గుండెపోటుతో కుంగిపోవద్దు!

గుండెపోటు బారినపడి కోలుకున్నారా? అయితే కాస్త మనో నిబ్బరంతో ఉండండి. ఏదో అయిపోయిందనే బాధతో కుంగిపోవద్దు. గుండెపోటు వచ్చిన తర్వాత కుంగుబాటు(డిప్రెషన్‌)తో బాధపడేవారికి పక్షవాతం ముప్పు సుమారు 50%

Updated : 12 Apr 2022 00:37 IST

గుండెపోటు బారినపడి కోలుకున్నారా? అయితే కాస్త మనో నిబ్బరంతో ఉండండి. ఏదో అయిపోయిందనే బాధతో కుంగిపోవద్దు. గుండెపోటు వచ్చిన తర్వాత కుంగుబాటు(డిప్రెషన్‌)తో బాధపడేవారికి పక్షవాతం ముప్పు సుమారు 50% అధికంగా ఉంటున్నట్టు అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ వార్షిక సదస్సులో సమర్పించిన అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. దాదాపు 5 లక్షల మంది ఆరోగ్య వివరాలను పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు. గుండెపోటు అనంతరం ఆరోగ్యంగా ఉన్నవారిలో, పక్షవాతం వచ్చినవారిలో కుంగుబాటు ఒక్కటే పెద్ద తేడాగా కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని.. దీని ప్రభావాలను మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు. కుంగుబాటుతో బాధపడేవారు డాక్టర్లను సమయానికి సంప్రదించక పోవటం, వేళకు మందులు వేసుకోకపోవటం వంటివి పక్షవాతం తలెత్తటానికి దోహదం చేస్తుండొచ్చని అనుమానిస్తున్నారు. కాబట్టి గుండెపోటు బారినపడ్డ వారిలో కుంగుబాటును గుర్తిస్తే ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. కుంగుబాటుకు చికిత్స తీసుకుంటే ఎంతో మేలు చేస్తుందని సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని