Updated : 07 Dec 2021 03:46 IST

తల్లి కడుపులో ఉన్నప్పుడే..

గుండెజబ్బు ముప్పు కారకాలు అనగానే ఊబకాయం, పొగ అలవాటు, వ్యాయామం చేయకపోవటం వంటి జీవనశైలి అంశాలే గుర్తుకొస్తాయి. ఇవే కాదు జీవిత తొలిదశలో.. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే గుండెజబ్బులకు బీజం పడుతున్నట్టు అధ్యయనాలు గట్టిగా చెబుతున్నాయి. పిండం సరిగా ఎదగకపోవటం, తక్కువ బరువుతో పుట్టటం వంటివీ ఇందుకు కారణమవుతున్నట్టు జపాన్‌ పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొంటోంది. తల్లిలో అధిక రక్తపోటు ముప్పుతో ముడిపడిన జన్యువులు ఉండటం దీనికి కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గర్భధారణ సమయంలో తల్లికి అధిక రక్తపోటు తలెత్తకపోయినా వీటి విపరీత పరిణామాలు కనిపిస్తుండటం గమనార్హం. ఈ జన్యువులు రక్తనాళ వ్యవస్థ అభివృద్ధి చెందటంలో, పనితీరులో పాలు పంచుకుంటాయి. మాయలో రక్తనాళాలు అధికం. దీని బరువు పుట్టిన పిల్లల బరువుతోనూ ముడిపడి ఉంటుంది. అందుకే పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. తల్లిలో అధిక రక్తపోటు జన్యువులకు, పిండం సరిగా ఎదగకపోవటానికి సంబంధం ఉంటున్నట్టు గుర్తించారు. తక్కువ బరువుతో పుట్టేవారికి పెద్దయ్యాక చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా, మంచి కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండే అవకాశముంది. ట్రైగ్లిజరైడ్లూ ఎక్కువేనని గత అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ గుండెజబ్బుల ముప్పు పెంచేవే. తక్కువ బరువుతో పుట్టేవారిలో పెద్దయ్యాక తెల్ల రక్తకణాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టూ మరో అధ్యయనం పేర్కొంటోంది. ఇది వాపు ప్రక్రియకు సంకేతం. గుండెజబ్బులో వాపు ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts