ఒత్తిడితో తల నెరుపా?

మానసిక ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి తెల్ల వెంట్రుకల్లో చాలావాటికి ఒత్తిడితో సంబంధమే లేదు. ఆ మాటకొస్తే జుట్టు అసలు మధ్యలో తెల్లబడటమనేదే ఉండదు! కుదుళ్ల నుంచి వెంట్రుక మొలిచినప్పుడే దాని రంగు నిర్ణయమై ఉంటుంది

Updated : 19 Jul 2022 10:48 IST

మానసిక ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి తెల్ల వెంట్రుకల్లో చాలావాటికి ఒత్తిడితో సంబంధమే లేదు. ఆ మాటకొస్తే జుట్టు అసలు మధ్యలో తెల్లబడటమనేదే ఉండదు! కుదుళ్ల నుంచి వెంట్రుక మొలిచినప్పుడే దాని రంగు నిర్ణయమై ఉంటుంది. అది నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, గోధుమరంగులో ఉండొచ్చు. ఈ రంగు మారదు. మరి జుట్టు ఎలా తెల్లబడుతుంది? వయసు మీద పడుతున్నకొద్దీ వెంట్రుకల కుదుళ్లు తక్కువ రంగును ఉత్పత్తి చేస్తాయి. దీంతో తెల్లగా మొలవటం మొదలవుతుంది. ఇందులో జన్యువుల పాత్రే కీలకం. ఒత్తిడితో వెంట్రుకల రంగు మారకపోవచ్చు గానీ మామూలు కన్నా మూడు రెట్లు ఎక్కువ వేగంగా ఊడిపోతుంటాయి. ఇవి తిరిగి మొలుస్తాయనుకోండి. మధ్యవయసులో ఇలా వెంట్రుకలు వేగంగా ఊడిపోయి, మొలుస్తున్నట్టయితే కొత్తగా వచ్చేవి తెల్లగా మొలిచే అవకాశమే ఎక్కువ. ఒత్తిడి మూలంగా ఎలుకల్లో జుట్టు తెల్లబడుతున్నట్టు గత అధ్యయనాలు చెబుతున్నప్పటికీ అది మనుషులకు వర్తిస్తుందా? లేదా? అన్నది స్పష్టంగా తెలియదు. తెల్ల జుట్టు గలవారిలో చాలావరకు అది వయసుతో పాటు వచ్చిన మార్పే అనుకోవచ్చు. అయితే కొన్నిసార్లు.. ముఖ్యంగా చిన్నవయసువారిలో తెల్ల జుట్టు వస్తే అది ఇతరత్రా జబ్బులకు సంకేతం కావొచ్చు. విటమిన్‌ బి12 లోపంతో జుట్టు నెరవచ్చు. వంశ పారంపర్యంగా సంక్రమించే న్యూరోఫైబ్రోమటోసిస్‌ జబ్బులో నాడుల వద్ద కణితులు ఏర్పడుతుంటాయి. ఎముకలు, చర్మం సరిగా వృద్ధి కావు. ఇది జుట్టు తెల్లబడేలా చేయొచ్చు. మెదడు, గుండె, కిడ్నీల వంటి అవయవాల్లో క్యాన్సర్‌ రహిత కణితులకు దారితీసే ట్యుబెరస్‌ స్క్లిరోసిస్‌తోనూ వెంట్రుకలు తెల్లబడొచ్చు. బొల్లి, పేను కొరుకుడు వంటివీ దీనికి కారణం కావొచ్చు. పేను కొరుకుడులో తల మీద అక్కడక్కడ కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోతుంటుంది. ముఖ్యంగా నల్ల వెంట్రుకలే ఊడిపోతుంటాయి. దీంతో తెల్ల వెంట్రుకలు స్పష్టంగా కనిపిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని