మంకీ మశూచి!

మనిషితో పాటు జబ్బులు. జబ్బులతో పాటు మనిషి!  ప్రస్తుతం మన పరిస్థితి ఇలాగే తయారైంది. కొవిడ్‌ పీడ పూర్తిగా  విరగడ కాకముందే కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి. కొత్త భయాలను సృష్టిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితమనుకున్నవి ఇతర దేశాల్లోకీ అడుగు పెడుతున్నాయి.

Updated : 26 Jul 2022 06:58 IST

మనిషితో పాటు జబ్బులు. జబ్బులతో పాటు మనిషి!  ప్రస్తుతం మన పరిస్థితి ఇలాగే తయారైంది. కొవిడ్‌ పీడ పూర్తిగా  విరగడ కాకముందే కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి. కొత్త భయాలను సృష్టిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితమనుకున్నవి ఇతర దేశాల్లోకీ అడుగు పెడుతున్నాయి. మశూచిని (స్మాల్‌పాక్స్‌) పోలిన మంకీపాక్స్‌ విజృంభణే దీనికి నిదర్శనం. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఇది రెండు నెలల క్రితం ఇతర దేశాలకు విస్తరించటం ఆరంభించింది. ఇప్పటికే 72 దేశాలను చుట్టేసింది. మన దగ్గరా కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ దీన్ని అత్యవసర ప్రజారోగ్య సమస్యగానూ గుర్తించింది. మన ప్రభుత్వమూ మంకీపాక్స్‌ను కట్టడి చేయటానికి మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర కథనం మీకోసం.

క్కడో ఆఫ్రికా దేశాల్లో పుట్టింది. అమెరికా, యూరప్‌లోకి అడుగు పెట్టింది. మనదాకా వస్తుందా ఏం? మొన్నటివరకు మంకీపాక్స్‌ గురించి ఇలాగే అనుకున్నాం. కానీ అంతర్జాతీయ ప్రయాణాలు అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ జబ్బయినా ఏ క్షణంలోనైనా ఎక్కడికైనా విస్తరించొచ్చు. కొవిడ్‌ మాదిరిగానే మంకీపాక్స్‌ విషయంలోనూ అదే నిజమైంది. విదేశాల నుంచి వచ్చినవారితో ఇది మనదేశానికీ విస్తరించింది. ఒక్కనెలలోనే అధికారికంగా నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదవటం గమనార్హం. ఇప్పటివరకైతే విదేశాల నుంచి వచ్చినవారికే పరిమితమైనా అంతటితోనే ఆగుతుందని చెప్పలేం. ఆరంభంలోనే అడ్డుకోకపోతే విస్తృతంగానూ సోకొచ్చు. ఇప్పటికే ఇలాంటి ధోరణి మొదలైంది. ఎక్కడికీ వెళ్లకపోయినా దిల్లీలో ఒకరు మంకీపాక్స్‌ బారినపడ్డట్టు నిర్ధరణ అయ్యింది. శ్వాసకోశ వైరస్‌లలా ఇదీ తుంపర్ల ద్వారా వ్యాపించేదే అయినా లైంగిక సంపర్కంతో.. అదీ స్వలింగ సంపర్కులకు ఎక్కువ సోకుతుండటం వల్ల కట్టడి చేయటానికి ఎక్కువ అవకాశముంది. మశూచిలా అంత తీవ్రమైంది, ప్రాణాంతకమైంది కాకపోవటమూ ఒకింత ఊరట కలిగిస్తోంది. కొవిడ్‌లా కొరకరాని కొయ్యేమీ కాదు. దీని తీరుతెన్నుల గురించి బాగానే తెలుసు. చికిత్స విషయంలోనూ మంచి అవగాహన ఉంది. పైగా మనలో చాలామంది మశూచి టీకా తీసుకొని ఉండటం, దీని దీర్ఘకాల ప్రభావం మంకీపాక్స్‌నూ అడ్డుకునే వీలుండటమూ కాస్త ధైర్యం కలిగిస్తోంది. అలాగని నిర్లక్ష్యం పనికిరాదు. ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది.

ఎక్కడిదీ వైరస్‌?

మంకీపాక్స్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే రకానికి చెందిన జబ్బు. దీనికి మూలం మంకీపాక్స్‌ వైరస్‌. ఇది పాక్స్‌విరిడియే జాతికి చెందిన వైరస్‌. ప్రధానంగా కొన్నిరకాల ఉడతలు, ఎలుకలు, కోతులు, చింపాంజీల వంటి వాటిల్లో కనిపిస్తుంటుంది. దీన్ని 1958లో పరిశోధనల కోసం ప్రత్యేకించిన కోతుల్లో తొలిసారిగా గుర్తించారు. అందుకే మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. ఇది మనుషుల్లో 1970లో మొదటిసారి కాంగో దేశంలో బయటపడింది. ఆ తర్వాత మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. దీని బారినపడ్డవారిలో సుమారు 3% మంది చనిపోయారు కూడా. ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఇది ప్రెయిరీ కుక్కల ద్వారా 2003లో అమెరికాలోకి విస్తరించింది. మంకీపాక్స్‌ రెండు నెలల నుంచి పెద్దఎత్తున విజృంభిస్తోంది. యూరప్‌తో పాటు చాలా దేశాలకు శరవేగంగా పాకుతూ వస్తోంది. ఆఫ్రికాలోనూ ఇప్పుడు పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి కూడా.

ఎలా వ్యాపిస్తుంది?

మంకీపాక్స్‌ సోకిన ఎలుకలు, ఉడతల వంటివి గీకినా, కరిచినా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వీటి లాలాజలం, రక్తం వంటి శరీర స్రావాలను తాకినా సోకొచ్చు. ఈ వైరస్‌ గల జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా రావొచ్చు. ఇది మనుషుల్లో శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాకపోతే పెద్ద తుంపర్లతో.. అదీ మంకీపాక్స్‌ సోకినవారికి చాలాసేపు సన్నిహితంగా ఉన్నవారికే సోకే అవకాశముంది. లాలాజలం వంటి శరీర స్రావాలు, పొక్కులు నేరుగా తగిలినా కూడా అంటుకోవచ్చు. ప్రధానంగా లైంగిక సంపర్కంతో.. ముఖ్యంగా పురుష స్వలింగ సంపర్కుల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇన్‌ఫెక్షన్‌ గలవారు వాడిన దుప్పట్లు, దుస్తులు, పళ్లాలు, చెంచాల వంటి వాటితోనూ ఇతరులకు సోకొచ్చు. మంకీపాక్స్‌ వైరస్‌ గర్భిణుల నుంచి పిండానికీ సోకే ప్రమాదముంది.

నిర్ధరణ ఎలా?

పాలీమరేజ్‌ చెయిన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) పరీక్ష చేస్తే వైరస్‌ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. ఇది పాజిటివ్‌గా తేలితే మంకీపాక్స్‌ను గుర్తించే సంప్రదాయ పీసీఆర్‌ లేదా మంకీపాక్స్‌ డీఎన్‌ఏను గుర్తించే పీసీఆర్‌ పరీక్ష చేస్తారు. వైరస్‌ తీరుతెన్నులను తెలుసుకోవటానికి అవసరమైతే జన్యుక్రమాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది.

అంత భయపడాల్సిన పనిలేదు గానీ..

మంకీపాక్స్‌ చాలావరకు దానంతటదే తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో ఆరోగ్యం మీద దుష్ప్రభావాలేవీ ఉండవు. కాకపోతే పిల్లలకు, రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండేవారికి, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలు గలవారికి, గర్భిణులకిది తీవ్రంగా పరిణమించొచ్చు. వైరస్‌ ప్రభావం, ఆరోగ్యస్థితి, ఇతర జబ్బుల తీరును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మంకీపాక్స్‌ బారినపడ్డవారిలో 0-11% మంది మరణించే ప్రమాదమున్నట్టు గత అనుభవాలు చెబుతున్నాయి. ఇటీవల దీని మరణాల రేటు సుమారు 3-6 శాతంగా కనిపిస్తోంది. అయితే మనకు మశూచి టీకా అండగా ఉండటం కలిసొచ్చే విషయం. ఒకప్పుడు అందరికీ స్మాల్‌పాక్స్‌ టీకాలు ఇవ్వటం తెలిసిందే. దీని మూలంగానే 1977లో మశూచిని అంతం చేయగలిగాం. ఈ టీకా మంకీపాక్స్‌నూ ఎదుర్కొంటుంది. దీర్ఘకాలం రక్షణ కల్పిస్తుంది. అంటే 50 ఏళ్ల క్రితం స్మాల్‌పాక్స్‌ టీకా తీసుకున్నా ఇప్పటికీ రక్షణ లభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే 1980లో స్మాల్‌పాక్స్‌ టీకా ఇవ్వటం ఆపేశారు. అందువల్ల ఆ తర్వాత పుట్టినవారికి మంకీపాక్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ.

చికిత్స ఏంటి?

మంకీపాక్స్‌కు ఆయా లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. స్మాల్‌పాక్స్‌ చికిత్సలో వాడే యాంటీవైరల్‌ మందులే దీనికీ ఉపయోగపడతాయి. పుండ్లు పడితే యాంటీసెప్టిక్‌ ద్రావణంతో తుడవటం, శుభ్రంగా ఉంచటం, తేలికగా బ్యాండేజీ కట్టటం, తాకకుండా, గోకకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌గా మారితే యాంటీబయోటిక్‌ మందులు ఉపయోగపడతాయి. జననాంగాల్లో పొక్కులు గలవారు తొట్టిలో గోరువెచ్చటి నీరు పోసి అందులో కాసేపు కూర్చుంటే ఉపశమనం కలుగుతుంది. నోట్లో పుండ్లు పడినట్టయితే ఉప్పు నీటితో పుక్కిలించటం, నొప్పి తగ్గించే పూత మందులు మేలు చేస్తాయి.

* తగినంత నీరు తాగటం ముఖ్యం. ఓఆర్‌ఎస్‌ పొడి కలిపిన నీరు తాగితే ఇంకా మంచిది. అలాగే మంచి పోషకాహారం తీసుకోవాలి. అవసరమైతే సెలైన్‌ ఎక్కించాల్సి ఉంటుంది.

* జ్వరం ఉన్నట్టయితే తడిబట్టతో తుడవటం, పారాసిటమాల్‌ మాత్రలు ఉపయోగపడతాయి. దురద దగ్గటానికి కాలమైన్‌ పూత మందు, యాంటీహిస్టమిన్లు మేలు చేస్తాయి.

నివారణ ముఖ్యం

మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు గలవారు ఇతరులతో కలవకుండా విడిగా ఉండటం చాలా ముఖ్యం. విధిగా మాస్కు ధరించాలి. పొక్కుల మీద పలుచటి వస్త్రం కప్పుకోవాలి. వెంటనే ఆసుపత్రికి సమాచారం అందించాలి. మంకీపాక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ గలవారు తాకిన మంచం, దుప్పట్లు, దుస్తులు, తువ్వాలు వంటి వాటిని ఇంట్లో ఎవరూ ముట్టుకోకూడదు. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవటం.. లేదా ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌ను రాసుకోవటం తప్పనిసరి. దీంతో ఇతరులకు జబ్బు వ్యాపించకుండా చూసుకోవచ్చు.

* స్మాల్‌పాక్స్‌ టీకా మంకీపాక్స్‌నూ నిలువరిస్తుంది. కాబట్టే అమెరికా, యూరప్‌ దేశాల్లో దీన్ని మంకీపాక్స్‌ నివారణకూ ఇవ్వటం ఆరంభించారు.


ఎప్పుడు ప్రమాదకరం?

కంట్లో నొప్పి లేదా చూపు మసకబారటం, ఆయాసం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, స్పృహ తప్పటం, మూర్ఛ, మూత్రం తగ్గటం వంటివి కనిపిస్తే పరిస్థితి విషమిస్తోందనే అర్థం. ఇలాంటివారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చి, చికిత్స ఆరంభించాల్సి ఉంటుంది.


ముప్పు ఎవరికి?

* మశూచి టీకా తీసుకోనివారికి

* మగవారికి.. ముఖ్యంగా స్వలింగ సంపర్కులకు

* మంకీపాక్స్‌ బాధితులకు  సన్నిహితంగా ఉండేవారికి

* దీర్ఘకాల జబ్బులతో బాధపడేవారికి


అనుమానించటమెలా?

మంకీపాక్స్‌ను లక్షణాల ద్వారానే అనుమానించాల్సి ఉంటుంది. ఇందులో చాలావరకు మశూచి మాదిరి లక్షణాలే కనిపిస్తుంటాయి. వైరస్‌ సోకిన తర్వాత 6-13 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు మొదలవ్వచ్చు. కొందరికివి 5 రోజుల్లోనే బయటపడితే కొందరికి 21 రోజుల వరకూ కనిపించకపోవచ్చు. దీని ప్రధాన లక్షణలు ఇవీ..

* జ్వరం

* చర్మం మీద దద్దు, పొక్కులు: ఇవి సాధారణంగా ముఖం మీద మొదలవుతాయి. ఆ తర్వాత చేతులు, కాళ్లు, అరిచేతులు, పాదాలకు విస్తరిస్తుంటాయి. జ్వరం వచ్చాక 1-3 రోజుల్లో దద్దు మొదలవుతుంది. క్రమంగా బుడిపెలు, పొక్కులుగా మారతాయి. తర్వాత వీటిల్లో ద్రవం, చీము పుట్టుకొస్తాయి. కొందరికి పొక్కులు, బుడిపెలు కొద్దిగానే ఉండొచ్చు. కొందరికి పెద్ద సంఖ్యలో ఏర్పడొచ్చు. ఇవి సుమారు 2-4 వారాల వరకు ఉండొచ్చు. పొక్కులు చీము పట్టినప్పుడు బాగా నొప్పి పెట్టొచ్చు. ఇవి మానే సమయంలో దురద పెడుతుంది. అనంతరం ఎండిపోయి, చెక్కు కట్టి రాలిపోతాయి.

* మెడ, చంకలు, గజ్జల వద్ద లింఫ్‌ గ్రంథులు ఉబ్బటం

* తలనొప్పి, ఒళ్లు నొప్పులు

* చలి, చెమట్లు పట్టటం

* తీవ్రమైన బలహీనత

* గొంతునొప్పి, దగ్గు

* ప్రస్తుతానికి విదేశాల నుంచి వచ్చినవారిలోనే మంకీపాక్స్‌ ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఇది వ్యాప్తిలో ఉన్న దేశాల నుంచి ఇటీవల వచ్చినవారిలో ఎవరిలోనైనా సరే.. 21 రోజుల లోపు ఉన్నట్టుండి చర్మం మీద దద్దు, మశూచి మాదిరి పొక్కులు కనిపిస్తే మంకీపాక్స్‌ ఉందేమోనని అనుమానించాలి. అలాగే గత 21 రోజుల్లో ఎప్పుడైనా మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు గలవారికి లేదా ఇది సోకినవారికి సన్నిహితంగా ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనుమానిత లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. పొక్కులు రాలిపోవటానికి, మానటానికి ఒకట్రెండు రోజుల ముందు వరకూ వైరస్‌ ఇతరులకు సోకే అవకాశముందని గుర్తించాలి. కాబట్టి నిర్లక్ష్యం తగదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని