రక్తహీనతతో కొవిడ్‌ తీవ్రం!

కొవిడ్‌-19 ఒకొకరిపై ఒకోలా ప్రతాపం చూపుతోంది. ఇది తీవ్రం కావటానికి వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి రకరకాల అంశాలు దోహదం చేస్తున్నాయి.

Updated : 31 Aug 2021 06:30 IST

కొవిడ్‌-19 ఒకొకరిపై ఒకోలా ప్రతాపం చూపుతోంది. ఇది తీవ్రం కావటానికి వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి రకరకాల అంశాలు దోహదం చేస్తున్నాయి. చాలామంది పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు గానీ రక్తహీనత (ఎనీమియా) కూడా తక్కువదేమీ కాదు. కొవిడ్‌-19 తీవ్రతలో దీని పాత్రా చాలానే ఉంటోంది. అందువల్ల ఇప్పటికే రక్తహీనతతో బాధపడుతున్నవారు దీనిపై అవగాహన కలిగుండటం అవసరం. కొవిడ్‌-19 అనుమానిత లక్షణాలు గలవారిలో కొత్తగా రక్తహీనత తలెత్తినా, తీవ్రమవుతున్న లక్షణాలు కనిపించినా జాగ్రత్త పడాల్సిందే.

క్తహీనత పెద్ద సమస్య. ప్రపంచవ్యాప్తంగా సుమారు 162 కోట్ల మంది.. అంటే జనాభాలో పావు వంతు మంది దీంతో బాధపడుతున్నవారే. అదే మనదేశంలోనైతే 39.86% మంది రక్తహీనత గలవారేనని 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంటోంది. దీని బారినపడ్డవారిలో బలహీనత, నిస్సత్తువ, చర్మం పాలిపోవటం, ఆయాసం, తలతిప్పు, తల తేలిపోతున్నట్టు అనిపించటం, ఛాతీ నొప్పి, కాళ్లు చేతులు చల్లబడటం, తలనొప్పి వంటి లక్షణాలెన్నో కనిపిస్తుంటాయి. ఇది గుండె లయ అస్తవ్యస్తం కావటం వంటి సమస్యలకూ దారితీస్తుంది. అంతేకాదు.. శ్వాసకోశ జబ్బుల్లో రక్తహీనత ప్రమాదకరంగానూ పరిణమిస్తుంది. రక్తహీనత, న్యుమోనియా రెండూ తోడైతే 90 రోజుల్లో మరణించే ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రక్తహీనతతో తలెత్తే సమస్యలకు ఇప్పుడు తీవ్ర కొవిడ్‌-19 సైతం జత కలిసింది. రక్తహీనతతో కొవిడ్‌-19 తీవ్రమయ్యే ముప్పు, మరణాల రేటు పెరుగుతున్నట్టు ఇటీవలి అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి.

ఎందుకిలా?

మొదట్లో కొవిడ్‌-19 ఊపిరితిత్తుల మీదే దాడి చేస్తుందని భావించేవారు. కానీ ఇది వివిధ రకాలుగా పలు అవయవాలనూ దెబ్బతీస్తుండటం గమనార్హం. రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోవటమూ చూస్తున్నదే. ఇక్కడే రక్తహీనత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. మన రక్తంలోని ఎర్ర రక్తకణాల ముఖ్యమైన పని వివిధ అవయాలకు ఆక్సిజన్‌ను చేరవేయటం. ఆయా అవయవాల నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను తిరిగి ఊపిరితిత్తులకు తీసుకొస్తాయి కూడా. రక్తహీనతలో ఎర్ర రక్తకణాల సంఖ్య, హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉంటాయి. ఆక్సిజన్‌ను మోసుకుపోయేది హిమోగ్లోబినే. రక్తహీనత గలవారిలో ఇది తక్కువగా ఉండటం వల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గే ప్రమాదం ఎక్కువ. ఫలితంగా అయవవాల పనితీరూ అస్తవ్యస్తమవుతుంది. ఇది కొవిడ్‌-19లో తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. కొందరిలో కొవిడ్‌-19తో రక్తహీనత తీవ్రం కావొచ్చు కూడా. ఎందుకంటే సార్స్‌-కొవీ-2 ఎర్ర రక్తకణాల గ్రాహకాలతోనూ చర్య జరుపుతోంది. ఇలా హిమోగ్లోబిన్‌ పనితీరును అస్తవ్యస్థం చేస్తూ రక్తహీనత తీవ్రమయ్యేలా చేస్తోంది. హిమోగ్లోబిన్‌లో ఐరన్‌తో కూడుకొని ఉండే భాగం మీదా కరోనా వైరస్‌ దాడిచేసే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఎర్ర రక్తకణాల ఆకారమూ మారిపోవచ్చు. మరోవైపు సార్స్‌-కొవీ-2 ముల్లు ప్రొటీన్‌ ఐరన్‌ లోపానికీ కారణమవుతోంది. ఇదీ హిమోగ్లోబిన్‌ పనితీరును దెబ్బతీస్తుంది. రక్తంలో ఫెరిటిన్‌ స్థాయులు పెరిగేలా చేస్తుంది. కొవిడ్‌-19లో ఫెరిటిన్‌ స్థాయులు పెరగటం వాపు ప్రక్రియ ప్రతిస్పందన శ్రుతి మించటానికి కారణమవుతోంది. ఇది సైటోకైన్ల ఉప్పెనకు మార్గం వేస్తుంది. కొవిడ్‌-19 తీవ్రమైనవారిలో ఇదే చాలావరకు మరణాలకు కారణమవుతుండటం చూస్తూనే ఉన్నాం. అందుకే రక్తహీనత, ఐరన్‌ జీవక్రియలను సూచించే హిమోగ్లోబిన్‌, ఫెరిటిన్‌, ట్రాన్స్‌ఫెరిన్‌, పెరిటిన్‌/ట్రాన్స్‌ఫెరిన్‌ నిష్పత్తి, ఎర్ర రక్తకణాల వ్యత్యాసం పరీక్షలు కీలకంగా మారాయి. కొవిడ్‌-19 తీవ్రమయ్యే ముప్పును గుర్తించటానికివి బాగా ఉపయోగపడుతున్నాయి.


నివారించుకోవచ్చా?

క్తహీనతలో చాలా రకాలున్నాయి. మిగతా వాటి విషయంలో సాధ్యం కాదు కానీ ఐరన్‌ లోపంతో తలెత్తే రక్తహీనతను నివారించుకోవచ్చు. ఐరన్‌, ఫోలేట్‌, విటమిన్‌ బి-12, విటమిన్‌ సి లభించే పదార్థాలు తినటం ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. దీంతో కొవిడ్‌-19 తీవ్రమయ్యే ప్రమాదాన్నీ తప్పించుకోవచ్చు.l

ఐరన్‌: మాంసం, చిక్కుళ్లు, పప్పులు, ఐరన్‌ కలిపి తయారుచేసిన పదార్థాలు, ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, ఖర్జూరం వంటి ఎండు ఫలాల్లో ఐరన్‌ దండిగా ఉంటుంది.


ఫోలేట్‌: పండ్లు, పండ్ల రసాలు, ఆకు కూరలు, పచ్చ బఠానీ, వేరుశనగల వంటి వాటితో ఫోలేట్‌ బాగా లభిస్తుంది.


విటమిన్‌ బి-12: ఇది మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్‌, సోయా ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది.


విటమిన్‌ సి: శరీరం ఐరన్‌ను సంగ్రహించుకోవటానికి విటమిన్‌ సి తోడ్పడుతుంది. ఇది జామ, బత్తాయి, నారింజ, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరి, మిరమకాయలు, టమోటాలతోనూ లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని