కరోనా వచ్చింది వాసన పోయింది

నా వయసు 69 సంవత్సరాలు. నాకు 8 నెలల క్రితం కొవిడ్‌-19 వచ్చింది. అప్పట్నుంచీ వాసన, రుచి తెలియటం లేదు.

Updated : 12 Aug 2022 15:18 IST

సమస్య సలహా

సమస్య: నా వయసు 69 సంవత్సరాలు. నాకు 8 నెలల క్రితం కొవిడ్‌-19 వచ్చింది. అప్పట్నుంచీ వాసన, రుచి తెలియటం లేదు. దయజేసి దీనికి తగు చికిత్సను సూచించండి.

- ఎ. చంద్రమౌళి, వరంగల్‌

సలహా: కొవిడ్‌-19 బారినపడ్డవారిలో చాలామందికి రుచి, వాసన పోతున్నాయి. నూటికి 90 మందికి వారం తర్వాత తిరిగి తెలుస్తున్నాయి గానీ కొందరికి పూర్తిగా పోతున్నాయి. దీనికి కారణం వాసనను పసిగట్టటానికి తోడ్పడే నాడీకణాలు పూర్తిగా దెబ్బతినటం. వాసన తెలియకపోతే నాలుక మీదుండే రుచి మొగ్గలు ప్రేరేపితం కావటమూ తగ్గుతుంది. మన ముక్కు లోపల పైగోడలో వాసనలను పసిగట్టే భాగం ఉంటుంది. ఇక్కడ నాడీకణాలతో పాటు వీటికి సాయం చేసే అనుసంధాన కణాలూ ఉంటాయి. అనుసంధాన కణాలు దెబ్బతింటే కోలుకుంటాయి. నాడీకణాలు దెబ్బతింటే మాత్రం రుచి, వాసనలను గుర్తించే శక్తి తిరిగి రాదనే చెప్పుకోవచ్చు. ఎనిమిది నెలలు దాటినా మీకు రుచి, వాసన తెలియటం లేదంటే తిరిగి రాకపోవచ్చనే అనుకోవచ్చు. బహుషా మీకు వైరస్‌ ఉద్ధృతంగా దాడి చేసి ఉండొచ్చు. వాసనను పసిగట్టే నాడీకణాలు పూర్తిగా దెబ్బతిని ఉండొచ్చు. అయినప్పటికీ ముక్కులోకి కొట్టుకునే కార్టికో స్టిరాయిడ్‌ స్ప్రేలను పయత్నించి చూడొచ్చు. ఫ్లూటికజోన్‌ ప్యురయేట్‌, మమెటోజోన్‌ ప్యూరయేట్‌ స్ప్రేలలో ఏదో ఒక దాన్ని వాడుకోవచ్చు. ఒకో ముక్కులో రోజుకు రెండుసార్ల చొప్పున నెల వరకు వాడి చూడండి. డాక్టర్‌ సలహా మేరకు కార్టికో స్టిరాయిడ్‌ మాత్రలనూ వేసుకోవచ్చు. వీటితో కచ్చితంగా రుచి, వాసన తిరిగి తెలుస్తాయని చెప్పలేం గానీ కొంతవరకు ఫలితం ఉండొచ్చు. వీటితో కుదురుకోకపోతే వాసన శక్తి శాశ్వతంగా పోయినట్టే. దురదృష్టం కొద్దీ దీనికి ఇతరత్రా చికిత్సలేవీ లేవు. కొన్నిసార్లు ముక్కులో బుడిపెలు (పాలిప్స్‌) పెరిగినా వాసన పోవచ్చు. ఇలాంటివి ఉన్నాయేమో చూసుకోవటం మంచిది. మీరు దగ్గర్లోని ముక్కు, చెవి, గొంతు నిపుణులను కలవండి. ముక్కులో ఎండోస్కోపీ పరీక్ష చేసి చూస్తారు. అవసరమైతే పారానేసల్‌ సైనసస్‌ సీటీ స్కాన్‌ చేయిస్తారు. బుడిపెల వంటివి ఉంటే బయటపడుతుంది. వీటిని తొలగిస్తే వాసన తిరిగి వస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని