చేవ లేదా? చేతకాదా?

ఆత్రుతగా ఎదురు చూసిన రాత్రి రానే వచ్చింది. ఆనందం, ఉద్విగ్నంతో ఉక్కిరి బిక్కిరవుతున్న మనసుతో అతడు ఆమె మీద చేయి వేశాడు. కానీ... ఉన్నట్టుండి గుండె దడ పెరిగింది. మదిలో ఏదో అలజడి. ఒళ్లంతా చెమటలు.

Updated : 18 Jan 2022 06:51 IST

సామర్థ్య ఆందోళన

ఆత్రుతగా ఎదురు చూసిన రాత్రి రానే వచ్చింది. ఆనందం, ఉద్విగ్నంతో ఉక్కిరి బిక్కిరవుతున్న మనసుతో అతడు ఆమె మీద చేయి వేశాడు. కానీ... ఉన్నట్టుండి గుండె దడ పెరిగింది. మదిలో ఏదో అలజడి. ఒళ్లంతా చెమటలు. దూరం జరిగాడు. ఏవేవో ఆలోచనలు. మనసులో కోరికైతే ఉంది. శరీరమే సహకరించడంలేదు. ఎంత ప్రయత్నించినా అంగం స్తంభించదేం? తనపై తనకే అనుమానం. తొలి రాత్రి అంతేనేమో! అప్పటికి స్థిమితపడ్డా రెండో రోజూ, మూడో రోజూ అంతే. పెళ్లయిన కొత్తలో చాలామంది యువకులు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. శారీరకంగా అంతా బాగానే ఉన్నా మానసిక ఆందోళనతో తలెత్తే శృంగార వైఫల్యం ఇది.  ఒక్క మగవారిలోనే కాదు, ఆడవారిలోనూ కనిపిస్తుంటుంది. మగవారిలో 9-25%, ఆడవారిలో 6-16% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. నిజానికిదేమీ పెద్ద సమస్య కాదు. తేలికగానే బయటపడొచ్చు. కావాల్సిందల్లా సానకూలంగా ఆలోచించటం. అర్థం చేసుకోవటం. సమస్యపై అవగాహన కలిగుండటం.

మొదటిసారి ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు ఎలా ఉంటుంది? లేదూ తొలిసారి స్టేజీ ఎక్కి మాట్లాడుతున్నప్పుడో, అందరి ముందు డ్యాన్స్‌ చేస్తున్నప్పుడో ఎలా అనిపిస్తుంది? మనసులో ఏదో తెలియని భయం. ఆందోళనతో చెమటలు పట్టేస్తుంటాయి. నోటిలోంచి ఒక్క మాట కూడా రాదు. తొలిసారి శృంగారంలో పాల్గొనేటప్పుడూ కొందరు ఇలాంటి అవస్థనే ఎదుర్కొంటుంటారు. దీన్నే సామర్థ్య ఆందోళన (పర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ) అంటారు. దీని విషయంలో మగవారినే నిందించడానికి లేదు. ఒకోసారి దంపతులిద్దరిలోనూ ఉండొచ్చు. అయితే సమస్య గురించి అవగాహన లేకపోవటం వల్ల ఎంతోమంది అపోహలు, అపార్థాలతో రోజురోజుకీ మనస్పర్ధలు పెంచుకుంటుంటారు. గొడవలు పడి నలుగురిలో నిందించుకుంటుంటారు. కొందరు పెళ్లయిన కొద్దిరోజులకే విడిపోతుంటారు కూడా. జీవితాంతం కలిసి సాగించాల్సిన ప్రయాణాన్ని ప్రారంభించకుండానే ముగించేస్తుంటారు. సామర్థ్య ఆందోళన శాశ్వత సమస్య కాదని, తాత్కాలికమైనదేనని తెలియకపోవటమే దీనికి కారణం. ఒకరినొకరు అర్థం చేసుకుంటే దీన్నుంచి త్వరగానే బయటపడొచ్చు. దీనికిప్పుడు మంచి చికిత్సలు, కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉన్నాయి.

కారణాలేంటి?

సామర్థ్య ఆందోళనకు రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైంది శృంగారంలో పాల్గొనటానికి ముందు నుంచే భాగస్వామిని సంతృప్తి పరచగలనా? లేదా? అని సందేహిస్తుండటం. కొందరు ఇలా చేయాలి? అలా చేయాలి? అని ముందే ఊహించుకుంటుంటారు కూడా. తీరా శృంగారంలో పాల్గొన్నాక అలా చేస్తానో, లేదోనని మథన పడిపోతుంటారు. మరికొందరు అంగం చాలా చిన్నగా ఉందనో, బరువు ఎక్కువగా ఉందనో తటపటాయిస్తుంటారు. భాగస్వామి ఏమనుకుంటుందో, ఇలా ఉంటే శృంగారం బాగా చేస్తానో, లేదోనని ముందే ఊహించుకుంటుంటారు. ఇలాంటి బిడియాలు, భయాలతో అంగం స్తంభించక ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు శృంగారంలో పాల్గొనకముందే వీర్య స్ఖలనం కావొచ్చు. ఇదీ అనుమానాలకు తావిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్య భావన, లైంగికంగా కలవాలనే కోరిక లేకపోవటం, అయిష్టంగా శృంగారంలో పాల్గొనటం వంటివీ సమస్యకు దారితీస్తాయి. ఉద్యోగం లేదా ఇతర పనుల్లో ఒత్తిడి, ఆందోళనలు, కుటుంబంలో కలహాలు, ఆర్ధిక సమస్యలతో మానసికంగా ఇబ్బంది పడటంతోనూ సామర్థ్య ఆందోళన తలెత్తొచ్చు. శృంగారంపై అవగాహన లేకపోవడం.. అపోహలు, భయాలూ కారణం కావొచ్చు. తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం, తనకు శృంగారం చేతకాదేమోనని అనుకోవటం, భాగస్వామికి జీవితంలో న్యాయం చేయలేనేమోనని ఊహించుకోవటమూ సామర్థ్యాన్ని దెబ్బతీయొచ్చు. ఒకరినొకరు తరచూ దూషించుకోవటం, కించపరచుకోవటం, గొడవలు పడటమూ ఇబ్బందులు కలిగిస్తాయి. కొందరికి గత శృంగార అనుభవాలూ అడ్డు తగులుతుంటాయి. ‘అప్పుడలా చేశాను, ఇప్పుడెలా చేస్తానో’నని ఆందోళన చెందుతుంటారు. స్నేహితులు చెప్పిన విషయాలను పట్టుకొని, తానూ అలా చేయగలనా అని సందేహిస్తుంటారు. కొందరు రోజులో ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనటాన్నే మగతనంగా భావిస్తుంటారు. ఒక్కసారికే అలసిపోతున్నాననీ దిగులు పడుతుంటారు. కొందరు అశ్లీల చిత్రాలు ఎక్కువగా చూడటం, ఇది వ్యసనంగా మారటం.. అశ్లీల చిత్రాల్లో కనిపించినట్టుగానే శృంగారం చేయాలని అనుకోవటంతోనూ ఆందోళనకు గురవ్వచ్చు. పదే పదే హస్త ప్రయోగం చేసుకునే అలవాటుంటే, దీంతో భాగస్వామికి ఏమైనా అవుతుందేమోనని భయపడటం.. హస్త ప్రయోగంతో నరాలు బలహీనపడి ఉంటాయని, అందువల్ల శృంగారం జరపటం తమతో కాదని భయపడటం కూడా కారణాలే.

శరీర మార్పులతోనూ..

సామర్థ్య ఆందోళనతో శరీరంలోనూ మార్పులు తలెత్తుతుంటాయి. భయాందోళనలకు గురైనప్పుడు తలెత్తే చెమట, గుండె దడ, కాళ్ళు చేతులు లాగుతున్నట్టు అనిపించడం, నిస్సత్తువ, వణుకు, కంగారు వంటి లక్షణాలే ఇందులోనూ కనిపిస్తాయి.

* శృంగారంపై ఆసక్తి, అంగ స్తంభనలో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ పాత్ర కీలకం. ఆందోళన మూలంగా విడుదలయ్యే కార్టిజోల్‌ హార్మోన్‌ టెస్టోస్టీరాన్‌ పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా సామర్థ్య ఆందోళన మరింత ఎక్కువవుతుంది.  

* అంగం సరిగా స్తంభించకపోవటం వల్ల మానసికంగా ఒత్తిడి మరింత పెరుగుతుంది.ఆ క్షణం నుంచే కుంగుబాటూ మొదలవుతుంది.

* కొందరికి శరీరం బలాన్ని కోల్పోయినట్టు అనిపించొచ్చు. శృంగారంలో పాల్గొనాలని ఉన్నా మనసు భారంగా అనిపించొచ్చు. ఇలాంటి ఆలోచనలు శరీరాన్ని శృంగారం జరపటానికి ప్రేరేపించవు. శృంగార సామర్థ్యం కుంటుపడుతుంది.

చికిత్స ఏంటి?

సామర్థ్య ఆందోళనకు రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మందులు వాడుకోవాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్‌: శృంగారంపై అవగాహన కలిగించి, అపోహలు తొలగించటం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో ఆయా వ్యక్తుల స్థాయిని బట్టి మంచి మాటలు చెప్పటానికి ప్రయత్నిస్తారు. దీంతో ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. కుటుంబ వ్యవస్థపై గౌరవం పెరుగుతుంది. దంపతుల మధ్య అర్థం చేసుకునే గుణం మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ: ప్రతికూల ఆలోచల నుంచి బయటపడేలా చేస్తుంది. సానుకూలంగా, వాస్తవికంగా ఆలోచించటం అలవడుతుంది. ఇలా మనసును సమస్య నుంచి పరిష్కారం దిశగా ఆలోచించేలా చేస్తుంది.

టాక్‌ థెరపీ: మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. మాట్లాడటమంటే వాదించడం కాదు. తమ జీవనశైలి, దాంపత్య అనుభవాల గురించి మాట్లాడుకోవటం. ఇది దంపతులకు ఏకాంతం కల్పిస్తూ.. ఒకరికొకరు మరింత అర్ధమయ్యేలా, ఏకాభిప్రాయం కుదిరేలా చేస్తుంది.

సెన్సేట్‌ ఫోకస్‌: సాన్నిహిత్యం, అనుబంధం పెరిగేలా దంపతులిద్దరితో జంటగా కొన్ని వ్యాయామాలు చేయిస్తారు. ఇది శరీర స్పర్శ ద్వారా అనుబంధం బలపడేలా చేస్తుంది. శృంగారాన్ని ప్రేరేపించడానికే కాదు, ఒకరికొకరం తోడున్నామనే ధైర్యాన్నీ కలిగిస్తుంది. ఆందోళన తొలగటానికి ఉపయోగపడుతుంది.

ఆందోళన నియంత్రణ: ఆందోళనను నియంత్రించుకునే తీరును నేర్పిస్తారు. దీంతో ఆందోళన మూలంగా ఏమేం కోల్పోతున్నారు, దీన్నుంచి బయటపడమెలాగో అర్థమవుతుంది. సమస్య పరిష్కారానికి బాటలు వేస్తుంది.

గైడెన్స్‌ ఇమేజరీ: దైనందిన జీవితంలో దంపతులు మసలుకునే తీరును, సంఘటనలను తిరిగి సృష్టిస్తారు. ఇవి సాన్నిహిత్యం పెరిగేలా చేస్తాయి.

ధ్యానం, ప్రాణాయామం: మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి. ఆందోళన, భయం తగ్గుతాయి. ఒత్తిడి మాయామయిపోతుంది.

మందులు: సామర్థ్య ఆందోళన తగ్గటానికి కొన్నిసార్లు మందులు అవసరమవ్వచ్చు. సమస్య తీవ్రతను బట్టి ఇవి ఎవరికి అవసరమనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇవి శృంగారంపై ఆసక్తిని పెంచి, దాంపత్య మాధుర్యాన్ని ఆస్వాదించటానికి తోడ్పడతాయి.

నిందిస్తే లాభం లేదు

సామర్థ్య ఆందోళనతో బాధపడుతున్నవారికి వాస్తవాన్ని తెలుసుకునే అవకాశం కల్పించాలి. ‘‘నువ్వు మగాడివి కాదు. శృంగార సామర్ధ్యం లేదు. దేనికీ పనికి రావు. నువ్వు మోసగాడివి. మా అమ్మాయి జీవితం పాడైపోయింది’’ అని నిందిస్తే లాభం లేదు. ఇలాంటి మాటలు పదే పదే గుర్తుకొచ్చి సమస్య మరింత తీవ్రమవుతుంది. శృంగారం పట్ల మొదట్లో ఆందోళన పడుతున్నా, అవగాహన పెరుగుతున్నకొద్దీ క్రమేణా తగ్గిపోవచ్చు. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి. చికిత్స, కౌన్సెలింగ్‌తో సమస్య నయమవుతుందని గుర్తించాలి.


బయటపడటమెలా?

సామర్థ్య ఆందోళన జబ్బు కాదు. సాధారణ సమస్యే. దీనికి భయపడాల్సిన అవసరం లేదు.కొన్ని జాగ్రత్తలతో దీన్ని అధిగమించొచ్చు.

* అన్నిసార్లూ ఒకేలా శృంగారం చేయాలని అనుకోవటం తగదు. ‘నా వల్ల కావట్లేదు’ అని అనుకోవద్దు. ప్రశాంతంగా అప్పటి పరిస్థితిని అంగీకరించాలి.

* శృంగారం మీదే ధ్యాస పెట్టాలి. ఆ సమయంలో ఇతర పనులు, వ్యాపకాలు గురించి ఆలోచించొద్దు.

* దాంపత్యం అంటే శృంగారం ఒక్కటే కాదు. అదే లక్ష్యంగా పెట్టుకోవద్దు. జీవితం చాలా విస్తృతమైంది. దాంపత్య జీవితంలో శృంగారం ఒక భాగమేనని తెలుసుకోవాలి.

* ఎప్పుడూ తమను తాము తక్కువగా అంచనా వేసుకోవద్దు. తక్కువ చేసుకొని మాట్లాడొద్దు. ‘నేనింతే, నా జీవితం ఇంతే, నా వల్ల కాదు’ అని నిరుత్సాహ పరచుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.

* అందాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. బాధను కలిగించే మాటలను మనసు వరకు రానీయొద్దు. భాగస్వామితో సాన్నిహిత్యాన్ని మరింత అందంగా మలచుకోవాలి.

* ఒత్తిళ్లను పడక గది బయటే వదిలేయాలి. విశ్రాంతిని పొందటానికి సమయం కేటాయించుకోవాలి.

* శృంగారం విషయంలో భాగస్వామితో సమన్వయం అవసరం. సమయానుకూలంగా దీని గురించి మాట్లాడుకోవాలి. ఒకరి భావాలను మరొకరు అర్ధం చేసుకోవటానికి, సానుకూల అవగాహన పెంచుకోవటానికి ప్రయత్నించాలి. భాగస్వామితో సున్నితంగా వ్యవహరించాలి.

* మద్యం, మాదక ద్రవ్యాలతో శృంగార సామర్థ్యం పెరుగుతుందని అనుకోవటం అపోహ. వీటిని తీసుకోనప్పుడే శృంగార మాధుర్యాన్ని అనుభవిస్తారనే సంగతిని తెలుసుకోవాలి.

* అశ్లీల చిత్రాలు అతిగా చూడొద్దు. లేనిపోని భంగిమలకు ప్రయత్నించి, కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు.

* శృంగారంపై అనవసర మాటలు వినొద్దు. ఎవరి అనుభవాలు వారివి. ఏదైనా సందేహం వస్తే డాక్టర్లను, నిపుణులను కలిసి నివృత్తి చేసుకోవాలి. జీవనశైలిని మెరుగు పరచుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని