మింగుడు పడదు!

పొద్దున కాఫీ, టీ తాగకపోతే ఏమీ తోచదు. టిఫిన్‌ తిన్నాకే ప్రాణం కుదుట పడుతుంది. తృప్తిగా భోజనం చేస్తే గానీ ఆత్మారాముడు సంతోషించడు. పండ్లు తినకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది. జిహ్వ చాపల్యం చల్లారాలంటే చాక్లెట్లు, మిఠాయిలు, కారప్పూస, బజ్జీల వంటి చిరుతిళ్లు కాస్త లాగించాల్సిందే.

Updated : 28 Jun 2022 06:43 IST

పొద్దున కాఫీ, టీ తాగకపోతే ఏమీ తోచదు. టిఫిన్‌ తిన్నాకే ప్రాణం కుదుట పడుతుంది. తృప్తిగా భోజనం చేస్తే గానీ ఆత్మారాముడు సంతోషించడు. పండ్లు తినకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది. జిహ్వ చాపల్యం చల్లారాలంటే చాక్లెట్లు, మిఠాయిలు, కారప్పూస, బజ్జీల వంటి చిరుతిళ్లు కాస్త లాగించాల్సిందే. స్నేహితులు, బంధువులు కలిశారంటే పానీయాలు సేవించాల్సిందే. లేచింది మొదలు పడుకునే వరకు నోటి నుంచి పొట్టలోకి ఇలా ఎన్నెన్నో పదార్థాలు పంపిస్తుంటాం. ఇలా శరీరాన్ని పోషించుకోవటమే కాదు, మానసిక తృప్తినీ పొందుతుంటాం. మరి మనం తినేవి, తాగేవి మింగుడు పడకపోతే? తింటున్నప్పుడు ముద్ద గొంతులోకి దిగకపోతే? మింగుతుంటే నొప్పి కలుగుతుంటే? అసలు తినటమే సమస్యగా మారిపోతుంది.

దేన్నయినా చిటికెలో గుటుక్కుమనిపిస్తుంటాం గానీ నిజానికి మింగటమనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. మెదడు, బోలెడన్ని నాడులు, కండరాలు, రెండు కండర కవాటాలు, అన్నవాహిక వంటివన్నీ ఇందులో పాలు పంచుకుంటాయి. మింగటమనేది ఒకే పనిగా కనిపించినా ఇది మూడు దశల్లో సాగుతుంది. ముందు మనం తినే ఆహారాన్ని నోరు మింగటానికి వీలుగా ముద్దగా మారుస్తుంది. ద్రవాలను పట్టి ఉంచుతుంది. ఆ తర్వాత మెదడు వీటిని మింగాలనే నిర్ణయం తీసుకుంటుంది. నోటి నుంచి మెదడుకు, మెదడు నుంచి నోటికి సందేశాలు అందించటంలో బోలెడన్ని నాడులు తోడ్పడతాయి. మెదడు నిర్ణయం తీసుకున్నాక ముద్ద గొంతులోకి చేరుకుంటుంది. కొండనాలుక నుంచి స్వరపేటిక వరకు ఉండే భాగాన్ని (ఓరోఫారింక్స్‌) నాలుక మూసేస్తుంది. అదే సమయంలో ముద్ద శ్వాసమార్గంలోకి వెళ్లకుండా ఎపిగ్లాటిస్‌ అనే మృదులాస్థి పొర శ్వాసనాళాన్ని మూసేస్తుంది. అప్పుడు అన్నవాహిక పై కండర వలయం (స్ఫింక్టర్‌) తెరచుకుంటుంది. ఇదంతా చాలా త్వరగా.. అర సెకండులోనే జరిగిపోతుంది. అనంతరం ముద్ద అన్నవాహికలోకి వెళ్తుంది. సుమారు 9 అంగుళాల పొడవుతో, ఒక గొట్టంలా ఉండే ఇది సంకోచించటం (పెరిస్టాల్‌సిస్‌) మూలంగానే ముద్ద కిందికి దిగుతుంది. అన్నవాహిక సంకోచించినప్పుడు దీని చివర ఉండే కండర వలయం తెరచుకుంటుంది. అప్పుడు ముద్ద జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది. ముద్దలోని ద్రవ పదార్థం గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో దానంతటదే జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. ఏదైనా ద్రవ పదార్థం మిగిలిపోతే అన్నవాహిక సంకోచించటం వల్ల కిందికి దిగుతుంది. ఈ ప్రక్రియలో పాలు పంచుకునే భాగాల్లో ఎక్కడ సమస్య తలెత్తినా మింగటం కష్టమవుతుంది. దీన్నే డిస్‌ఫేజియా అంటారు. కొందరికి మింగుతున్నప్పుడు నొప్పీ రావచ్చు (ఆడినోఫేజియా).
రెండు రకాలు
మింగటంలో ఇబ్బంది రెండు రకాలుగా ఉండొచ్చు. కొందరికి ఆరంభంలోనే.. అంటే గొంతు దగ్గరే ఇబ్బంది ఉండొచ్చు (ఆరోఫారింజియల్‌ డిస్‌ఫేజియా). కొందరికి గొంతులో లేదా ఛాతీలో ఆహారం చిక్కుకున్నట్టు అనిపించొచ్చు (ఈసోఫేగల్‌ డిస్‌ఫేజియా). ఘన పదార్థాలే కాదు, ద్రవాలు మింగటమూ సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. మొదట్లో చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ క్రమంగా ఆహారం తీసుకోవటం తగ్గుతుంది. దీంతో పోషణలోపం తలెత్తుతుంది. కొందరికి ఆహారం, ద్రవాలు మింగుతున్నప్పుడు పొరపోయి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకీ చేరుకోవచ్చు. ఇది న్యుమోనియాకు దారితీయొచ్చు. సకాలంలో చికిత్స అందక, సమస్య తీవ్రమైతే దీంతో ప్రాణాపాయమూ సంభవించొచ్చు.
కారణాలు రకరకాలు
ఆహారం లోపలికి వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి ఏర్పడితే ఘన పదార్థాలు మింగటం కష్టమవుతుంది. ద్రవాలు లేదా ద్రవాలతో కూడిన ఘన పదార్థాలు మింగటంలో ఇబ్బందికి చాలావరకు నాడీ జబ్బులు కారణమవుతుంటాయి. డిస్‌ఫేజియాకు రకరకాల సమస్యలు దోహదం చేస్తుంటాయి.
* పొర ఏర్పడటం: కొందరికి అన్నవాహికలోని కణజాలం పలుచటి (2-3 మి.మీ.) పొరలా ఏర్పడొచ్చు. దీన్ని ఈసోఫేగల్‌ వెబ్‌ అంటారు. ఇది అన్నవాహికలో ఎక్కడైనా పుట్టుకురావొచ్చు. అయితే చాలావరకు  పై భాగంలోనే ఏర్పడుతుంది. లోపలి మార్గాన్ని అడ్డుకొని మింగటంలో ఇబ్బందులు సృష్టిస్తుంది. రక్తహీనత గలవారిలో ఇది ఎక్కువ.
ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌: కొందరికి అన్నవాహికలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు (ఈసోఫేగల్‌ క్యాండిడియాసిస్‌). మధుమేహం గలవారికి, స్టిరాయిడ్‌ మందులు తీసుకునేవారికి, స్టిరాయిడ్‌ ఇన్‌హేలర్లు వాడే ఆస్థమా బాధితుల్లో దీని తరచూ చూస్తుంటాం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే హెచ్‌ఐవీ బాధితుల్లోనూ ఇది ఎక్కువే.
మార్గం సన్నగిల్లటం: కొందరు పొరపాటునో, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలోనో మరుగుదొడ్లు శుభ్రం చేయటానికి వాడే ద్రవాల వంటివి తాగుతుంటారు. వీటిల్లోని కాస్టిక్‌ అన్నవాహిక పొరను దెబ్బతీసి, లోపలి మార్గం సన్నబడేలా చేస్తుంది. దీన్నే కాస్టిక్‌ స్ట్రిక్చర్‌ అంటారు. ఇది గొంతు దగ్గర్నుంచి అన్నవాహిక వరకు ఎక్కడైనా ఏర్పడొచ్చు. దీంతో మింగటం కష్టమైపోతుంది. కొందరికి జీర్ణాశయంలోని ఆమ్లం పైకి ఎగదన్నుకొని రావటం (జీఈఆర్‌డీ) మూలంగానూ అన్నవాహిక దెబ్బతినొచ్చు. దీంతో లోపల మచ్చలాంటిది ఏర్పడి, అన్నవాహిక మార్గం సన్నబడొచ్చు (పెప్టిక్‌ ఈసోఫేగల్‌ స్టిక్చర్‌). క్యాన్సర్‌ బాధితుల్లో రేడియేషన్‌ చికిత్స అనంతరమూ అన్నవాహిక మార్గం సన్నబడొచ్చు.
* అకలేషియా కార్డియా: దీనికి మూలం అన్నవాహికలోని కండరాలు సరిగా తెరచుకోకపోవటం. ఇందులో నాడులు సరిగా పనిచేయకపోవటం వల్ల అన్నవాహక, జీర్ణాశయం కలిసే చోట ఉండే కండర వలయం సరిగా తెరచుకోదు. గురుత్వాకర్షణ బలంతో ద్రవాలు కాస్త కిందికి దిగినా ముద్ద జారకుండా అలాగే ఉండిపోతుంది. అకలేషియా కార్డియా ఎందుకు వస్తుందనేది కచ్చితంగా తెలియదు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, రోగనిరోధక వ్యవస్థ పొరపాటున అన్నవాహిక మీదే దాడి చేయటం, జన్యువుల వంటివి కారణం కావొచ్చు.
* క్యాన్సర్లు: నోరు, గొంతు, నాలుక, అన్నవాహికలో క్యాన్సర్ల మూలంగానూ మింగటం కష్టమవుతుంది. కణితులు లోపలి మార్గానికి అడ్డుపడి ఇబ్బందులు సృష్టిస్తాయి.
* నాడీ సమస్యలు: మింగటానికి తోడ్పడే కండరాలు, నాడులను దెబ్బతీసే ఎలాంటి సమస్యలైనా డిస్‌ఫేజియాకు దారితీయొచ్చు. పార్కిన్సన్స్‌ డిసీజ్‌ వంటి నాడీ సమస్యలు, పక్షవాతం.. మెదడు, నాడులను దెబ్బతీసే మోటార్‌ న్యూరాన్‌ డిసీజ్‌ వంటివి మింగటంలో ఇబ్బందులు తెచ్చిపెడతాయి. పక్షవాతం, తలకు దెబ్బలు తగలటం వంటివి మింగటానికి సాయం చేసే కండరాల సమన్వయాన్ని దెబ్బతీస్తాయి. నోరు, గొంతులో స్పర్శజ్ఞానాన్ని తగ్గిస్తాయి. ఇదీ మింగటంలో కష్టం కలిగించేదే.


చిన్న జాగ్రత్తలు పెద్ద మేలు

* మింగటంలో ఇబ్బంది పడేవారు తినేటప్పుడు, తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మేలు చేస్తుంది.
* తక్కువగా, నెమ్మదిగా తినాలి. చిన్న ముద్ద పెట్టుకోవాలి. ఆహారం ద్రవంగా మారేంత వరకు నమిలాకే మింగాలి. తినేటప్పుడు, తాగేటప్పుడు వాటి మీదే దృష్టి పెట్టాలి.
* కొందరికి తలను పక్కకు తిప్పి లేదా నేరుగా చూస్తూ తినటం ఉపయోగపడుతుంది.

నోట్లో కొద్దిగా ఆహారం లేదా ద్రవం తీసుకొని, చుబుకాన్ని ఛాతీకి ఆనించి మింగటం ద్వారా గొంతులో అడ్డుపడకుండా చూసుకోవచ్చు.
నమలటానికి కష్టంగా ఉండే పదార్థాలు తగ్గించుకోవాలి. పూర్తిగా మానేసినా మంచిదే. పలుచటి ద్రవాలు తాగలేనివారు సూప్‌, కాఫీల వంటివి తీసుకోవచ్చు. కొందరికి వేడి లేదా చల్లటి పదార్థాలు, పానీయాలు తీసుకోకపోవటం మేలు చేస్తుంది.


నిర్ధరణ ఎలా?

డిస్‌ఫేజియా నిర్ధరణలో లక్షణాలు ముఖ్యం. సమస్య ఎప్పట్నుంచి ఉంది? ఎలా మొదలైంది? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అనేవి పరిశీలిస్తారు. నోరు, గొంతు లోపల ఎలా ఉందనేది చూస్తారు. సమస్యను అనుమానిస్తే పరీక్షలు చేసి నిర్ధరిస్తారు.
* బేరియం ఎక్స్‌రే: ఇది బేరియం ద్రవాన్ని తాగించి తీసే ఎక్స్‌రే. ఇందులో అన్నవాహిక లోపలి భాగం స్పష్టంగా కనిపిస్తుంది. కండరాల పనితీరు తెలుస్తుంది. అడ్డంకులేవైనా ఉంటే బయట పడతాయి. వీడియో చిత్రీకరించే ఎక్స్‌రే యంత్రం సాయంతో బేరియం ద్రవం నోటి నుంచి జీర్ణాశయంలోకి ఎలా వెళ్తుందనేది ప్రత్యక్షంగా చూడొచ్చు కూడా. ఇది అన్నవాహికలో పొర, మార్గం సన్నబడటం, అకలేషియా కార్డియా నిర్ధరణకు ఉపయోగపడుతుంది.
* గ్యాస్ట్రోస్కోపీ: ఇందులో కెమెరాతో కూడిన సన్నటి గొట్టాన్ని గొంతులోంచి లోపలికి పంపించి పరీక్షిస్తారు. మార్గం సన్నబడటం, వాపు, కణితుల వంటివి ఉంటే బయటపడతాయి. అవసరమైతే బయాప్సీ కోసం చిన్నముక్కను కూడా తీస్తారు.
* మానోమెట్రీ: ఇది అన్నవాహిక కండరంలో పీడనాన్ని కొలిచే పరీక్ష. ఇందులో సన్నటి గొట్టం ద్వారా పీడనాన్ని గుర్తిస్తారు. ఇతర పరీక్షల్లో స్పష్టమైన కారణమేదీ తేలనప్పుడు దీన్ని చేస్తారు. ముఖ్యంగా అకలేషియా కార్డియాకు ఎలాంటి చికిత్స అవసరమనేది నిర్ణయించటానికిది బాగా తోడ్పడుతుంది.
* సీటీ/ఎంఆర్‌ఐ: క్యాన్సర్ల నిర్ధరణకు, తీవ్రతను తెలుసుకోవటానికి, చికిత్సలను నిర్ణయించటానికి స్కాన్‌ పరీక్షలు చేస్తారు. క్యాన్సర్‌ ఇతర భాగాలకు విస్తరించినా వీటితో తెలుస్తుంది. నాడులతో తలెత్తిన డిస్‌ఫేజియాకు కారణాలను గుర్తించటానికీ ఉపయోగపడతాయి.

సమస్యను బట్టి చికిత్స

కొందరికి చికిత్స తీసుకోకపోయినా డిస్‌ఫేజియా దానంతటదే నయం కావొచ్చు. బాగా ఇబ్బంది పడేవారికి చికిత్స అవసరమవుతుంది. మామూలు కారణాలతో తలెత్తే సమస్య తేలికగానే తగ్గుతుంది. సంక్లిష్టమైన సమస్యకు ప్రత్యేక చికిత్స చేయాల్సి ఉంటుంది.
మందులు: ఆమ్లం మూలంగా అన్నవాహిక మార్గం సన్నబడి, మింగటంలో ఇబ్బంది ఎదురవుతుంటే ఛాతీలో మంటను తగ్గించే ఒమిప్రోజోల్‌ రకం మందులు మేలు చేస్తాయి. మార్గాన్ని వెడల్పు చేసే చికిత్స తీసుకున్నాక సమస్య మళ్లీ తిరగబెట్టకుండానూ చూస్తాయి. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌కు యాంటీ ఫంగల్‌ మందులతో మంచి ఉపశమనం కలుగుతుంది. అకలేషియా కార్డియా, నాడులు దెబ్బతినటం వల్ల సరిగా మింగలేనివారికి అన్నవాహిక కదలికలను మెరుగు పరచే డోమ్‌పెరిడోన్‌ వంటి మందులు కొంతవరకు ఉపయోగపడతాయి.
ఎండోస్కోపిక్‌ డైలేషన్‌: కండర వలయం బిగుతుగా ఉన్నా, మచ్చ మూలంగా మార్గం సన్నబడినా అన్నవాహికను వెడల్పు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎండోస్కోప్‌ ద్వారా ప్రత్యేకమైన బెలూన్‌ను లేదా మృదువైన డైలేటర్‌ను లోనికి పంపించి సమస్య ఉన్నచోట నెమ్మదిగా ఉబ్బిస్తారు. దీంతో మార్గం వెడల్పు అవుతుంది. రేడియేషన్‌ చికిత్స అనంతరం మార్గం సన్నబడినవారికి తరచూ ఇలా వెడల్పు చేయాల్సిన అవసరముంటుంది.
చిన్న కోత చికిత్సలు: అకలేషియా కార్డియా గలవారికి చిన్నకోతతో చేసే శస్త్రచికిత్సలు ఉపయోగపడతాయి. పెరోరల్‌ ఎండోస్కోపిక్‌ మయాటమీ (పోయెమ్‌) పద్ధతిలో అన్నవాహిక గోడకు చిన్న కోత పెట్టి, లోపల్నుంచే కిందికి వెళ్తారు. అక్కడి కండర వలయం వద్ద కండర పోచలను కత్తిరిస్తారు. దీంతో కండర వలయం బిగువు సడలి, ముద్ద తేలికగా కిందికి దిగుతుంది. హెల్లర్స్‌ ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలోనూ అన్నవాహిక దిగువ కండరాలను కత్తిరించొచ్చు.
శస్త్రచికిత్స: క్యాన్సర్‌ కణితులు మింగటానికి ఇబ్బంది కలిగిస్తుంటే శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది. కాస్టిక్‌తో లోపలి పొర దెబ్బతినటం వల్ల ఏర్పడిన స్ట్రిక్చర్లకూ శస్త్రచికిత్స అవసరపడొచ్చు.
రేడియోథెరపీ, కీమోథెరపీ: క్యాన్సర్లతో తలెత్తే డిస్‌ఫేజియా గలవారిలో చాలామందికి రేడియోథెరపీ, కీమోథెరపీ సమర్థంగా పనిచేస్తాయి. అయితే రేడియేషన్‌ ప్రభావంతో లోపలి మార్గం సన్నబడొచ్చు. ఇది తరచూ మింగటంలో ఇబ్బంది కలగజేయొచ్చు.

చికిత్సలు పనిచేయకపోతే?
చికిత్సలకు లొంగని క్యాన్సర్లు, నాడులు దెబ్బతినటం వల్ల కొన్నిసార్లు నోటితో ఆహారం, ద్రవాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పర్‌క్యుటేనియస్‌ ఎండోస్కోపిక్‌ గ్యాస్ట్రాస్టమీ పద్ధతిలో కడుపు మీద చిన్న కోత పెట్టి గొట్టాన్ని అమర్చాల్సి ఉంటుంది. దీంతో నేరుగా జీర్ణాశయంలోకి  ఆహారం, ద్రవాలు పంపించొచ్చు. కొందరికి లోహ  స్టెంటు అమర్చాల్సి రావొచ్చు. ఇది అన్నవాహికను తెరచుకునేలా  చేసి ఆహారం లోపలికి వెళ్లేలా చూస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని