నడిస్తే కాళ్ల వాపు?

నా వయసు 78 సంవత్సరాలు. గత 20 ఏళ్లుగా మధుమేహం ఉంది. ఇటీవల 2 కిలోమీటర్లు నడిస్తే కాళ్లకి వాపు వస్తోంది. తగిన సలహా ఇవ్వగలరు. ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయగలరు....

Updated : 26 Jan 2021 01:00 IST

సమస్య - సలహా

సమస్య: నా వయసు 78 సంవత్సరాలు. గత 20 ఏళ్లుగా మధుమేహం ఉంది. ఇటీవల 2 కిలోమీటర్లు నడిస్తే కాళ్లకి వాపు వస్తోంది. తగిన సలహా ఇవ్వగలరు. ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయగలరు.

- జె.శోభనాద్రి రావు, నూజివీడు

సలహా: ఈ వయసులో 2 కిలోమీటర్లు నడిస్తే కాళ్లకి వాపు రావటం పెద్ద సమస్యేమీ కాదు. దీని గురించి అంతగా భయపడాల్సిన పనిలేదు. అయితే 20 ఏళ్లుగా మధుమేహం ఉందంటున్నారు. పైగా నడుస్తున్నప్పుడే వాపు వస్తోందని అంటున్నారు. అందువల్ల మీరు కాళ్లలో రక్తనాళాల సమస్యలేవైనా ఉన్నాయేమో చూసుకోవాల్సి ఉంటుంది. ధమనులు కుంచించుకుపోవటం (పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌).. సిరలు వంకర్లు తిరిగిపోయి ఉబ్బటం (వెరికోజ్‌ వీన్స్‌) వంటి సమస్యలేవైనా వాపునకు కారణం కావొచ్చు. మధుమేహంలో ఇలాంటి జబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రక్తనాళాల సమస్యలు గలవారిలో రక్తం నెమ్మదిగా పైకి కదులుతుంది. దీంతో అలవాటు లేని పనులు, కష్టమైన పనులు చేస్తున్నప్పుడు నొప్పి, వాపు వంటివి తలెత్తొచ్చు. ముందు జాగ్రత్తగా రక్తనాళాల సమస్యలకు చికిత్స చేసే డాక్టర్‌ను సంప్రదించటం మేలు. ఆహారం విషయానికి వస్తే- 70 ఏళ్లు దాటినవారు కఠినమైన ఆహార నియమాలేవీ పాటించకపోవటమే మంచిది. చుట్టుపక్కల దొరికే ఆహార పదార్థాలు తినాలి. అందుబాటులో లేని కొత్త పదార్థాలను కష్టపడి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నోటికి రుచిగా ఉన్నవి, తేలికగా జీర్ణమయ్యేవే తినాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని