మెదడు.. మనసు.. ఓ అల్జీమర్స్‌

అవటానికి అల్జీమర్స్‌ మెదడు సమస్యే. కానీ అది అక్కడితోనే ఆగిపోదు. జ్ఞాపకాలను తుడిచేయటంతో పాటు మానసికంగానూ కుంగదీస్తుంది.  ప్రవర్తననూ గణనీయంగా మార్చేస్తుంది. కాబట్టే ప్రస్తుతం కుంగుబాటు, నిరాసక్తత, కోపం, భ్రాంతుల వంటి వాటినీ ...

Updated : 10 Sep 2022 14:44 IST

నేడు ప్రపంచ అల్జీమర్స్‌ దినం

అవటానికి అల్జీమర్స్‌ మెదడు సమస్యే. కానీ అది అక్కడితోనే ఆగిపోదు. జ్ఞాపకాలను తుడిచేయటంతో పాటు మానసికంగానూ కుంగదీస్తుంది.  ప్రవర్తననూ గణనీయంగా మార్చేస్తుంది. కాబట్టే ప్రస్తుతం కుంగుబాటు, నిరాసక్తత, కోపం, భ్రాంతుల వంటి వాటినీ అల్జీమర్స్‌ కీలక లక్షణాలుగా పరిగణిస్తున్నారు. వీటి తీవ్రతను బట్టి విషయ గ్రహణ సామర్థ్యం క్షీణించే వేగాన్ని, ఇతరుల మీద ఆధారపడటాన్ని, జీవన కాలాన్ని కూడా అంచనా వేస్తున్నారు. మెదడు నిర్మాణంలో, పనితీరులో మార్పులకూ నాడీ-మానసిక సమస్యలకూ బలమైన సంబంధం ఉంటున్న నేపథ్యంలో వీటికి రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది.

నిషి అంటేనే జ్ఞాపకాల సమాహారం. జ్ఞాపకాల తోడు లేకపోతే జీవితమే మోడు వారుతుంది. మన ప్రతి కదలికా, ప్రతి మాటా, ప్రతి పనీ వీటితో ముడిపడిందే. అంతటి కీలకమైన జ్ఞాపకాలను సమూలంగా తుడిచిపెట్టేస్తుంది అల్జీమర్స్‌. వృద్ధాప్యంలో దాడిచేసే ఇది కన్నవారినీ, కట్టుకున్నవారినీ గుర్తుపట్టలేని స్థితికి తీసుకొస్తుంది.  తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్‌ ఒకటి. ప్రధానమైంది కూడా. డిమెన్షియా బాధితుల్లో దాదాపు 60-70% మందిలో కనిపించేది ఇదే. ప్రపంచవ్యాప్తంగా 5.7 కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతుండగా.. వీరిలో 50 లక్షల మందికి పైగా మనదేశానికి చెందినవారే. వీరి సంఖ్య 2030 నాటికి 76 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో నిజంగా ఇది కలవరం కలిగించే విషయమే. ఎందుకంటే 65 ఏళ్లు పైబడినవారిలోనే అల్జీమర్స్‌ ఎక్కువ. ఇది శారీరకంగా కన్నా మానసికంగా, ప్రవర్తన పరంగానే ఎక్కువ ఇబ్బందులు సృష్టిస్తుంది. అల్జీమర్స్‌ బాధితుల్లో ఎక్కువమంది ఎప్పుడో ఒకప్పుడు ఈ మానసిక, ప్రవర్తన సమస్యల కోరల్లో చిక్కుకునేవారే. ఇవి జబ్బుతో బాధపడేవారికే కాదు. కుటుంబానికి, కనిపెట్టుకునేవారికీ చిక్కులు తెచ్చిపెడతాయి. అందువల్ల వీటి గురించి తెలుసుకొని ఉండటం మంచిది. లేకపోతే అల్జీమర్స్‌తో బాధపడేవారిని అపార్థం చేసుకోవటానికి దారితీస్తుంది. చెడు అభిప్రాయాలకు తావిస్తుంది. జబ్బు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అల్జీమర్స్‌ బాధితులను అంత బాగా అర్థం చేసుకోవటానికి, మరింత అండగా నిలవటానికి తోడ్పడుతుంది. మున్ముందు ముంచుకొచ్చే మార్పులను ఎదుర్కొనేలా సన్నద్దం చేస్తుంది. కాబట్టే ‘డిమెన్షియా గురించి తెలుసుకో, అల్జీమర్స్‌ గురించి తెలుసుకో’ అని ఈ సంవత్సరపు ప్రపంచ అల్జీమర్స్‌ దినం నినదిస్తోంది.


మానసిక సమస్యలు- రకరకాలు

డిమెన్షియా, అల్జీమర్స్‌లో మెదడు కణాలు క్షీణించిపోతుండటం వల్ల క్రమంగా చాలా మార్పులు పొడసూపుతుంటాయి. మెదడులో ప్రభావితమైన భాగాన్ని బట్టి ఆయా లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. జ్ఞాపకశక్తి, విషయ గ్రహణ సామర్థ్యాలు తగ్గటంతో పాటు ప్రవర్తన, మూడ్‌, వ్యక్తిత్వం సైతం మారిపోవటం గమనార్హం. కాబట్టే వీటిని డిమెన్షియాలో తలెత్తే ప్రవర్తన, మానసిక సమస్యల లక్షణాలనీ (బీపీఎస్‌డీ- బిహేవియరల్‌ అండ్‌ సైకలాజికల్‌ సింప్టమ్స్‌ ఇన్‌ డిమెన్షియా) ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. డిమెన్షియా బాధితుల్లో 80-90% మంది ఒకట్రెండు ప్రవర్తన, మానసిక సమస్యలతో సతమతమయ్యేవారే. నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిల్లటం, చుట్టుపక్కల పరిసరాల మీద స్పృహ లేకపోవటం, తమ పనులతో ఇతరులకు కలిగే ఇబ్బందిని అర్థం చేసుకోలేకపోవటం వంటివి వీటిని మరింత ఉద్ధృతం చేయొచ్చు. చాలాసార్లు మతిమరుపు కన్నా ప్రవర్తన మార్పులే కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా పరిణమిస్తాయి. ‘మరచిపోతే మరచిపోయారు గానీ ఇవేం బాధలు’ అని చాలామంది వాపోవటం చూస్తూనే ఉంటాం.

* కోపం, ఉద్రిక్తత: ప్రవర్తన మార్పుల్లో ప్రధానమైనవి ఇవే. సుమారు 60% మందిలో కనిపిస్తుంటాయి. కోపానికి కారణాలు చాలానే ఉండొచ్చు. వీటిల్లో ముఖ్యమైంది అర్థం చేసుకోలేకపోవటం. అల్జీమర్స్‌ బాధితులు చెప్పేది ఇతరులకు సరిగా అర్థం కాదు. ఇతరులు చెప్పేది వారికి అర్థం కాదు. చుట్టుపక్కల జరిగే ఘటనలనూ అర్థం చేసుకోలేకపోవచ్చు. ఫలితంగా ఒకరకమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఇవి కోపానికి, ఉద్రిక్త స్వభావానికి దారితీస్తాయి. విసుగు, అసౌకర్యం వంటివీ ఇందుకు కారణం కావొచ్చు.

* కుంగుబాటు (డిప్రెషన్‌): తొలిదశలో తాము మరచిపోతున్నామని, తమకేదో అయిపోతోందని గుర్తించగలిగే స్థితిలో ఉంటారు. దీంతో క్రమంగా కుంగుబాటు, ఆందోళనకు గురవుతుంటారు. జబ్బు ముదిరి, మతిమరుపు ఎక్కువయ్యాక, తమను తాము గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాక కుంగుబాటు పోతుంది. మిగతా లక్షణాలు మాత్రం అలాగే కనిపిస్తాయి. కొందరు దేని మీదా ఆసక్తి చూపకపోవచ్చు. స్తబ్ధుగా ఉండిపోవచ్చు. నిరాశా, నిస్పృహలకు లోనుకావొచ్చు.

* కుదురుగా ఉండకపోవటం: మాటిమాటికీ ఇంట్లోంచి బయటకు వెళ్లాలని అనుకోవటం మరో సమస్య. ఎక్కడికి వెళ్లాలనేది తెలియదు. కారణమూ ఉండదు. అయినా బయటకు వెళ్లాలని తాపత్రయ పడుతుంటారు. కొందరు అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు తిరుగుండొచ్చు. కొందరు గుండ్రంగానూ తిరగొచ్చు. కొన్నిసార్లు కోపంతోనూ ఇలా చేస్తుండొచ్చు. పాత విషయాలే ఎక్కువగా గుర్తుండటం వల్ల ఇప్పుడు ఉంటున్న ఇల్లు తమది కాదనీ అనుకోవచ్చు. చిన్నప్పుడు ఊళ్లో ఉన్న రోజులు తరచూ గుర్తుకురావచ్చు. ‘నా ఇల్లు అక్కడుంది, నన్ను ఇక్కడికి తెచ్చి పడేశారు. నా ఇంటికి తీసుకెళ్లిపో’ అని వాదిస్తుండొచ్చు. అక్కడెవరూ లేరని చెప్పినా పట్టించుకోరు. ఇంట్లో వాళ్లని గుర్తుపట్టలేకపోవటం వల్ల తమ వాళ్లంతా ఎక్కడికో వెళ్లిపోయారని భావించొచ్చు. తనను వాళ్ల దగ్గరికి తీసుకెళ్లమని పట్టుబట్టొచ్చు. ‘నేనే కొడుకుని, నేనే కుమార్తెను’ అని చెప్పినా నమ్మరు. నా పిల్లలు ఎక్కడో ఉన్నారు, అక్కడికి తీసుకెళ్లమని పదే పదే గొడవ పెడుతుంటారు.

* లేనిపోని అనుమానాలు: కొందరికి అనుమానాలూ ఎక్కువ కావచ్చు. తమకెవరో హాని తలపెడుతున్నారని అనుకోవటం, తమ చోటును ఎవరో ఆక్రమిస్తున్నారని, ఎవరో తమను చంపేయాలని చూస్తున్నారని అనుకోవచ్చు. జీవిత భాగస్వాములనూ అనుమానించొచ్చు.

*మళ్లీ మళ్లీ అవే పనులు: గుర్తుండకపోవటం వల్ల చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తుండొచ్చు.

* భ్రమలు: అల్జీమర్స్‌లో కణతల వద్ద ఉన్న మెదడు ఎక్కువగా క్షీణిస్తుంటుంది. ఇది భ్రమలకు దారితీస్తుంది. ఎవరో తమను పిలుస్తున్నారని, ఎదురుగా వచ్చి నిల్చున్నారని భ్రమపడొచ్చు. తమ వస్తువులు ఎవరో దొంగిలించారని ఆరోపించొచ్చు. ఇతరుల మీద చాడీలు చెప్పొచ్చు.

* నిద్ర పట్టకపోవటం: కుంగుబాటు, ఆందోళన, కోపం వంటి వాటి మూలంగా రాత్రిపూట సరిగా నిద్రపట్టక సతమతమైపోతుంటారు.


మందులతో ఉపశమనం

ప్రస్తుతానికి అల్జీమర్స్‌ను నయం చేసే మందులేవీ లేవు. కానీ ఆయా లక్షణాలు, ప్రవర్తనలు తగ్గటానికి కొన్ని చికిత్సలు ఉపయోగపడతాయి. ఇందులో నాడీ నిపుణుల కన్నా మానసిక నిపుణుల పాత్రే ఎక్కువ. సాధారణంగా ఏదైనా మానసిక సమస్యను నిర్ధారిస్తే దానికి సంబంధించిన మందులను దీర్ఘకాలం ఇస్తుంటారు. అల్జీమర్స్‌లో అలా కాదు. లక్షణాలు తరచూ మారిపోతుంటాయి కాబట్టి ఒకే మందు ఇవ్వటం కుదరదు. కుంగుబాటుకు యాంటీ డిప్రెసెంట్లు, భ్రమలకు లోనవుతుంటే యాంటీ సైకాటిక్స్‌, మానసిక స్థితి మారుతుంటే మూడ్‌ స్టెబిలైజర్లు.. ఇలా ఆయా లక్షణాలు, తీవ్రతను బట్టి మందులను మార్చాల్సి ఉంటుంది.


కనిపెట్టుకునేవారే కీలకం

ల్జీమర్స్‌ నియంత్రణలో మందుల కన్నా కనిపెట్టుకునేవారే కీలకం. జబ్బు ఒకసారి మొదలైతే ముదరటమే తప్ప, నయమయ్యేది కాదు. అందువల్ల దీని బారినపడ్డ వారిని అర్థం చేసుకొని అండగా నిలవటం చాలా చాలా ముఖ్యం. వీరి ప్రవర్తనను అర్థం చేసుకుంటేనే నియంత్రించటం సాధ్యమవుతుంది. అల్జీమర్స్‌లో అవగాహన శక్తి కొరవడుతుంది. అందువల్ల మనం చేయమన్నట్టు చేయరనే విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి. కొన్ని ఉపాయాలతో సముదాయించటం అలవరచుకోవాలి. కాబట్టి కనిపెట్టుకునేవారికి కౌన్సెలింగ్‌, శిక్షణ అవసరం.  

* అల్జీమర్స్‌ బాధితులు ఏదైనా మాట్లాడుతుంటే మధ్యలో ఆపెయ్యకూడదు. అలా చేస్తే చిన్నచూపు చూస్తున్నారనే భావనతో చిరాకు, కోపం ముంచుకొస్తాయి. ముందుగా చెప్పేది పూర్తిగా వినాలి. తర్వాత నెమ్మదిగా నచ్చజెప్పాలి. స్పష్టంగా చెబితే చాలామంది వింటారు కూడా. ఉదాహరణకు- తమ ఊరుకు వెళతానని అన్నారనుకోండి. సరే అలాగే చేద్దామని చెప్పొచ్చు. ‘టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకొని, సాయంత్రం వెళ్దాం. ఇప్పుడు తిని పడుకో’ అని నచ్చజెప్పొచ్చు. దీంతో అప్పటికి ఆగిపోతారు. తర్వాత ఆ విషయం గుర్తుండదు కాబట్టి అక్కడితోనే మరచిపోతారు. బయటకు పోదామని పట్టుబట్టేవారిని కాసేపు అలా తీసుకెళ్లి వస్తే శాంత పడతారు. తిననని మారాం చేసేవారిని బలవంతం చేస్తే మరీ మొండికేయొచ్చు. కాసేపు అలాగే వదిలేసి.. తర్వాత తినమంటే వాళ్లే తింటారు. ఇలా పరిస్థితిని బట్టి నడుచుకోవాల్సి ఉంటుంది. సున్నితంగా శరీరాన్ని మర్దన చేయటం, శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించటమూ వీరికి మేలు చేస్తాయి. రంగు రంగు దారాలతో అల్లిన తొడుగులను చేతులకు తొడిగించొచ్చు. జంతువుల బొమ్మలను చేతికి ఇవ్వచ్చు. ఇవి దుడుకుతనాన్ని నివారించి, కుదురుగా ఉండటానికి తోడ్పడతాయి.

* నిరాశా నిస్పృహలకు లోనయ్యేవారికి కథల వంటివి చదివి వినిపించొచ్చు. ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించొచ్చు. ఆటలు ఆడించొచ్చు. దగ్గరుండి పజిల్స్‌ పూరించొచ్చు. పెంపుడు జంతువులతో గడిపేలా చూడొచ్చు. ఇష్టమైన సంగీతం వినిపించటం, వీలైనంత వరకు వ్యాయామం చేయించటమూ ఉపయోగపడతాయి.

* కుంగుబాటు లక్షణాలు గలవారిని వ్యాయామం చేసేలా, నలుగురితో గడపేలా, పనుల్లో నిమగ్నమయ్యేలా చూడటం మంచిది. వీరికి తొలిదశలో ప్రవర్తనను మార్చే కౌన్సెలింగ్‌ బాగా పనికొస్తుంది.

* ఒకచోట కుదురుగా ఉండకుండా అటూఇటూ తిరిగేవారికి నడక వ్యాయామంగానూ ఉపయోగపడుతుంది. ఇది నిద్ర పట్టేలా, ఆరోగ్యం మెరుగుపడేలా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కాకపోతే ప్రమాదాలకు గురికాకుండా వీరిని ఓ కంట కనిపెట్టాలి. బయటకు వెళ్లాల్సిన అవసరముందో లేదో తెలుసుకునేలా వివరించి చెబితే చాలామంది ఆగిపోవచ్చు. వీలైతే స్మార్ట్‌వాచ్‌ వంటి జీపీఎస్‌ పరికరాలను చేతికి ధరించేలా చూసుకోవాలి.

* రాత్రిపూట సరిగా నిద్రపోనట్టయితే ఆకలి, దాహం వంటివేవైనా కారణమవుతున్నాయేమో ఆరా తీయాలి. సాయంత్రం వేళల్లో కాఫీ వంటివి ఇవ్వకూడదు. పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడాలి. బాత్రూమ్‌కు వెళ్లి వచ్చాకే పడుకోబెట్టాలి. పడక గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా, చప్పుళ్లు లేకుండా చూడాలి.


ప్రత్యేక మతిమరుపు

ల్జీమర్స్‌ అనగానే ముందుగా మనసులో మెదిలేది మతిమరుపే. ఇదో ప్రత్యేకమైన మతిమరుపు. ముఖ్యంగా తక్షణ విషయాలు గుర్తుండవు. ఒకట్రెండు రోజుల కింద చేసిన పనులు, చూసిన మనుషులు, ఎదుర్కొన్న ఘటనలేవీ జ్ఞాపకముండవు. కానీ పాత విషయాలు బాగానే గుర్తుండటం విచిత్రం. దీంతో వీరేదో కావాలనే చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్లు అనుకుంటుంటారు. ‘ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగినవి బాగానే చెబుతున్నారు, నిన్నా మొన్నా జరిగినవి గుర్తుండటం లేదంటున్నారంటే కావాలని చేస్తున్నదే’ అని అపార్థం చేసుకుంటుంటారు. నిజానికి అల్జీమర్స్‌ ప్రత్యేక లక్షణం ఇదేనని చాలామందికి తెలియదు. అల్జీమర్స్‌ మూడు దశల్లో (తొలి, మధ్య, చివరి) కొనసాగుతూ వస్తుంది. మొదలయ్యాక చివరి దశకు చేరుకోవటానికి కనీసం ఐదారేళ్లు పడుతుంది. మధ్య దశలోకి అడుగుపెట్టాక క్రమంగా పాత విషయాలు కూడా గుర్తుకురావు. మతిమరుపు కారణంగా మాట్లాడేటప్పుడు ఉన్నట్టుండి సరైన పదాలు దొరక్క ఇబ్బంది పడుతుంటారు. ఒక పదానికి బదులు మరో పదం వాడుతుంటారు. దీంతో కలగాపులగంగా, ఏదేదో మాట్లాడేస్తుంటారు. ప్రాంతాలను, సమయాన్ని పోల్చుకోలేకపోవటం వల్ల ఏళ్ల తరబడి అదే ప్రాంతంలో ఉంటున్నప్పటికీ బయటకు వెళ్లినప్పుడు తిరిగి చేరుకోవటానికి ఇబ్బంది పడుతుంటారు. క్రమంగా కుటుంబ సభ్యులను, సన్నిహిత బంధువులను, స్నేహితులను గుర్తించలేనంతగా మతిమరుపు తీవ్రమవుతుంది. భార్యను చూసి మరెవరో అనుకోవచ్చు. చివరిదశలో తమను తామూ మరచిపోవచ్చు. అద్దంలో చూసుకొని ఎవరో కొత్తవారనీ అనుకోవచ్చు. టీవీ చూస్తున్నప్పుడు అందులోని పాత్రలు తమ పక్కనే నిలబడి మాట్లాడుతున్నారనీ భ్రమ పడొచ్చు. ఇవన్నీ జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోవటం వల్లనే.


నివారించుకోవచ్చా?

ల్జీమర్స్‌ వృద్ధాప్యంతో ముడిపడిన సమస్య. జన్యు స్వభావంతో కొందరికి త్వరగానూ రావచ్చు. వీటిని మనం మార్చలేం. కానీ జీవనశైలి మార్పులతో కొంతవరకు దీన్ని నివారించుకోవచ్చు.

* అధిక రక్తపోటు, మధుమేహం నియంత్రణలో లేనివారికి త్వరగా అల్జీమర్స్‌ వచ్చే అవకాశముంది. కాబట్టి రక్తపోటు, గ్లూకోజు నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే తలకు గాయాలు కాకుండా చూసుకోవాలి.

* పుస్తక పఠనం, రాయటం, బొమ్మలు గీయటం, ఆటలు ఆడటం, హాబీలు అలవరచుకోవటం వంటివి చేస్తుండాలి. పజిళ్లు పూరిస్తుండాలి. ఇలాంటివి మెదడును చురుకుగా ఉంచుతాయి. మరింత ఎక్కువగా ఆలోచించేలా చేస్తూ అల్జీమర్స్‌ దరిజేరకుండా కాపాడతాయి.

* కూరగాయలు, పండ్లు, గింజపప్పులు ఎక్కువగా తినాలి. కొవ్వులు, ఉప్పు తగ్గించాలి. మద్యం తాగకపోవటం మంచిది. ఒకవేళ అలవాటుంటే పరిమితం చేసుకోవాలి.

* బి12, బి6 వంటి విటమిన్ల లోపం తలెత్తకుండా చూసుకోవాలి.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం చాలా ముఖ్యం.

* నలుగురితో కలివిడిగా ఉండటం, వీలైనప్పుడల్లా బంధువులను, స్నేహితులను కలవటం మంచిది. స్వచ్ఛంద, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా మేలే.


ముందే గుర్తించొచ్చా?

ల్జీమర్స్‌ లక్షణాలు కలగా పులగంగా ఉంటాయి కాబట్టి ముందే గుర్తించటం కష్టం. అలాగని అసలే గుర్తించలేమని కాదు. మతిమరుపు, ప్రవర్తన మార్పుల ఆధారంగా కొంతవరకు పసిగట్టొచ్చు.

* వయసు మీద పడుతున్నకొద్దీ ఎంతోకొంత మతిమరుపు సహజమే. అయినా తేలికగా కొట్టేయటానికి లేదు. మామూలు మతిమరుపులో ఏదైనా క్లూ ఇస్తే ఆయా విషయాలు గుర్తుకొస్తాయి. అల్జీమర్స్‌లో అలా కాదు. పైగా మొత్తం సంఘటనలనూ మరచిపోతుంటారు. ఉదాహరణకు- ఏదో పెళ్లికి వెళ్లాం. ఓ నలుగురిని కలిశాం. రెండు మూడు రోజుల తర్వాత వారిలో ఒకరు తారసపడ్డారు. ఎక్కడ చూశామో చప్పున గుర్తుకు రాకపోవచ్చు. కానీ మొన్న పెళ్లిలో కలిశాం కదా అనగానే వెంటనే గుర్తుకొస్తుంది. కానీ అల్జీమర్స్‌లో అసలు పెళ్లికి వెళ్లిన విషయమే జ్ఞాపకముండదు.

* మాట్లాడుతున్నప్పుడు పదాల కోసం వెతుక్కోవటం, చదువుతున్నప్పుడు అందులోని విషయం అర్థం కాకపోవటం వంటివీ అల్జీమర్స్‌ సంకేతాలు కావొచ్చు. మాటిమాటికీ వస్తువులను వెతుక్కోవటం, తమ వస్తువులు ఎక్కడో పోయాయని అంటుండటం, అవతలి వాళ్ల మీద దొంగతనం ఆపాదించటం, కుటుంబ సభ్యుల మీద చాడీలు చెప్పటం, మాటిమాటికీ బీరువా తెరచి చూసుకోవటం, పెట్టిన వస్తువును మళ్లీ మళ్లీ వెతుక్కోవటం, వంట చేస్తున్నప్పుడు ఏమేం దినుసులు వేయాలో గుర్తుకురాకపోవటం, గ్యాస్‌ కట్టేయకపోవటం, ఇంటికి తెలిసినవారు వచ్చినా ఎవరని అడగటం, ఏమాత్రం గుర్తుపట్టలేకపోవటం వంటివీ హెచ్చరికలే.

- ఇలాంటి మార్పులను గమనిస్తే వెంటనే అనుమానించాలి. ముఖ్యంగా ఇవి రోజువారీ వ్యవహారాలకు ఇబ్బందిగా పరిణమిస్తుంటే జాగ్రత్త పడాలి. నాడీ నిపుణులనో, మానసిక నిపుణులతో సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. కొన్ని జ్ఞాపకశక్తి, మానసిక పరీక్షల ద్వారా దీన్ని తొలిదశలో పట్టుకోవచ్చు. మెదడు ఐఆర్‌ఐ, స్కాన్‌ కూడా అవసరపడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని