నాలుక మండుతోందేం?

మా ఆవిడ కారం అసలే తినలేకపోతోంది. నాలుకకు కొంచెం కారం తగిలినా భరించలేకపోతోంది. దీంతో రోజూ చప్పటి మెతుకులు తినాల్సి వస్తోంది. దీనికి పరిష్కారమేంటి?

Updated : 12 Jul 2022 11:40 IST

సమస్యసలహా
 

సమస్య: మా ఆవిడ కారం అసలే తినలేకపోతోంది. నాలుకకు కొంచెం కారం తగిలినా భరించలేకపోతోంది. దీంతో రోజూ చప్పటి మెతుకులు తినాల్సి వస్తోంది. దీనికి పరిష్కారమేంటి?

- కె. వెంకట మురార్జీ, విశాఖపట్నం

సలహా: నాలుక మంట తరచూ చూసేదే. స్వల్పంగా ఉంటే పెద్దగా ఇబ్బందేమీ పెట్టదు. దానంతటదే తగ్గుతుంది. కానీ మీరు సమస్య తీవ్రంగా ఉందని చెబుతున్నారు. దీనికి చికిత్స తీసుకోవటం తప్పనిసరి. నాలుక మంటకు రకరకాల సమస్యలు దోహదం చేస్తుంటాయి. నాలుక మీద రుచిమొగ్గలు, సన్నటి బుడిపెల (పాపిల్లే) వంటివి ఉంటాయి. వీటి మూలంగానే నాలుక కాస్త గరుకుగా ఉంటుంది. కొందరికి పాపిల్లే లేకపోవటం వల్ల నాలుక నున్నగా కనిపిస్తుంటుంది. అక్కడంతా లేత గులాబీ రంగులోకి మారుతుంది. దీనికి కారణం రైబోఫ్లేవిన్‌ వంటి బి విటమిన్లు, ఐరన్‌ లోపం. చాలామందిలో నాలుక మంటకు కారణం ఇదే. మహిళల్లో రుతుస్రావం ఎక్కువగా కావటం, పేగుల్లో కొంకి పురుగుల వంటివి ఐరన్‌ లోపానికి దారితీయొచ్చు. కొందరికి నాలుక పగిలిపోవటమూ మంటకు కారణం కావొచ్చు. మీ ఆవిడ ఏవైనా మందులు వాడుతున్నారో తెలియజేయలేదు. ఎందుకంటే కొన్నిరకాల మందులతో నోరు పొడిబారి, మంట పుట్టొచ్చు. నోట్లో ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌, జిగురుపొరల మీద రోగనిరోధక వ్యవస్థ దాడి చేయటం వల్ల తలెత్తే లైకెన్‌ ప్లేనస్‌ జబ్బుల్లోనూ మంట పుట్టొచ్చు. ఏవైనా ఆహార పదార్థాలు పడకపోయినా ఇబ్బంది కలగొచ్చు. మధుమేహం, థైరాయిడ్‌ వంటి సమస్యలూ కారణం కావొచ్చు. అరుదుగా క్యాండిడియాసిస్‌ వంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లలోనూ నాలుక మండొచ్చు. ఇందులో నాలుక మీద తెల్ల మచ్చలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలేవైనా ఉన్నాయేమో చూడటం ముఖ్యం. నాలుకను నిశితంగా పరిశీలిస్తే గానీ వీటిని గుర్తించలేం. కాబట్టి మీరు దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించండి. నాలుక తీరుతెన్నులను బట్టి సమస్యను గుర్తిస్తారు. కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు. విటమిన్లు, ఖనిజాల లోపం ఉన్నట్టయితే మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇతరత్రా సమస్యలకు తగు చికిత్సలు ఉపయోగపడతాయి. తాత్కాలికంగా ఉపశమనం కలగటానికి ట్రయామ్సినోలోన్‌ అసిటొనైడ్‌ పూత మందు ఉపయోగపడుతుంది. దీన్ని భోజనం చేయటానికి అరగంట ముందు గానీ తర్వాత గానీ నోట్లో రాసుకోవాలి. రోజుకు మూడు సార్ల చొప్పున ఒక వారం వాడుకుంటే నోట్లో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తగ్గుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు