జీర్ణలయ!

గుండె ‘లబ్‌ డబ్‌’  అంటూ లయబద్ధంగా కొట్టుకోవటం తెలిసిందే. మరి మన జీర్ణాశయమూ ఇలాగే లయబద్ధంగా కదులుతుందంటే నమ్ముతారా? ఇది దెబ్బతినటం మూలంగానే కొన్ని జీర్ణ సమస్యలు పుట్టుకొస్తున్నాయని, దీన్ని సరిచేస్తే జబ్బులూ

Updated : 21 Dec 2021 06:04 IST

గుండె ‘లబ్‌ డబ్‌’  అంటూ లయబద్ధంగా కొట్టుకోవటం తెలిసిందే. మరి మన జీర్ణాశయమూ ఇలాగే లయబద్ధంగా కదులుతుందంటే నమ్ముతారా? ఇది దెబ్బతినటం మూలంగానే కొన్ని జీర్ణ సమస్యలు పుట్టుకొస్తున్నాయని, దీన్ని సరిచేస్తే జబ్బులూ తగ్గే అవకాశముందని యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్‌లాండ్‌ పరిశోధకులు నిరూపించారు.

న జీర్ణాశయం అద్భుతమైన అవయవం. తిన్న ఆహారాన్ని పోషకాలుగా, శక్తిగా మలుస్తుంది. ఇలా శరీరం సక్రమంగా, ఆరోగ్యంగా పనిచేయటానికి తోడ్పడుతుంది. చూడటానికి జీర్ణాశయం ఒక సంచిలా కనిపిస్తుంది గానీ దీనిలోని భాగాలు, వీటి పనితీరు పరిశోధకులకు ఇప్పటికీ పెద్ద రహస్యంగానే మిగిలిపోయాయి. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలోకి ప్రవేశించగానే పోషకాలను వెలికి తీస్తూనే దాన్ని తీయటానికి పేగుల్లోకి నెట్టటానికి వివిధ రకాల జీవ ప్రక్రియలు మొదలవుతాయి. జీర్ణాశయ కండరం మూడు పొరలుగా ఉంటుంది. ఇవి లయబద్ధంగా సంకోచించటం వల్లనే ఆహారం ముందుకు కదులుతుంది. అయితే ఈ కండరాలు ఒక సమన్వయంతో ఎలా సంకోచిస్తాయి? ఇది దెబ్బతింటే ఏమవుతుంది? సరిచేసే మార్గమేదైనా ఉందా? యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్‌లాండ్‌ పరిశోధకులు వీటి మీదే నిశితంగా దృష్టి సారించారు. జీర్ణాశయ కండరాల కదలికలను దీనిలోని జీవవిద్యుత్తు ప్రక్రియ నియంత్రిస్తుంటుంది. బలహీనమైనదే అయినా ఇది కూడా గుండె లయను నియంత్రించే వ్యవస్థ మాదిరిగానే పనిచేస్తుంది. మరి గుండె లయను కొలిచినట్టుగా జీర్ణాశయ కండరాల్లోని జీవ విద్యుత్తును కొలవగలిగితే? జీర్ణాశయానికి సంబంధించిన జబ్బుల తీరుతెన్నులను తెలుసుకునే అవకాశం లేకపోలేదు.

కొత్త ఆశా కిరణం

రోజురోజుకీ మన జీవనశైలి మారిపోతోంది. శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీంతో అజీర్ణం, ముద్ద ముందుకు కదలకపోవటం వంటి జీర్ణ సమస్యలూ పెరిగిపోతున్నాయి. వీటితో సతమతమవుతూ డాక్టర్ల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారు ఎందరో. దురదృష్టమేంటంటే- కొన్నిసార్లు ఎన్ని చికిత్సలు తీసుకున్నా సమస్యలు తగ్గకపోవటం. అప్పుడు జీర్ణాశయంలోకి గొట్టాన్ని పంపించి చేసే ఎండోస్కోపీ పరీక్ష చేయాల్సి వస్తుంది. అయినా కూడా సుమారు సగం మందిలో ఎలాంటి సమస్యా బయటపడదు. ఇది అటు డాక్టర్లను, ఇటు రోగులను నిరాశ నిస్పృహలకు గురిచేస్తుంది. సింటిగ్రటీ, ఎంఆర్‌ఐ వంటి అధునాతన పరీక్షలు అందుబాటులో ఉన్నాయి గానీ వీటికి ఎక్కువ ఖర్చవుతుంది. మరి జీర్ణాశయ సమస్యలను కచ్చితంగా గుర్తించటానికి తేలికైన, చవకైన మంచి మార్గమేదైనా ఉందా? ఇక్కడే జీర్ణాశయ సంకోచాలను నియంత్రించే జీవవిద్యుత్తు తీరుతెన్నులను గుర్తించే పద్ధతి ఆశా కిరణంగా కనిపిస్తోంది.

జీర్ణాశయ పేస్‌మేకర్లు

మన జీర్ణాశయ కండరాల్లో కదలికలను ప్రేరేపించే ‘పేస్‌మేకర్‌’ కణాలుంటాయి. వీటినే ‘ఇంటర్‌స్టీషియల్‌ సెల్స్‌ ఆఫ్‌ కాజల్‌’ అంటారు. ఇవి ఒక లయబద్ధంగా జీవవిద్యుత్తు తరంగాలను సృష్టిస్తూ.. కండరాలు ఎప్పుడు, ఎలా కదలాలనే దాన్ని నియంత్రిస్తుంటాయి. మరోవైపు మెదడు నుంచి అందే నాడీ సంకేతాలు సైతం కండర సంకోచాలకు తోడ్పడతాయి. జబ్బుల మూలంగా పేస్‌మేకర్‌ కణాలు, నాడీ కణాలు దెబ్బతింటాయన్న సంగతి తెలిసిందే. దీంతో జీవవిద్యుత్తు లయ అస్తవ్యస్తమై, జీర్ణాశయం పనితీరు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల జీర్ణాశయ కండరాల్లో అస్తవ్యస్తమైన జీవవిద్యుత్తు లయ ఆధారంగా సమస్యలను గుర్తించటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. కాకపోతే గుండె నుంచి పుట్టుకొచ్చే సంకేతాలతో పోలిస్తే ఇది 10 రెట్లు బలహీనంగా ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తించటం అంత తేలికైన పని కాదు. దీన్ని సుసాధ్యం చేయటానికే యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్‌లాండ్‌ పరిశోధకులు పారదర్శకమైన, మృదువైన పాలిమర్‌ సెన్సర్లను సృష్టించారు. ఇవి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు నేరుగా జీర్ణాశయం నుంచి జీవవిద్యుత్తు ప్రక్రియ విధానాన్ని నమోదు చేసుకుంటాయి. దీని ద్వారా పుట్టుకొచ్చే ప్రత్యేకమైన సంకేతాలను కూడా పరిశోధకులు గుర్తించారు. వీటిని కోత అవసరం లేకుండా కడుపు మీది నుంచే నమోదయ్యే సమాచారంతో పోల్చి చూశారు. దీని ఆధారంగా ప్రత్యేకమైన ఒక పరికరాన్నీ రూపొందించారు. ఇది జీర్ణాశయంలోని జీవవిద్యుత్తును హైరిజల్యూషన్‌లో నమోదు చేస్తుంది. దీంతో సమస్య బయటపడుతుంది.


చికిత్స మాటేంటి?

సమస్యను గుర్తిస్తారు సరే. మరి చికిత్స సంగతేంటి? పరిశోధకుల అంతిమ లక్ష్యం కూడా ఇదే. నాడుల పనితీరును మార్చటం ద్వారా జీర్ణాశయ జీవవిద్యుత్తు లయనూ సరిచేయొచ్చని నిరూపించటం విశేషం. మెదడు నుంచి జీర్ణాశయంలోని పేస్‌మేకర్‌ కణాలకూ, కండరాలకూ అందే సంకేతాలను స్వల్ప విద్యుత్‌ ప్రచోదనంతో నియంత్రించటం ఇందులోని కీలకాంశం. దీంతో జీర్ణాశయ సామర్థ్యమూ మెరగవుతుంది. ఇది జీర్ణాశయ సమస్యలతో మాటిమాటికీ డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండా చూడటానికి, రోజువారీ జీవితాన్ని హాయిగా గడపడటానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని