తినేటప్పుడు దగ్గు?

నా వయసు 45 ఏళ్లు. నాకు తినేటప్పుడు ప్రతిసారీ దగ్గు వస్తుంది. మసాలా పదార్థాలు తినేటప్పుడు మరింత ఎక్కువగానూ వస్తుంది. దీంతో ముద్ద ముద్దకూ నీళ్లు తాగుతుంటాను.

Updated : 02 Mar 2021 01:32 IST

సమస్య-సలహా

సమస్య: నా వయసు 45 ఏళ్లు. నాకు తినేటప్పుడు ప్రతిసారీ దగ్గు వస్తుంది. మసాలా పదార్థాలు తినేటప్పుడు మరింత ఎక్కువగానూ వస్తుంది. దీంతో ముద్ద ముద్దకూ నీళ్లు తాగుతుంటాను. కడుపులో మంటగా ఉంటుంది. ఇదేం సమస్య? గ్యాస్‌ తగ్గటానికి మందులు వేసుకుంటున్నాను గానీ ఫలితం లేదు. దీనికి పరిష్కారమేంటి?

- రత్న (ఈమెయిల్‌)

సలహా: లక్షణాలను బట్టి చూస్తుంటే మీరు ఆమ్ల సమస్యతో (అసిడిటీ) బాధపడుతున్నారని అనిపిస్తోంది. ఇందులో జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం పైకి ఎగదన్నుకొని అన్నవాహికలోకి వస్తుంటుంది. దీనికి మూలం జీర్ణాశయం మొదట్లో బిగుతుగా ఉండే కండర వలయం సరిగా బిగుసుకోకపోవటం. దీంతో ఆమ్లం పైకి ఎగదన్నుకొచ్చి అన్నవాహికను చికాకు పరుస్తుంది. ఇది దగ్గుకు దారితీస్తుంది. అసిడిటీ సమస్యకు ఆమ్లం ఉత్పత్తిని తగ్గించే ఒమిప్రొజోల్‌.. జీర్ణాశయం, పేగుల కదలికలను మెరుగుపరచే డోమ్‌పెరిడోన్‌ వంటి మందులు ఉపయోగపడతాయి. వీటిని 4 వారాల పాటు వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మందులు వేసుకోవటంతో పాటు నూనె పదార్థాలు, మసాలాలు, కాఫీ, టీ మానెయ్యటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భోజనం చేశాక 3 గంటల తర్వాతే పడుకోవాలి. అంటే సాయంత్రం 7 గంటల లోపే రాత్రి భోజనం ముగించెయ్యాలన్నమాట. వీటితో ఫలితం కనిపించకపోతే అకలేషియా కార్డియా సమస్య ఉందేమో పరీక్షించాల్సి ఉంటుంది. దీంతోనూ తింటున్నప్పుడు దగ్గు రావొచ్చు. సాధారణంగా మనం అన్నం తింటున్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు అన్నవాహిక కండరాలు ఒక క్రమ పద్ధతిలో సంకోచిస్తూ వాటిని కిందికి తోస్తుంటాయి. అయితే నాడులు దెబ్బతినటం వల్ల తలెత్తే అకలేషియా కార్డియాలో ఈ ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. దీంతో ముద్ద సరిగా కిందికి దిగక మాటిమాటికి దగ్గు రావొచ్చు. దీనికి మందులు పనిచేయవు. పెరోరల్‌ ఎండోస్కోపిక్‌ మయాటమీ (పోయెమ్‌)   చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎండోస్కోప్‌ ద్వారా అన్నవాహిక లోపలి గోడలోంచి కిందికి వెళ్లి.. అన్నవాహిక, జీర్ణాశయం కలిసే చోట కండరాలను వదులు చేస్తారు. దీంతో ముద్ద త్వరగా కిందికి కదులుతుంది. అన్నవాహిక చికాకు పడటం తగ్గుతుంది. కాబట్టి మీరు దగ్గర్లోని జీర్ణకోశ నిపుణులను సంప్రదించండి. అవసరమైతే ఎండోస్కోపీ చేసి అసిడిటీనా? అకలేషియా కార్డియానా? అన్నది నిర్ధారణ చేస్తారు. తగు మందులు, చికిత్స సూచిస్తారు.

చిరునామా: సమస్య-సలహా,

సుఖీభవ,

ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ,  హైదరాబాద్‌ - 501 512  

email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని