గురకతో త్వరగా వృద్ధాప్యం!

గురక పెట్టేవారిలో కొందరికి గొంతు వెనకాల భాగం వదులై శ్వాసమార్గానికి అడ్డుపడుతుంది. దీంతో నిద్రలో శ్వాస ఆగిపోతుంటుంది (స్లీప్‌ అప్నియా). అప్పుడు మెదడుకు అందే సంకేతాలు తిరిగి శ్వాస తీసుకునేలా ప్రేరేపిస్తాయి. దీంతో కాసేపయ్యాక పెద్దగా గురక పెడుతూ మళ్లీ శ్వాస తీసుకుంటారు.

Updated : 19 Oct 2022 16:07 IST

గురక పెట్టేవారిలో కొందరికి గొంతు వెనకాల భాగం వదులై శ్వాసమార్గానికి అడ్డుపడుతుంది. దీంతో నిద్రలో శ్వాస ఆగిపోతుంటుంది (స్లీప్‌ అప్నియా). అప్పుడు మెదడుకు అందే సంకేతాలు తిరిగి శ్వాస తీసుకునేలా ప్రేరేపిస్తాయి. దీంతో కాసేపయ్యాక పెద్దగా గురక పెడుతూ మళ్లీ శ్వాస తీసుకుంటారు. నిద్రలో ఈ విషయం మనకు తెలియదు. కానీ రాత్రంతా తరచూ నిద్రకు భంగం కలుగుతూనే ఉంటుంది. గాఢ నిద్ర పట్టదు. ఫలితంగా పగటిపూట నిద్రమత్తు, ఏకాగ్రత తగ్గటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇవే కాదు, దీంతో త్వరగా వృద్ధాప్యమూ ముంచుకొచ్చే ప్రమాదముందని యూనివర్సిటీ ఆఫ్‌ మిసౌరీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది. గురకతో సతమతమయ్యేవారిలో జననకాలంతో ముడిపడిన వయసు కన్నా శారీరక వయసు త్వరగా మీద పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. తరచూ మెలకువ రావటం, రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గటం దీనికి కారణమని భావిస్తున్నారు. అయితే శ్వాస ఆగకుండా చూసే సీప్యాప్‌ (కంటిన్యూయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెషర్‌) చికిత్సను క్రమం తప్పకుండా తీసుకుంటే శారీరక వృద్ధాప్యాన్ని వెనక్కి మళ్లించే అవకాశముండటం గమనార్హం. కాబట్టి గురకే కదా అని నిర్లక్ష్యం చేయకుండా, తగు చికిత్స తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని