ఆరోగ్యం మనదే

కొవిడ్‌-19 ఎన్నో పాఠాలు నేర్పించింది. వైరస్‌ బారిన పడకుండా చూసుకోవటం దగ్గర్నుంచి.. ఇన్‌ఫెక్షన్‌ను సమర్థంగా ఎదుర్కోవటం వరకూ ఎన్నెన్నో విషయాలు నేర్పించింది. రోగనిరోధకశక్తిని బలోపేతం చేసుకునే మార్గాల ప్రాధాన్యాన్నీ నొక్కి చెప్పింది.

Updated : 28 Dec 2021 05:20 IST

కొవిడ్‌-19 ఎన్నో పాఠాలు నేర్పించింది. వైరస్‌ బారిన పడకుండా చూసుకోవటం దగ్గర్నుంచి.. ఇన్‌ఫెక్షన్‌ను సమర్థంగా ఎదుర్కోవటం వరకూ ఎన్నెన్నో విషయాలు నేర్పించింది. రోగనిరోధకశక్తిని బలోపేతం చేసుకునే మార్గాల ప్రాధాన్యాన్నీ నొక్కి చెప్పింది. నిజానికివి మనకు తెలియనివి కావు. ఎప్పట్నుంచో ఉన్నవే. వాటన్నింటినీ కరోనా జబ్బు మరోసారి గుర్తుచేసింది. వీటి అవసరం ఇప్పటితో తీరేది కాదు. ఇవి ఒక్క కొవిడ్‌కే పరిమితమయ్యేవీ కావు. నిత్య జీవితంలో భాగం చేసుకోవటం తప్పనిసరి. ఈ  సరళ సూత్రాలతో ఇన్‌ఫెక్షన్లను చాలావరకు నివారించుకోవచ్చు. కొత్త సంవత్సరంలో పండంటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.


టీకాలు వేయించుకోవాలి

ప్రతి సంవత్సరం ఫ్లూ వైరస్‌ మారుతోంది. గత టీకాలను తట్టుకునే శక్తిని సంతరించుకుంటోంది. దీనికి తోడు ఇప్పుడు కరోనా వైరస్‌ కూడా తోడైంది. దీని పరిణామాలను చవి చూస్తూనే ఉన్నాం. ఫ్లూ టీకాతో పాటు కొవిడ్‌ టీకా(బూస్టర్‌ టీకా)నూ ఎంత ఎక్కువ మంది తీసుకుంటే అంత ఎక్కువగా సామూహిక రోగనిరోధక శక్తి లభిస్తుంది. జబ్బుల బారినపడటం తగ్గుతుంది.


తాకే వస్తువులన్నీ తరచూ శుభ్రం చేయాలి

తలుపు గొళ్లాలు, పిడులు, నల్లాలు, వాషింగ్‌ మెషిన్లు, ఫోన్లు, ట్యాబ్లెట్లు, కీబోర్డులు, లైటు స్విచ్చులు, రిమోట్‌ కంట్రోళ్లు, పిల్లల ఆటబొమ్మలు.. ఇలాంటివన్నీ బ్యాక్టీరియా నిలయాలే. కాబట్టి వీటిని తరచూ శుభ్రం చేయాలి. దీంతో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా, ఇతరులకు వ్యాపించకుండా చూసుకోవచ్చు. ఇది జలుబు, అతిసారం, వాంతులు, కొవిడ్‌ వంటి ఎన్నెన్నో జబ్బుల  నివారణకు ఎంతగానో తోడ్పడుతుంది.


చక్కెర వీలైనంత తక్కువగా

మద్యం మాదిరిగానే చక్కెర సైతం తెల్ల రక్తకణాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి చక్కెర విషయంలో జాగ్రత్త అవసరం. ఆడవాళ్లు రోజుకు 6 చెంచాలు, మగవారు 9 చెంచాల కన్నా మించకుండా చూసుకోవాలి. ఒక మామూలు కూల్‌డ్రింకులో 10 చెంచాల చక్కెర ఉంటుందని తెలుసుకోవాలి.


ప్రొబయోటిక్స్‌ తగినంత

మన రోగనిరోధక వ్యవస్థ చాలావరకు పేగుల్లోనే ఉంటుంది.  పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా హానికర సూక్ష్మక్రిముల వృద్ధిని అరికడుతుంది. బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది. విటమిన్లను సృష్టిస్తుంది. శరీరం మందులను శోషించు కోవటానికి తోడ్పడుతుంది. కాబట్టి పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పదార్థాల వంటి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే (ప్రొబయోటిక్స్‌) పదార్థాలు తగినంత తీసుకోవాలి.


మద్యం అనర్థ దాయకం

మద్యం అతిగా తాగితే తెల్ల రక్తకణాల సామర్థ్యం తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది. మద్యంతో ఒంట్లో నీటిశాతమూ తగ్గుతుంది. నిద్రకు సైతం భంగం కలుగుతుంది. ఇవీ రోగనిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేసేవే. కాబట్టి మద్యం జోలికి వెళ్లకపోవటం మంచిది. ఒకవేళ అలవాటుంటే మితి మీరకుండా చూసుకోవాలి.


గోళ్లు కొరకటం మానెయ్యాలి

రోజంతా చేతులు ఎక్కడెక్కడ తాకారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అక్కడ బ్యాక్టీరియా, వైరస్‌లు ఉన్నట్టయితే చేతులకు అంటుకుంటాయి కదా. ఆ చేతులను కడుక్కోకుండా నోట్లో పెట్టుకున్నా, కళ్లను తాకినా లేదా గోళ్లు కొరికినా కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్టే. నోరు, ముక్కు, కళ్ల ద్వారా హానికర సూక్ష్మక్రిములు ఒంట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల సబ్బుతో శుభ్రం చేసుకోకుండా చేతులను ముఖానికి తాకనీయరాదు. గోళ్లు కొరికే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.


విటమిన్‌ డి లభించేలా

మనదేశంలో ఏడాది పొడవునా ఎండ కాసినా చాలామందికి విటమిన్‌ డి లోపం ఉంటుంది. మన చర్మం ముదురు రంగులో ఉండటం వల్ల ఎండ తాకినా అంతగా విటమిన్‌ డి తయారుకాదు. ఇది లోపిస్తే ఎముక పుష్టి తగ్గుతుంది. గుండెజబ్బులూ తలెత్తొచ్చు. ముఖ్యంగా రోగనిరోధకశక్తీ బలహీనపడుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. వీటి నుంచి కోలుకోవటమూ ఆలస్యమవుతుంది. అందువల్ల రోజూ చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవటంతో పాటు పుట్ట గొడుగులు, గుడ్డులోని పచ్చసొన, చేపల వంటివి తినటం మేలు. అవసరమైతే విటమిన్‌ డి మాత్రలూ వేసుకోవాలి.


నలతగా ఉంటే ఇంట్లోనే

జలుబు, ఫ్లూ, కొవిడ్‌ వంటి ఇన్‌ఫెక్షన్లకు దారితీసే వైరస్‌లు గాలి ద్వారా వ్యాపిస్తాయి. ఇతరులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలో కలుస్తాయి. వీటిని శ్వాస ద్వారా పీల్చుకున్నప్పుడు ఇతరులకు వ్యాపిస్తాయి. కాబట్టి ఒంట్లో నలతగా అనిపించినప్పుడు ఇంట్లోనే ఉండాలి. ముక్కుకు, నోటికి మాస్కు ధరించాలి. ఇది మనకే కాదు, చుట్టుపక్కల వారికీ మంచిదే. అలాగే ఇంట్లోకి గాలి ధారాళంగా వచ్చి, పోయేలా చూసుకోవాలి.


విటమిన్‌ సి, జింక్‌ మాత్రలు

విటమిన్‌ సి ఇన్‌ఫెక్షన్ల ముప్పు తగ్గిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి లోనైనవారిలో దీని ప్రభావం ఎక్కువ. విటమిన్‌ సి నిమ్మ, ఉసిరి, నారింజ, జామ పండ్ల వంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ పుంజుకోవటంలో జింక్‌ పాత్ర కూడా ఎక్కువే.  రోజుకు 80 నుంచి 207 మి.గ్రా. జింక్‌ తీసుకున్న వారిలో జలుబుతో బాధపడే రోజులు 33% వరకు తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసం, చేపలు, గింజపప్పుల వంటి వాటితో జింక్‌ లభిస్తుంది.


పీచు సైతం

ఆహారంలోని పీచు పదార్థం అనగానే జీర్ణశక్తిని నియంత్రించటం, మలబద్ధకాన్ని నివారించటమే గుర్తుకొస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థనూ బలోపేతం చేస్తున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది.  ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇలా పీచును పొట్టి గొలుసు కొవ్వు ఆమ్లాలుగా మారుస్తాయి. ఇలాంటి ఆమ్లాలు రోగనిరోధక కణాల పనితీరును ప్రేరేపిస్తాయి. కాబట్టి పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాలు, పప్పులు విధిగా తినాలి.


క్రమం తప్పకుండా వ్యాయామం

వ్యాయామం, శ్రమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచటమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఒంట్లో కణస్థాయిలో తలెత్తే వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) అదుపులో ఉంటుంది. దీర్ఘకాల జబ్బులు దరిజేరవు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సాహం ఇనుమడిస్తుంది. జబ్బులతో పోరాడే తెల్ల రక్తకణాల ప్రసరణ పుంజుకుంటుంది. మరీ కష్టమైనవే అవసరం లేదు. నడక, పరుగు, ఈత, సైకిల్‌ తొక్కటం వంటి ఒక మాదిరి వ్యాయామాలైనా గణనీయమైన ప్రభావం చూపుతాయి.


కంటి నిండా నిద్ర

కంటి నిండా నిద్రపోవటం చాలా ముఖ్యం. ఇది రోగనిరోధకశక్తి సక్రమంగా పనిచేయటానికీ దోహదం చేస్తుంది. రెండు వారాల పాటు రాత్రిపూట కనీసం 8 గంటల సేపు నిద్రపోయినవారిలో వైరస్‌ను ఎదుర్కొనే శక్తి అధికంగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అదే 7 గంటలు, అంతకన్నా తక్కువసేపు నిద్రించిన వారిలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. దీనికి కారణం కంటి నిండా నిద్రపోయినప్పుడు శరీరం సైటోకైన్లను విడుదల  చేయటం. ఇవి ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి శరీరానికి సహకరిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని