ఉబ్బు ఉబ్బుకో కథ!

అదేపనిగా ఎక్కువసేపు నిల్చున్నప్పుడో, కూర్చున్నప్పుడో కాళ్లు ఉబ్బటం తెలిసిందే. గాయాలు తగిలిన చోట వాపు సహజమే. ఇవే కాదు.. శరీర భాగాలు ఉబ్బటానికి కొన్ని జబ్బులూ దోహదం చేయొచ్చు.

Updated : 12 Jul 2022 11:38 IST

అదేపనిగా ఎక్కువసేపు నిల్చున్నప్పుడో, కూర్చున్నప్పుడో కాళ్లు ఉబ్బటం తెలిసిందే. గాయాలు తగిలిన చోట వాపు సహజమే. ఇవే కాదు.. శరీర భాగాలు ఉబ్బటానికి కొన్ని జబ్బులూ దోహదం చేయొచ్చు.

న శరీరంలో సగానికి పైగా నీరే. ఇది చాలావరకు రక్తం రూపంలో ప్రవహిస్తుంటుంది. లింఫు ద్రవంలోనూ కొంత నీరుంటుంది. ఇది లింఫు నాళాల ద్వారా ప్రవహిస్తుంటుంది. శరీరంలోని ద్రవాలు ఎక్కడైనా పోగుపడితే అక్కడ ఉబ్బుతుంది. దీన్నే ఎడీమా అంటారు. కాళ్లు, పాదాలు, మడమలు, చేతులు, ముఖం.. ఇలా ఒంట్లో ఎక్కడైనా ఉబ్బు తలెత్తొచ్చు. ఒకే సమయంలో చాలా చోట్ల కూడా ఉబ్బొచ్చు. కొన్నిసార్లు ఇది తాత్కాలికంగానే ఉండొచ్చు. కడుపులోని శిశువు ఒత్తిడి మూలంగా గర్భిణుల్లో కాళ్లు, మడమలు వాయొచ్చు. ఎక్కువగా ఉప్పు తినటం వల్ల ఒంట్లోంచి నీరు సరిగా బయటకు వెళ్లకపోయినా పాదాలు ఉబ్బొచ్చు. అధిక రక్తపోటుకు వేసుకునే కొన్నిరకాల మందులూ దీనికి కారణం కావొచ్చు.

కారణాలు రకరకాలు

శరీర భాగాలు ఉబ్బినప్పుడు కదలటం ఇబ్బందికరంగా మారుతుంది. ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్చు. గాయాల వంటివి మానటమూ కష్టమవుతుంది. కాబట్టి ఉబ్బు ఎలాంటిదైనా తగు చికిత్స చేయించుకోవటం మంచిది. ఎందుకంటే ఇది ప్రమాదకర జబ్బులకూ సంకేతం కావొచ్చు.

గుండె వైఫల్యం: గుండె వైఫల్యం బారినపడ్డవారిలో గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది. దీంతో కాళ్లు, మడమలు, పాదాల్లో నీరు పోగుపడుతుంది. కడుపు కూడా ఉబ్బొచ్చు. కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లోనూ ద్రవం పోగుపడొచ్చు (పల్మనరీ ఎడీమా).

కాలేయ జబ్బు: కాలేయం గట్టిపడినప్పుడు (సిరోసిస్‌) దీనిలోంచి రక్తం సరిగా ప్రవహించదు. ఫలితంగా పేగులు, ప్లీహం నుంచి రక్తాన్ని తీసుకొచ్చే సిరలో ఒత్తిడి పెరుగుతుంది. ఇది కడుపు, కాళ్లు ఉబ్బేలా చేస్తుంది.

కిడ్నీ జబ్బు: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఒంట్లో ద్రవాలు, సోడియం మోతాదులు పెరుగుతాయి. ఇవి ఉబ్బునకు దారితీస్తాయి. సాధారణంగా కాళ్లు, కళ్ల చుట్టూ ఉబ్బుతుంటుంది. కిడ్నీల్లో రక్తాన్ని వడపోసే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటే రక్తంలో ప్రొటీన్‌ (అల్బుమిన్‌) తగ్గుతుంది. ఇది ద్రవం పోగుపడేలా చేసి, ఉబ్బునకు దారితీస్తుంది.

కాళ్లలో సిరలు దెబ్బతినటం: కాళ్ల నుంచి రక్తం పైకి చేరుకోవటానికి సిరల్లోని కవాటాలు తోడ్పడతాయి. ఇవి బలహీనమైతే రక్తం సరిగా పైకి రాదు. దీంతో కాళ్ల వాపులు మొదలవుతాయి. కొందరికి కాలి సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడటం (డీవీటీ) వల్ల ఉన్నట్టుండి ఒక కాలు ఉబ్బొచ్చు. వీరికి పిక్క కండరాల్లో నొప్పీ ఉంటుంది. దీనికి సత్వర చికిత్స అవసరం.

లింఫ్‌ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం: కణజాలాల్లోని అదనపు నీటిని లింఫ్‌ వ్యవస్థ బయటకు పంపిస్తుంటుంది. సర్జరీలు, తీవ్రమైన గాయాల వంటి వాటితో ఇది దెబ్బతింటే లింఫ్‌ గ్రంథులు, లింఫ్‌ నాళాలు సరిగా పనిచేయవు. ఫలితంగా వాపు తలెత్తుతుంది.

ప్రొటీన్‌ లోపం: దీర్ఘకాలంగా ఆహారం ద్వారా తగినంత ప్రొటీన్‌ తీసుకోకపోవటమూ ఒంట్లో ద్రవం పోగుపడటానికి దారితీయొచ్చు.

కారణాన్ని బట్టి చికిత్స

ఎడీమాకు ఆయా కారణాలను బట్టి చికిత్స చేస్తారు. మందులతో ఉబ్బు తలెత్తుతున్నట్టయితే వేరే మందులకు మారటం మంచిది. రక్తం గడ్డలు కారణమైతే రక్తాన్ని పలుచగా చేసే, గుండె వైఫల్యం గలవారికి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు ఉపయోగపడతాయి. కొందరికి ఆయా భాగాలను బిగుతుగా పట్టి ఉంచే సాక్సులు, గ్లవుజుల వంటివి మేలు చేస్తాయి. చికిత్సలకు లొంగని ఉబ్బు గలవారికీ ఇవి అసౌకర్యం కలగకుండా చూస్తాయి. హఠాత్తుగా ఒక కాలు లేదా రెండు కాళ్లలో వాపు కనిపించినా, కొద్దిగా ఉన్న ఉబ్బు క్రమంగా పెద్దగా అవుతున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత ఎక్కువ కాలం గుణం కనిపిస్తుంది.


లక్షణాలు

ఆయా భాగాల్లో.. ముఖ్యంగా కాళ్లు, చేతుల్లో చర్మం కింద కణజాలం వాయటం.

చర్మం సాగటం లేదా మెరిసినట్టు కనిపించటం.

కొద్ది సెకన్ల పాటు అలాగే నొక్కిపట్టి ఉంచితే గుంత పడటం.

కడుపు సైజు పెరగటం.


జాగ్రత్తలు తీసుకోవాలి

వదులుగా ఉండే దుస్తులు, షూ ధరించటం మంచిది. అయితే బిగుతుగా ఉండే సాక్సుల వంటివి ధరించాల్సిన వారికిది వర్తించదు.

కాళ్లలో ఉబ్బు గలవారు పడుకున్నప్పుడు, కూర్చునప్పుడు పాదాలు ఎత్తుగా పెట్టుకోవాలి. పాదాలు గుండె కన్నా ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి.

కదలికలతోనూ ఉబ్బు తగ్గే అవకాశముంది. కాబట్టి డాక్టర్ల సలహా మేరకు నెమ్మదిగా వ్యాయామం చేయాలి.

ఉప్పు ఒంట్లో ద్రవాలను పట్టి ఉంచుతుంది. కాబట్టి ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి.

ఎడీమాకు డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని