Health: అతిగా ‘ఢీ’ కొడుతోంది!

ఎంత మంచిదైనా విటమిన్‌ డి అవసరమైనంతవరకే తీసుకోవాలి. మితిమీరితే అనర్థాలకు దారితీస్తుంది. అయితే విటమిన్‌ డిని అతిగా తీసుకోవటం (హైపర్‌విటమినోసిస్‌ డి), దుష్ప్రభావాలను కొని తెచ్చుకోవటం..

Updated : 13 Jul 2022 22:00 IST

ఎంత మంచిదైనా విటమిన్‌ డి అవసరమైనంతవరకే తీసుకోవాలి. మితిమీరితే అనర్థాలకు దారితీస్తుంది. అయితే విటమిన్‌ డిని అతిగా తీసుకోవటం (హైపర్‌విటమినోసిస్‌ డి), దుష్ప్రభావాలను కొని తెచ్చుకోవటం.. రెండింటికీ ఆస్కారముందని బీఎంజే కేస్‌ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన తాజా కథనం హెచ్చరిస్తోంది. తరచూ వాంతులు, వికారం, కడుపు నొప్పి, పిక్కలు పట్టేయటం, చెవిలో మోత, నోరు ఎండిపోవటం, దాహం ఎక్కువ కావటం, విరేచనాలు, బరువు తగ్గటం వంటి ఇబ్బందులతో బాధపడుతున్న మధ్య వయసు వ్యక్తికి చికిత్స చేసిన అనంతరం ఈ కేసు గురించి వివరించారు. ఆ వ్యక్తి చాలాకాలంగా దుకాణాల్లో అమ్మే రకరకాల విటమిన్‌ మాత్రలు వాడుతుండటం గమనార్హం. సాధారణంగా రోజుకు 400 ఐయూ మోతాదు విటమిన్‌ డి సరిపోతుంది. కానీ ఆయన 1,50,000 ఐయూ మోతాదులో తీసుకునేవారు. విటమిన్‌ కె, విటమిన్‌ సి, ఫోలేట్‌, రైబోఫ్లావిన్‌, విటమిన్‌ బి6, ఓమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి పోషకాలనూ పెద్దమొత్తంలో తీసుకుంటున్నారు కూడా. దుష్ప్రభావాలు మొదలయ్యాక వీటిని ఆపేసినా ఇబ్బందులు తగ్గలేదు. రక్త పరీక్ష చేయగా క్యాల్షియం, మెగ్నీషియం మోతాదులు చాలా ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది. విటమిన్‌ డి మోతాదులైతే ఏకంగా 7 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని బయటకు వెళ్లగొట్టటానికి ఆసుపత్రి డాక్టర్లు 8 రోజుల పాటు రక్తనాళం ద్వారా ద్రవాలు ఇచ్చారు. రక్తంలో క్యాల్షియం మోతాదులను తగ్గించే బిస్‌ఫాస్ఫోనేట్‌ రకం మందులూ ఇచ్చారు. రెండు నెలల తర్వాత క్యాల్షియం మోతాదులు మామూలు స్థితికి చేరుకున్నా విటమిన్‌ డి స్థాయులు మాత్రం అంతగా తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌విటమినోసిస్‌ డి ధోరణి పెరిగిపోతోందని.. మహిళలు, పిల్లలు, శస్త్రచికిత్స చేయించుకున్నవారు దీనికి ఎక్కువగా గురయ్యే అవకాశముంటోందని కేసు రిపోర్టు రచయితలు వివరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని