మడమ ఆపరేషన్‌ మళ్లీనా?

నాకు 36 ఏళ్లు. రెండేళ్ల క్రితం కాలు విరిగింది. మడమ ఎముక (కాల్‌కేనియస్‌) మూడు ముక్కలైంది. శస్త్రచికిత్స చేసి, ప్లేటు వేశారు.

Published : 29 Dec 2020 00:37 IST

సమస్య-సలహా

సమస్య: నాకు 36 ఏళ్లు. రెండేళ్ల క్రితం కాలు విరిగింది. మడమ ఎముక (కాల్‌కేనియస్‌) మూడు ముక్కలైంది. శస్త్రచికిత్స చేసి, ప్లేటు వేశారు. గత ఆరు నెలల నుంచి కాలి నొప్పి పుడుతోంది. పావు గంటకు మించి నడవలేకపోతున్నాను. చెప్పులు లేకపోతే బాగా నొప్పి వస్తోంది. మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవాలా? అదే తగ్గిపోతుందా? మరేదైనా మార్గముందా?

- కిరణ్‌ (ఈమెయిల్‌)

సలహా: పాదంలో కాల్‌కేనియస్‌ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. నడవటానికి మనం కాలును ముందుకు వేసినప్పుడు శరీరం మొత్తం బరువును మోసేది ఇదే. దీనికి మూడు కీళ్లు అనుసంధానమై ఉంటాయి. పాదం కదలికలు సరిగా సాగటానికివి తోడ్పడతాయి. పైగా కాల్‌కేనియస్‌ మెత్తటి ఎముక. అందుకే దీనికి ఫ్రాక్చర్‌ అవటమనేది క్లిష్టమైన సమస్య. దీన్ని సరిచేయటం ఇంకా సంక్లిష్టమైన వ్యవహారం. కొన్నిసార్లు ఎముకతో పాటు కీళ్లూ విరిగిపోవచ్చు. ఎముకల మధ్య ఉండే మృదులాస్థి దెబ్బతినొచ్చు. మంచి అనుభవం ఉన్నవారు చేసినా కొన్నిసార్లు పూర్తిగా కుదురుకోకపోవచ్చు. దెబ్బ తగిలినప్పుడు మడమ ఎముక ఎంత తీవ్రంగా నలిగిపోయిందనే దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఏడాదిన్నర తర్వాత మీకు ఇబ్బందులు మొదలయ్యాయంటే ఎముకతో కీలు సరిగా అనుసంధానం కాలేదేమోననే అనుమానం వస్తోంది. అందువల్ల మీకు ఎలాంటి ఫ్రాక్చర్‌ అయ్యింది? శస్త్రచికిత్స సరిగ్గా చేశారా? లేదా? అన్నది చూడటం ముఖ్యం. ఒకవేళ కీలు దెబ్బతిని ఉంటే, అది సరిగా కుదురుకోకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. నడిచేటప్పుడు నొప్పి వస్తుంటుంది. మీరూ ఇలాగే బాధ పడుతున్నారని అనిపిస్తోంది. ముందుగా మీకు ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ను సంప్రదించి, పరిస్థితి ఎలా ఉందో కనుక్కోండి. అవసరమైతే మరో డాక్టర్‌ సలహా తీసుకోండి. కాలు విరిగినప్పటి ఎక్స్‌రే, ఆపరేషన్‌ చేశాక తీసిన ఎక్స్‌రే, ప్రస్తుత ఎక్స్‌రేలను బట్టి ఎముక తీరుతెన్నులను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఎముక బాగా అతుక్కుందా? లేదా? మున్ముందు సమస్య ముదిరే ప్రమాదముందా? మళ్లీ ఆపరేషన్‌ అవసరమా? అనేది నిర్ణయిస్తారు. తిరిగి ఆపరేషన్‌ చేసినా సమస్య కుదురుకుంటుందా? లేదా? అనేదీ బయటపడుతుంది. అప్పుడే ఒక నిర్ణయానికి రావటం సాధ్యమవుతుంది.

సమస్యలను పంపాల్సిన చిరునామా:  సమస్య - సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని