ముందే నెలసరి నిలిస్తే గుండెకు చేటు!

మగవారితో పోలిస్తే మహిళల్లో గుండెజబ్బులు పదేళ్లు ఆలస్యంగా తలెత్తుతుంటాయి. గుండెకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ రక్షణ లభించటం దీనికి కారణం కావొచ్చని భావిస్తుంటారు.

Updated : 09 Aug 2022 01:02 IST

గవారితో పోలిస్తే మహిళల్లో గుండెజబ్బులు పదేళ్లు ఆలస్యంగా తలెత్తుతుంటాయి. గుండెకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ రక్షణ లభించటం దీనికి కారణం కావొచ్చని భావిస్తుంటారు. నెలసరి నిలిచిన తర్వాత ఈ హార్మోన్‌ మోతాదులు పడిపోతాయి. ఫలితంగా గుండెజబ్బులు వచ్చే అవకాశమూ పెరుగుతుంది. నెలసరి ముందుగానే నిలిచిపోతే వీటి ముప్పు ఇంకాస్త ఎక్కువవుతుంది. కొందరికి 40 ఏళ్లు రాకముందే నెలసరి నిలిచిపోవచ్చు (ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌). కొందరికి 45 ఏళ్లకు ముందే నెలసరి ఆగిపోవచ్చు (ఎర్లీ మెనోపాజ్‌). ఇలాంటివారికి గుండె వైఫల్యం, గుండె లయ తప్పటం వంటి సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు కొరియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం పేర్కొంటోంది. ఎంత ముందుగా నెలసరి నిలిచిపోతే వీటి ముప్పులు అంత ఎక్కువగా ఉంటుండం గమనార్హం. అందువల్ల త్వరగా నెలసరి నిలిచిన మహిళలు గుండెజబ్బు ముప్పు కారకాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. బరువు తగ్గటం, పొగ అలవాటుంటే మానెయ్యటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, కొవ్వు, తీపి పదార్థాలు తగ్గించటం అవసరమని వివరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని