కొవిడ్‌-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?

కొవిడ్‌-19 కేసులు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయి? దీన్ని ఎప్పుడు ప్రమాదకరంగా పరిగణించాలి? ఇంట్లో ఉన్నవారు ఎలాంటి

Published : 20 Apr 2021 01:42 IST

సమస్య: కొవిడ్‌-19 కేసులు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయి? దీన్ని ఎప్పుడు ప్రమాదకరంగా పరిగణించాలి? ఇంట్లో ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? ఏం చేయాలో అర్థం కావటం లేదు.

- జి.ఎస్‌.వాణి, హైదరాబాద్‌

సలహా: ప్రస్తుతం మీలాగే అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్నలివి. తొలిసారి కన్నా రెండోసారి కొవిడ్‌-19 చాలా వేగంగా వ్యాపించటానికి కొత్తరకం కరోనా వైరస్‌ కారణం కావొచ్చు. అతి త్వరగా వ్యాపించటం దీని ప్రత్యేకత. చాలామందిలో లక్షణాలు పెద్దగా కనిపించటం లేదు కూడా. ఇంట్లో, ఆఫీసులో, కర్మాగారాల్లో ఒకరికి వస్తే అందరికీ అంటుకుంటోంది. ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కరోనా పరీక్ష పాజిటివ్‌గా వచ్చినా ఆరోగ్యంగా ఉన్నవారు.. ముఖ్యంగా 45 ఏళ్ల కన్నా చిన్నవారు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులు లేనివారు అంతగా కంగారు పడాల్సిన పనిలేదు. అలాగని కొందరికి తీవ్రంగా మారే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల ఎప్పుడు ప్రమాదకరం? ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి? అని మీలాగే చాలామంది కలవరపడుతున్నారు. సాధారణంగా మన రక్తంలో 99-100% ఆక్సిజన్‌ ఉంటుంది. ఇది 94% కన్నా ఎక్కువున్నంతవరకు ఇబ్బందేమీ లేదు. అంతకన్నా తగ్గితే బయటి నుంచి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆసుపత్రికి వెళ్లాలి. ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ శాతాన్ని తేలికగానే గుర్తించొచ్చు. దీన్ని కుడి చేతి మధ్య వేలుకు ఒక నిమిషం సేపు పెట్టుకొని ఫలితాలు చూసుకోవాలి. గుండెజబ్బులు, కిడ్నీజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారు మాత్రం ఆక్సిజన్‌ శాతం మామూలుగానే ఉన్నా ఒకసారి డాక్టర్‌ సలహా తీసుకోవాలి. ఇలాంటివారు కొన్నిసార్లు ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. జ్వరం, ఆయాసం, దగ్గు వంటి లక్షణాలు విడవకుండా వేధిస్తున్నా.. లక్షణాలు తగ్గకుండా పెరుగుతూ వస్తున్నా ఆసుపత్రిలో చేరాల్సి రావొచ్చు. వయసు పైబడ్డవారు, ఇతరత్రా జబ్బులున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని నిర్లక్ష్యం చేయరాదు. డాక్టర్‌ సలహా లేకుండా సొంతంగా మందులు కొనుక్కొని వేసుకోవటం మంచి పద్ధతి కానే కాదు. ఇన్‌ఫెక్షన్‌ తొలినాళ్లలో వైరస్‌ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సమయంలో స్టిరాయిడ్లు వాడితే వైరస్‌ మరింతగా వృద్ధి చెందుతుంది. ఆక్సిజన్‌ తగ్గితేనే, అదీ వైద్యుల పర్యవేక్షణలోనే స్టిరాయిడ్లు వాడుకోవాల్సి ఉంటుందని గుర్తించాలి. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ కూడా ఆక్సిజన్‌ తగ్గితేనే, ఆసుపత్రిలో చేరినవారికే ఇస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‌ తగ్గకపోయినా తొలివారంలో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ అవసరపడొచ్చు. రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసే కొత్తరకం మందులను విచక్షణా రహితంగా వాడుకోకూడదు. ఆక్సిజన్‌ తగ్గినవారు, డీడైమర్‌ ఎక్కువగా ఉన్నవారు, ఇతరత్రా జబ్బులున్నవారు డాక్టర్‌ సలహా మేరకు వీటిని తీసుకోవాలి. అనవసరంగా వాడితే అవయవాల్లో రక్తస్రావం జరిగే ప్రమాదముంది. మెదడులో రక్తస్రావమైతే ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. అలాగే విచక్షణా రహితంగా యాంటీబయోటిక్స్‌ వాడకూడదు. సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తితేనే వేసుకోవాలి. ఇక.. 45 ఏళ్ల కన్నా చిన్నవారు, ఇతరత్రా సమస్యలేవీ లేనివారు, ఆక్సిజన్‌ శాతం బాగున్నవారు, లక్షణాలు ఉద్ధృతంగా లేనివారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండొచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ద్రవాలు ఎక్కువగా తాగాలి. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే బత్తాయి, నారింజ వంటి పండ్ల రసాలైతే ఇంకా మంచిది. ఆరోగ్యకరమైన, పోషకాహారం ముఖ్యం. పథ్యాలేవీ అవసరం లేదు. మాంసాహారం, శాకాహారం ఏదైనా తినొచ్చు. కంటి నిండా నిద్రపోవాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. బాత్రూమ్‌ విడిగా ఉంటే మంచిది. కంచాలు, గ్లాసుల వంటివీ విడిగానే ఉంచుకోవాలి. ఇంట్లో మిగతావాళ్లకు పరీక్ష నెగెటివ్‌ వచ్చినా సరే. అందరూ మంచి నాణ్యమైన మాస్కులు ధరించాలి. రెండు గజాల దూరం పాటించాలి. ఇంట్లో వృద్ధులుంటే మరింత జాగ్రత్త అవసరం. ఇంట్లో విడిగా ఉండటం కుదరకపోతే కొవిడ్‌ కేంద్రాల్లో చేరటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని