మూత్రం తెలుపేల?

మా అబ్బాయికి 33 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. కొద్దిరోజుల నుంచి మూత్రం తెల్లగా వస్తోంది. కొన్నిసార్లు మూత్రం పోశాక మంటగా ఉంటోంది. ఇదేం సమస్య? దీనికి ఆయుర్వేదంలో ఏవైనా మందులున్నాయా?

Published : 16 Mar 2021 00:46 IST

సమస్య-సలహా

సమస్య: మా అబ్బాయికి 33 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. కొద్దిరోజుల నుంచి మూత్రం తెల్లగా వస్తోంది. కొన్నిసార్లు మూత్రం పోశాక మంటగా ఉంటోంది. ఇదేం సమస్య? దీనికి ఆయుర్వేదంలో ఏవైనా మందులున్నాయా?

- భాస్కర్‌ ఎస్‌.

సలహా: మూత్రం తెల్లగా, మబ్బుగా రావటాన్ని మామూలుగా సుద్దకట్టు అని పిలుచుకుంటుంటారు. ఇందుకు శుక్రమేహం (స్పెర్మటూరియా), పూయమేహం (పయూరియా/గనేరియా), పిష్టమేహం (ఖైలూరియా) వంటి సమస్యలేవేవైనా కారణం కావొచ్చు. శుక్రమేహంలో- ప్రోస్టేట్‌ గ్రంథిలో, శుక్రాశయాల్లో వీర్యం నిండిపోయి, ఒకోసారి మూత్రంతో కలిసి వస్తుంది. పూయమేహంలో- మూత్రపిండాల్లో, మూత్రసంచిలో ఇన్‌ఫెక్షన్‌ మూలంగా చీము తలెత్తి మూత్రంతో పాటు వస్తుంటుంది. కొన్నిసార్లు సుఖవ్యాధుల్లోనూ చీము రావొచ్చు. పిష్టమేహంలో- ఖైల్‌ (కొవ్వు) అనే లింఫ్‌ ద్రవం కిడ్నీల్లోకి చేరి బయటకు రావొచ్చు. దీంతో మూత్రం తెల్లగా పాల మాదిరిగా కనిపిస్తుంది. దీనికి మూలం దోమకాటు. అందువల్ల ముందుగా సమస్య ఏంటన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. మూత్రాన్ని చూసి గానీ పరీక్షలతో గానీ జబ్బును గుర్తించొచ్చు. మామూలు మూత్ర పరీక్షతోనే శుక్రమేహం, పూయమేహం బయటపడతాయి. వీర్యంలో ఫ్రక్టోజ్‌ అనే చక్కెర ఉంటుంది. ఒకవేళ ఇది మూత్రంలో ఎక్కువగా ఉంటే శుక్రమేహమని అనుకోవచ్చు. చీము, రక్త కణాలున్నట్టయితే పూయమేహంగా భావించాల్సి ఉంటుంది. ఇవేవీ లేకపోతే మూత్రంలో ఖైల్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. దీంతో పిష్టమేహముంటే బయటపడుతుంది. మీ అబ్బాయికి ఇంకా పెళ్లికాలేదని అంటున్నారంటే చాలావరకు శుక్రమేహమే అయ్యింటుందని అనిపిస్తోంది. ఇలాంటివారు అతిగా హస్త ప్రయోగం అలవాటుంటే మానుకోవాలి. వీరికి మూత్రనాళ దోషాలు తగ్గించే చంద్ర ప్రభావటి, ఉష్ణాన్ని తగ్గించే చందనాది వటి మేలు చేస్తాయి. పూయమేహమైతే చంద్ర ప్రభావటి, చందనాది వటి ఉపయోగపడతాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌, చీము తగ్గటానికి తోడ్పడతాయి. ఒకవేళ సుఖవ్యాధులైతే చోప్‌ చీనీ రసాయనం, వ్యాధిహరణ రసాయనం ఇవ్వాల్సి ఉంటుంది. పిష్టమేహమైతే శ్లీపదం (బోదకాలు) చికిత్సలో వాడే మందులే ఇస్తారు. లింఫ్‌ నాళాలను శుద్ధి చేసే నిత్యానందరసం, మంజిష్టాదిక్వాదం మేలు చేస్తాయి. అలాగే మాంసం, నూనె, కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. మీరు ఆయుర్వేద నిపుణులను కలిస్తే.. జబ్బును నిర్ధారణ చేసి తగు ఔషధాలు సూచిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని