కొవిడ్‌పై ఊబకాయ భారం

అధిక బరువు, ఊబకాయం కలిగున్నారా? అయితే కరోనా కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అధిక బరువు, ఊబకాయం

Published : 20 Apr 2021 01:29 IST

అధిక బరువు, ఊబకాయం కలిగున్నారా? అయితే కరోనా కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అధిక బరువు, ఊబకాయం గలవారికి తీవ్ర కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉంటోందని మడాక్‌ చిల్డ్రన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎంసీఆర్‌ఐ), క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ అధ్యయనం హెచ్చరిస్తోంది. అంతేకాదు, మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే వీరికి ఆక్సిజన్‌ అవసరమూ ఎక్కువగానే ఉంటోందని, శ్వాసనాళానికి రంధ్రం చేసి గొట్టం ద్వారా ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరమూ ఏర్పడుతోందని పేర్కొంటోంది. ఊబకాయానికీ కొవిడ్‌-19కూ మధ్య ఉన్న సంబంధాన్ని ఇది మరోసారి పట్టి చూపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఊబకాయానికి దారితీస్తున్న సామాజిక-ఆర్థిక కారణాలను పరిష్కరించటానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని వివరిస్తున్నారు. జంక్‌ఫుడ్‌ మీద పరిమితులు విధించటం వంటి వాటిపై దృష్టి సారించాలని నొక్కి చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఊబకాయాన్ని తగ్గించుకోవటం, నివారించుకోవటం సాధ్యం కాకపోవచ్చు. కానీ వీటి మీద దృష్టి పెడితే మున్ముందు ముంచుకొచ్చే మహమ్మారులను ఎదుర్కోవటానికి తోడ్పడగలదని సూచిస్తున్నారు. అంటే ఇన్‌ఫెక్షన్లతో తలెత్తే గుండెజబ్బు, పక్షవాతం వంటి తీవ్ర, దీర్ఘకాలిక సమస్యల ముప్పులను తగ్గించుకునే అవకాశముంటుందన్నమాట.

కాలిగోళ్లు గట్టిగా ఉంటే?

పాదాల అందంలో కాలిగోళ్లూ ముఖ్యమే. కాకపోతే కొందరికివి చాలా గట్టిగా, దళసరిగా ఉంటాయి. వీటిని తీసుకోవటానికి చాలా కష్టపడుతుంటారు కూడా. ఇలాంటివాళ్లు గోరువెచ్చని నీటిలో చెంచాడు ఉప్పు కలిపి.. పాదాలను కాసేపు అందులో పెట్టాలి. దీంతో గోళ్లు మెత్తబడతాయి. పెళుసుదనం తగ్గుతుంది. తేలికగా తీసుకోవటానికి వీలవుతుంది.

అయినా ఫలితం లేదా?

వ్యాయామాలు చేస్తున్నా బరువు తగ్గటం లేదని కొందరు వాపోతుంటారు. దీర్ఘకాలం బరువు పెరగకుండా ఉండటానికి ఏరోబిక్‌ వ్యాయామాలతో పాటు బరువులు ఎత్తటం, కండరాల సాగదీత వంటివీ సాధన చేస్తుండాలి. అయినా వయసుతో పాటు బరువూ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల వ్యాయామ సమయాన్ని పెంచుకోవటమే కాదు, ఆహారమూ తగ్గించుకోవాలి.

త్వరగా అలసిపోతున్నారా?

వ్యాయామం చేసేటప్పుడు ఇంతకుముందు కన్నా త్వరగా అలసిపోతున్నారా? అయితే వ్యాయామాలకు ముందు ఒక మంచి కాఫీ.. అలాగే ఐదారు గింజపప్పులు (బాదం, పిస్తా, అక్రోట్ల వంటివి) తిని చూడండి. ఇవి వ్యాయామ సామర్థ్యం, కొవ్వును కరిగించే శక్తిని పెంపొందిస్తున్నట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా అలసట, నిస్సత్తువా తగ్గుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని