పీసీఓఎస్‌ గలవారికి ఏఎంహెచ్‌ చిక్కులు

అండాశయాల్లో నీటితిత్తులు (పీసీఓఎస్‌) గలవారిలో యాంటీ-ములేరియన్‌ హార్మోన్‌ (ఏఎంహెచ్‌) మోతాదులు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఇది మామూలేనని, దీనికి పెద్దగా ప్రాధాన్యం లేదని ఇప్పటివరకూ

Published : 24 May 2022 00:36 IST

అండాశయాల్లో నీటితిత్తులు (పీసీఓఎస్‌) గలవారిలో యాంటీ-ములేరియన్‌ హార్మోన్‌ (ఏఎంహెచ్‌) మోతాదులు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఇది మామూలేనని, దీనికి పెద్దగా ప్రాధాన్యం లేదని ఇప్పటివరకూ భావిస్తూ వస్తున్నారు. కానీ పీసీఓఎస్‌లో ఏఎంహెచ్‌ కీలక పాత్రే పోషిస్తున్నట్టు.. ఫలదీకరణ, గర్భధారణలో సమస్యలు సృష్టిస్తున్నట్టు వీల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ పరిశోధకులు గుర్తించారు. అండాశయంలో ద్రవంతో కూడిన తిత్తుల వంటి భాగాలు (ఫాలికల్స్‌) ఉంటాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న అండానికి దన్నుగా నిలుస్తాయి. ఫాలికల్‌ ఎదుగుతున్నకొద్దీ దానిలోని అండం పెరుగుతూ వస్తుంటుంది. అండం ఫలదీకరణ సామర్థ్యం సంతరించుకున్నాక బయటకు పంపిస్తుంది. పీసీఓఎస్‌ గల వారిలో చిన్న చిన్న ఫాలికల్స్‌ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి చివరిదశకు చేరుకోవటంలో విఫలం అవుతుంటాయి. ఫాలికల్స్‌ ఎక్కువగా ఉండటంతో ఏఎంహెచ్‌ ఉత్పత్తీ అధికంగానే ఉంటుంది. ఇదే సమస్యలు సృష్టిస్తోంది. ఈ హార్మోన్‌ మోతాదులు ఎక్కువవటం వల్ల ఫాలికల్‌, దాని లోపలున్న అండం ఎదుగుదల మధ్య సమన్వయం కొరవడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అండం పూర్తిగా ఎదగక ముందే ఫాలికల్‌ పరిపక్వం అవుతున్నట్టు గుర్తించారు. ఇది గర్భధారణకు ప్రతికూలంగా పరిణమిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. పీసీఓఎస్‌లో గడ్డాలు, మీసాలు మొలవటం వంటి ఇతరత్రా లక్షణాలూ కనిపిస్తుంటాయి. వీటిల్లోనూ అధిక ఏఎంహెచ్‌ ఎంతో కొంత పాలు పంచుకొని ఉంటుండొచ్చని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని