కీమోకు బదులుగా..

క్యాన్సర్‌ బారినపడ్డవారు కీమోథెరపీ, రేడియేషన్‌ థెరపీ తీసుకోవటం తరచూ చూసేదే. ఇవి క్యాన్సర్‌ కణాలను చంపేస్తాయి గానీ కొన్ని దుష్ప్రభావాలు పొడసూపుతాయి. నిస్సత్తువ, వికారం, జుట్టు ఊడటం, బరువు తగ్గటం, నొప్పి, విరేచనాలు,

Updated : 04 Jan 2022 03:03 IST

క్యాన్సర్‌ బారినపడ్డవారు కీమోథెరపీ, రేడియేషన్‌ థెరపీ తీసుకోవటం తరచూ చూసేదే. ఇవి క్యాన్సర్‌ కణాలను చంపేస్తాయి గానీ కొన్ని దుష్ప్రభావాలు పొడసూపుతాయి. నిస్సత్తువ, వికారం, జుట్టు ఊడటం, బరువు తగ్గటం, నొప్పి, విరేచనాలు, జీర్ణకోశ సమస్యలు, రోగనిరోధకశక్తి తగ్గటంతో పాటు నోట్లో, గొంతులో పుండ్లు పడుతుంటాయి. రేడియో థెరపీ క్యాన్సర్‌ కణాలనే కాదు, ఆరోగ్యంగా ఉన్న చుట్టుపక్కల కణాలనూ చంపేస్తుంది. ఇలాంటి దుష్ప్రభావాలను నివారించే దిశగా అమెరికాలోని క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌, మనదేశానికి చెందిన అలహాబాద్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్న చికిత్సను రూపొందించారు. జన్యువుకు సంబంధించిన నాన్‌కోడింగ్‌ డీఎన్‌ఏ పోచను (యాంటీ-సెన్స్‌) శరీరంలో ప్రవేశపెట్టటం ద్వారా ఎంఐఆర్‌-21ను నిర్యీర్యం చేయటం ఇందులోని కీలకాంశం. క్షీరదాల కణాల్లో పెద్దమొత్తంలో ఉండే మైక్రోఆర్‌ఎన్‌ఏల్లో ఎంఐఆర్‌-21 ఒకటి. ఇది కణాలు తమకుతాముగా చనిపోవటం, క్యాన్సర్‌ కారక ప్రభావాలను నియంత్రిస్తుంటుంది. దీన్ని ఎలుకల్లో ప్రవేశపెట్టగా కణితులు క్రమంగా కుంచించుకుపోవటం గమనార్హం. కొన్ని కణితులు పూర్తిగా అదృశ్యమయ్యాయి కూడా. అందుకే ఇప్పుడు దీన్ని మనుషులపై పరీక్షించాలని భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే కీమో, రేడియో థెరపీల అవసరముండదని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని