Updated : 02 Feb 2021 00:50 IST

మేలుకో తల్లీ!

ఎల్లుండి ప్రపంచ క్యాన్సర్‌ దినం

గోటితో పోయేదానికి గొడ్డలెందుకు అంటారు. గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. తేలికైన పరీక్షలతో దీన్ని ముందుగానే గుర్తించొచ్చు. ఆ మాటకొస్తే టీకాతో అసలు రాకుండానే చూసుకోవచ్చు. అయినా ఎంతోమంది మహిళలు బలైపోతుండటం విషాదం. దీనికి ప్రధాన కారణం చాలా మందిలో బాగా ముదిరాకే క్యాన్సర్‌ బయటపడుతుండటం. నివారణ మార్గాలను తెలుసుకొని, ఆచరిస్తే ఇలాంటి స్థితి తలెత్తకుండా పూర్తిగా అడ్డుకోవచ్చు. కాకపోతే ఒకింత శ్రద్ధ అవసరం. ప్రపంచ క్యాన్సర్‌ దినం (ఫిబ్రవరి 4) ఇలాంటి సందేశమే ఇస్తోంది. ‘నేను సాధించగలను’ అనే సంకల్పంతో క్యాన్సర్లను  జయించొచ్చనే నినదిస్తోంది. ఈ నేపథ్యంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణ మార్గాలపై ఓ కన్నేద్దాం.

క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కాస్త భిన్నమనే చెప్పుకోవచ్చు. ఆరంభం కావటానికి ముందే దీన్ని గుర్తించొచ్చు. మరే క్యాన్సర్‌కూ ఇలాంటి అవకాశం లేదు. అయినా పట్టుకోలేకపోవటం పెద్ద లోపం. ఇది నెమ్మదిగా ముదురుతూ వస్తుంటుంది. లక్షణాలు కనిపించేసరికే తీవ్రమై ప్రాణాల మీదికి తెస్తుంది. మనదేశంలో ఏటా 1.32 లక్షల మంది మహిళలు దీని బారినపడుతుండగా.. 74 వేల మంది మృత్యువాత పడుతున్నారని అంచనా. టీకా తీసుకోవటం, పొగ అలవాటుకు దూరంగా ఉండటం, సురక్షితమైన శృంగారం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను చాలావరకు నివారించుకోవచ్చు. ఒకవేళ తలెత్తుతున్నా క్రమం తప్పకుండా  పాప్‌ స్మియర్‌ పరీక్ష చేయించుకోవటం ద్వారా ముందే పట్టుకోవచ్చు. తగు జాగ్రత్తలు, చికిత్సలతో ముదరకుండా చూసుకోవచ్చు. ఇలాంటి చర్యలతో 2050 నాటికి 40శాతానికి పైగా కొత్త కేసులను, 50 లక్షల క్యాన్సర్‌ మరణాలను తగ్గించాలన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేకంగా బృహత్తర కార్యక్రమాన్ని ఆరంభించింది. వచ్చే పదేళ్లలో 15 ఏళ్ల బాలికల్లో 90% మందికి టీకా ఇప్పించాలని సంకల్పించింది. 35 ఏళ్లు వయసు మహిళల్లో 70% మందికి పాప్‌ స్మియర్‌ వంటి పరీక్షలు నిర్వహించటం, క్యాన్సర్‌ బారినపడ్డవారిలో 90% మందికి కచ్చితంగా తగు చికిత్సలు అందించటం దీని ఉద్దేశం. ఇందులో మనదేశం కూడా భాగస్వామి కావటం గమనార్హం.
ముందస్తు పరీక్షల మేలు
సాధారణంగా 35 ఏళ్లు వచ్చేసరికి 75-80% మంది మహిళల్లో తక్కువ ముప్పు కలిగించే వైరస్‌లన్నీ కనుమరుగవుతాయి. కొందరిలో ప్రమాదకరమైన వైరస్‌లు అలాగే ఉండిపోతాయి. ఇవి ఉన్నా క్యాన్సర్‌ రావాలనేమీ లేదు. చాలామందిలో దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారిపోవచ్చు. కొందరికే క్యాన్సర్‌గా మారొచ్చు. వీరిలో ముందుగా గర్భాశయ ముఖద్వార కణజాలం మీద కొన్ని మార్పులు (సర్వైకల్‌ ఇంట్రాఎపిథిలియల్‌ నియోప్లేసియా) తలెత్తుతాయి. దీన్నే క్యాన్సర్‌ ముందు దశ (ప్రిక్యాన్సర్‌) అంటారు. ఈ నియోప్లేసియాలోనూ మూడు గ్రేడులుంటాయి. మొదటి గ్రేడ్‌ పూర్తిగా తగ్గిపోతుంది. రెండో గ్రేడ్‌ మార్పులు మూడో గ్రేడ్‌కు చేరుకోవచ్చు. లేదూ  అక్కడితోనే ఆగిపోవచ్చు. మూడో గ్రేడ్‌ కూడా 50% వరకు తగ్గిపోతుంది. కాకపోతే ఇది పదేళ్లలో క్యాన్సర్‌గా మారొచ్చు. అంటే గర్భాశయ క్యాన్సర్‌ను పదేళ్ల ముందే గుర్తించే అవకాశముందన్నమాట. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివారిలోనూ 80-85% మందిలో క్యాన్సర్‌గా మారకుండా అడ్డుకోవచ్చు. ఇందుకు ముందస్తు పరీక్షలు బాగా ఉపయోగపడతాయి.
పాప్‌ స్మియర్‌:  ఇందులో దూదిపుల్లతో గర్భాశయ ముఖద్వారం వద్ద నుంచి స్రావాలను తీసి పరీక్షిస్తారు. అక్కడి కణాల్లో మార్పులు తలెత్తితే పరీక్షలో బయటపడతాయి. లైంగిక సంపర్కంలో పాల్గొనే వయసులో ఉన్న స్త్రీలంతా కనీసం ప్రతి మూడేళ్లకు ఒకసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలి. అమెరికాలాంటి దేశాల్లో 21 ఏళ్లకే దీన్ని చేస్తున్నారు. కానీ మనదేశంలో 35 ఏళ్లు దాటినా ఒకసారైనా చేయించుకోవటం లేదు. టీకా తీసుకున్నా 30 ఏళ్లు దాటినవారంతా ఈ పరీక్ష చేయించుకోవటం ఉత్తమం. నెలసరి తర్వాత దీన్ని చేయించుకోవటం మంచిది. నెలసరి నిలిచినవారైతే ఎప్పుడైనా చేయించుకోవచ్చు. పరీక్షకు ముందు రోజు లైంగిక సంపర్కానికి దూరంగా ఉండాలి. 45 ఏళ్లలోపు మహిళలకు కనీసం ఒక్కసారైనా పాప్‌ స్మియర్‌ పరీక్ష చేయగలిగితే 40-50% వరకు క్యాన్సర్‌ను తగ్గించొచ్చు.
వీఐఏ (విజ్యువల్‌ ఇన్‌స్పెక్షన్‌ విత్‌ అసిటిక్‌ యాసిడ్‌) పరీక్ష: ఇది తేలికైనది. నర్సులు కూడా చేయొచ్చు. పాప్‌ స్మియర్‌ పరీక్ష అందుబాటులో లేని ప్రాంతాల కోసం దీన్ని రూపొందించారు. సాధారణంగా క్యాన్సర్‌ కణాలు చాలా వేగంగా వృద్ధి చెందుతుంటాయి. వీటిల్లో ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్ల 3-5% అసిటిక్‌ యాసిడ్‌ను రాస్తే ఆ భాగమంతా తెల్లగా అవుతుంది. ఇది క్యాన్సర్‌ ముందు దశకు సూచిక కావొచ్చు. ఇలాంటి మార్పులు కనిపిస్తే పెద్ద ఆసుపత్రికి వెళ్లి పాప్‌ స్మియర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
హైబ్రిడ్‌ క్యాప్చర్‌: ఇది అధునాతన పరీక్ష. డీఎన్‌ఏ ఆధారంగా ప్రమాదకరమైన వైరస్‌ రకాలను గుర్తించటానికి తోడ్పడుతుంది. ఇలాంటి వైరస్‌లు లేకపోతే పెద్దగా భయమేమీ అవసరం లేదు. ఒకవేళ ఇవి ఉన్నట్టయితే దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా భావించాల్సి ఉంటుంది. ఇది మున్ముందు క్యాన్సర్‌గా మారే అవకాశముంటుంది.

నియోప్లేసియా మూడో గ్రేడ్‌లో ఉన్నవారిలో ఇలాంటి వైరస్‌లున్నట్టు తేలితే క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టే. అందుకే ఇలాంటివారికి పాప్‌ స్మియర్‌ కాకుండా నేరుగా హైబ్రిడ్‌ కల్చర్‌ పరీక్ష చేయటమే మేలని ఇప్పుడు భావిస్తున్నారు.

- ఇలాంటి ముందస్తు పరీక్షలన్నీ క్యాన్సర్‌ ఆనవాళ్లను పట్టుకోవటానికే. నిర్ధారణ కోసం కాదు. ఎవరిలోనైనా క్యాన్సర్‌ తరహా మార్పులు గమనిస్తే కాల్పోస్కోప్‌తో గర్భాశయ ముఖద్వారాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. దీనిలోంచి చూస్తే కణజాలం పెద్దగా కనిపిస్తుంది. రక్తనాళాలు మార్పుల వంటివి బయటపడతాయి. కాల్పోస్కోపీ చేసేటప్పుడే చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు (బయాప్సీ). దీని ద్వారా క్యాన్సర్‌ ఉన్నదీ లేనిదీ నిర్ధారిస్తారు.


జాగ్రత్త ఇలా..

ముందస్తు పరీక్షల్లో ఏవైనా మార్పులు కనిపిస్తే క్రమం తప్పకుండా పరిశీలిస్తూ క్యాన్సర్‌గా మారకుండా చూసుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ దశలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటివి పాటిస్తే చాలు. సంభోగం అనంతరం రక్తస్రావం, దుర్వాసనతో కూడిన తెలుపు వంటివి కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి. క్యాన్సర్‌ ముందస్తు దశలో తేలికైన చికిత్సలతోనే నయమవుతుంది. క్రయోథెరపీ, లీప్‌ వంటి చికిత్సలు మేలు చేస్తాయి. మామూలు చికిత్సలతో ఫలితం లేకపోతే గర్భాశయాన్ని తొలగించాల్సి వస్తుంది. ఒకవేళ క్యాన్సర్‌గా మారితే రేడియేషన్‌, కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది. అలాగే గర్భసంచి, గర్భాశయ ముఖద్వారంతో పాటు చుట్టుపక్కల కణజాలం, లింఫ్‌ గ్రంథులనూ తొలగిస్తారు.


నివారణ కీలకం

ఒక్క ఇన్‌ఫెక్షన్‌ ఉన్నంత మాత్రాన క్యాన్సర్‌ వచ్చినట్టే అనుకోవటం తగదు. దీనికి ఇతరత్రా కారకాలు తోడైనప్పుడు ముప్పు పెరుగుతుందని గుర్తించాలి. అందువల్ల టీకా తీసుకున్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* జననాంగ పరిశుభ్రత చాలా ముఖ్యం.
* పొగతాగే అలవాటుకు దూరంగా ఉండాలి. ఇంట్లో ఎవరైనా పొగతాగేవారుంటే వారు వదిలే పొగను పీల్చటమూ ప్రమాదకరమే. పొగ తాగే మగవారి వీర్యం ద్వారానూ నికొటిన్‌ భాగస్వాములకు సంక్రమిస్తుంది.
* విచ్చలవిడి శృంగారం తగదు. హెర్పిస్‌ వంటి సుఖవ్యాధులతోనూ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది. పెళ్లికి ముందు సంభోగంలో పాల్గొనకపోవటం మంచిది.


 టీకా అభయం

ర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ). ఇది లైంగిక సంపర్కం ద్వారానే సంక్రమిస్తుంది. శృంగార జీవితం ఆరంభించిన సుమారు 70-80% మహిళల్లో హెచ్‌పీవీ కనిపిస్తుంది. హెచ్‌పీవీల్లో 150కి పైగా రకాలున్నాయి. వీటిల్లో హెచ్‌పీవీ 16, 18 వైరస్‌లు చాలా ప్రమాదకరం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు చాలావరకు కారణం ఇవే. హెచ్‌పీపీ 6, 11 వైరస్‌లు అంత ప్రమాదకరం కావు. ఇవి పులిపిర్ల వంటి మామూలు సమస్యలకు దారితీస్తాయి. వీటి బారినపడకుండా టీకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు వైరస్‌ల మీద పనిచేస్తే.. మరోటి నాలుగు వైరస్‌ల మీద పనిచేస్తుంది. వీటిల్లో ఏదైనా తీసుకోవచ్చు.  
* పెళ్లికి ముందే.. అంటే లైంగిక జీవితాన్ని ఆరంభించటానికి ముందే టీకా తీసుకుంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను చాలావరకు నివారించుకోవచ్చు. దీన్ని 9-15 ఏళ్ల వయసులోనే బాలికలకు ఇప్పించటం ఉత్తమం. ఈ వయసులో యాంటీబాడీలు ఎక్కువగా తయారవుతాయి. రెండు వైరస్‌ల మీద పనిచేసే టీకాను 2 మోతాదుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. తొలి మోతాదు తీసుకున్న నెల తర్వాత మరో మోతాదు తీసుకోవాలి. ఒకవేళ నాలుగు వైరస్‌ల మీద పనిచేసే టీకానైతే 8 వారాల తర్వాత మరో మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది.
* ఇక 18 ఏళ్లు దాటిన తర్వాత అయితే 3 మోతాదులు టీకా తీసుకోవాలి. తొలి మోతాదు తీసుకున్న 8 వారాల తర్వాత మరో మోతాదు.. అనంతరం 6 నెలల తర్వాత ఇంకో మోతాదు తీసుకోవాలి.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని