ లేవు. కానీ ఏఆర్‌టీ చికిత్సతో చాలావరకు నియంత్రించుకోవచ్చు. మందులను జీవితాంతం వాడుకోవటం తప్పనిసరి. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నదీ పరీక్షించుకోవాల్సి ఉంటుంది. రక్తంలో సీడీ4, సీడీ8 టి కణాల సంఖ్య పెరుగుతుంటే మందులు సమర్థంగా పనిచేస్తున్నాయని, వైరస్‌ ఉద్ధృతి తగ్గుతోందనే అర్థం. కొన్ని మందులు కాలేయం వంటి కీలక అవయవాల మీద దుష్ప్రభావం చూపే అవకాశముంది. కాబట్టి నెలకోసారి విధిగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఆరు నెలలకోసారి సీబీపీ, సీరమ్‌ క్రియాటినైన్‌, కాలేయ సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా తేడా కనిపిస్తే మందులు మార్చుకోవటానికి వీలుంటుంది. వైరస్‌ ఏమైనా మందులకు నిరోధకతను సంతరించుకుంటోందా అనేదీ పరీక్షించుకోవాలి.


జీవనశైలి రక్షణ

హెచ్‌ఐవీ బాధితుల్లో రోగనిరోధకశక్తి క్షీణిస్తుండటం వల్ల ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. కాబట్టి జాగత్రగా ఉండాలి. పరిశుభ్రత చాలా కీలకం. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. బయటి తిండి తినటం, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగటం మానెయ్యాలి. ఎప్పుడైనా వేడి వేడి ఆహారమే తినాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. కొవిడ్‌ మహమ్మారి కాలంలో వీటిని మరింత పగడ్బందీగా పాటించాలి. మద్యం, సిగరెట్ల జోలికి వెళ్లకుండా చూసుకోవాలి. అపరిచితులతో శృంగారం, అసురక్షిత సంభోగంతో ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందటమే కాదు.. అవతలి వాళ్లకు ఏవైనా సుఖవ్యాధులుంటే త్వరగా అంటుకుంటాయి. దీంతో సమస్య మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదముందని గుర్తించాలి.


క్షయతో పెద్ద ముప్పు

హెచ్‌ఐవీ బాధితులకు క్షయ ముప్పు ఎక్కువ. వీరిలో 6-7% మంది క్షయ బారిన పడుతున్నవారే. ఇవి రెండూ కలిస్తే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. క్షయను వీలైనంత త్వరగా గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. క్షయ తీవ్రంగా ఉంటే- ముందుగా క్షయ చికిత్స ఆరంభించి, నెల తర్వాత హెచ్‌ఐవీ చికిత్సను ఆరంభిస్తారు. అనంతరం రెండింటినీ కొనసాగించాల్సి ఉంటుంది. క్షయ తీవ్రంగా లేకపోతే- ఒకేసారి రెండు చికిత్సలను మొదలుపెట్టాల్సి ఉంటుంది.


పిల్లలను కాపాడుకోవచ్చు

ఆర్‌టీ చికిత్సతో హెచ్‌ఐవీ బాధిత గర్భిణుల నుంచి పిల్లలకు వైరస్‌ సోకకుండా కాపాడుకోవటమూ సాధ్యమవుతోంది. ఈ మందులను వేసుకుంటే పుట్టబోయే పిల్లలకు హెచ్‌ఐవీ సోకే అవకాశాన్ని ఒక్క శాతానికి తగ్గించుకోవచ్చు. అంటే దాదాపు పూర్తిగా వైరస్‌ సోకకుండా చూసుకోవచ్చన్నమాట. మందులు వేసుకోకపోతే పిల్లలకు 30% వరకు వైరస్‌ సోకే అవకాశముంది. గర్భిణులకు సిజేరియన్‌ కాన్పు చేయటం, పుట్టిన పిల్లలకు ముందు జాగ్రత్తగా రెండు రోజుల్లోపు యాంటీరెట్రోవైరల్‌ మందుల చుక్కలను వేయటం ద్వారా వైరస్‌ బారి నుంచి పూర్తిగా కాపాడుకోవచ్చు.  


లక్షణాలు ఇవీ..

హెచ్‌ఐవీ లక్షణాలు జబ్బు దశను బట్టి ఆధారపడి ఉంటాయి. తొలిదశలో ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు. కొందరికి జ్వరం, తలనొప్పి, దద్దు, గొంతునొప్పి వంటి మామూలు జలుబు లక్షణాలే కనిపించొచ్చు. అందుకే చాలామందికి సమస్య ముదిరిన తర్వాత గానీ అనుమానం రాదు. ఇన్‌ఫెక్షన్‌ ముదురుతున్నకొద్దీ రోగనిరోధక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే సీడీ4 కణాల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఫలితంగా రకరకాల లక్షణాలు పొడసూపుతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాల్సిందే.
* నెల దాటినా జ్వరం విడవకుండా వేధించటం
* అకారణంగా బరువు తగ్గిపోతుండటం
* చాలాకాలంగా నీళ్ల విరేచనాలు అవుతుండటం
* మందులు వేసుకుంటున్నా దగ్గు తగ్గకపోవటం
* తరచూ రకరకాల ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుడటం
* నెల రోజులకు పైగా లింఫ్‌ గ్రంథుల వాపు


నివారణే ప్రధానం

హెచ్‌ఐవీ బారినపడకుండా చూసుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఇదెలా వ్యాపిస్తుందో తెలుసుకొని, వాటికి దూరంగా ఉంటే పూర్తిగా నివారించుకోవచ్చు. హెచ్‌ఐవీ సోకినవారి  రక్తం, వీర్యం, లాలాజలం, జననాంగ స్రావాల వంటి వాటితో వైరస్‌ ఒకరి నుంచి     మరొకరికి వ్యాపిస్తుంది. ఇది సోకే ముఖ్యమైన మార్గాలు ఇవీ..
* విశృంఖల శృంగారం
* ఇతరులు వాడిన సూదులు, సిరంజీలను వాడుకోవటం
* పచ్చబొట్టు, ముక్కు కుట్టటం వంటి వాటికి వాడే సాధనాలను శుభ్రం చేయకుండా ఉపయోగించటం
* ఇతరులు వాడిన బ్లేడ్లు,  టూత్‌ బ్రష్‌ల వంటివి మరొకరు వాడుకోవటం
* హెచ్‌ఐవీ బాధితుల రక్తాన్ని ఇతరులకు మార్పిడి చేయటం


నిర్ధారణ ఎలా?

హెచ్‌ఐవీ వైరస్‌ కనీసం 6 వారాలు దాటితే గానీ ఎలెసా పరీక్షలో బయటపడదు. ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ, పీసీఆర్‌ పద్ధతుల్లోనైతే 15 రోజుల్లోనే కనిపిస్తుంది. పరీక్ష చేసిన రోజే ఫలితం తేలుతుంది. ఎవరికి వారు సొంతంగా పరీక్ష చేసుకోవటానికీ వీలుంది. అయితే హెచ్‌ఐవీ నిపుణులైన, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది చేసే ప్రామాణిక పరీక్షే కీలకం.


ముప్పు ఎవరికి?

దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే డ్రైవర్లకు, చాలాకాలంగా ఇంటికి దూరంగా ఉండేవారికి, మాదక ద్రవ్యాల అలవాట్లు గలవారికి హెచ్‌ఐవీ సోకే ముప్పు ఎక్కువ. స్వలింగ సంపర్కులు, జైళ్లలో ఉండేవారికి, సెక్స్‌ వర్కర్లకు ఇది సోకే ప్రమాదం ఎక్కువ. సిఫిలిస్‌, గనోరియా, హెర్పిస్‌, క్లామీడియా, జననాంగ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వంటివి గలవారికీ దీని ముప్పు ఎక్కువే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని