టమోటా ఫ్లూ కొత్తదేమీ కాదు

ఇటీవల కేరళలో కొందరు పిల్లలకు ‘టమోటా ఫ్లూ’ సోకటం, తల్లిదండ్రులు ఆందోళన పడటం తెలిసిందే. చాలామంది దీన్ని కొత్త జబ్బుగా భావిస్తున్నారు. పేరు కూడా తప్పుదారి పట్టించేలా కనిపిస్తోంది.

Published : 30 Aug 2022 01:13 IST

టీవల కేరళలో కొందరు పిల్లలకు ‘టమోటా ఫ్లూ’ సోకటం, తల్లిదండ్రులు ఆందోళన పడటం తెలిసిందే. చాలామంది దీన్ని కొత్త జబ్బుగా భావిస్తున్నారు. పేరు కూడా తప్పుదారి పట్టించేలా కనిపిస్తోంది. చర్మం మీద దద్దు ఎర్రగా, టమోటాల మాదిరిగా కనిపించటం వల్ల దీన్ని టమోటా ఫ్లూగా పిలుచుకుంటున్నారు గానీ దీనికి టమోటాలతో గానీ ఫ్లూతో గానీ ఎలాంటి సంబంధం లేదు. నిజానికిది పిల్లల్లో తలెత్తే చేయి, పాదం, నోరు జబ్బని (హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ డిసీజ్‌- హెచ్‌ఎఫ్‌ఎండీ) కొందరు నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో ఇది దోమల ద్వారా వ్యాపించే చికున్‌ గన్యా, డెంగీ అయ్యిండొచ్చనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. వీటిల్లోనూ ఒంటి మీద దద్దు వస్తుంది. జ్వరం, కీళ్ల నొప్పులూ ఉంటాయి. అయితే చికున్‌ గన్యా, డెంగీ జ్వరాల్లో నీటి పొక్కులు ఏర్పడవు. హెచ్‌ఎఫ్‌ఎండీకి కారణం కాక్స్‌సాకీవైరస్‌. ఇది కొత్తదేమీ కాదు. చాలాకాలంగా చూస్తున్నదే. అయితే ఈ వైరస్‌లో ఇటీవల చాలా రకాలు పుట్టుకొచ్చాయి. వీటిల్లో కాక్స్‌సాకీ ఏ6 రకం ఒకటి. ఇది పెద్ద నీటిపొక్కులకు దారితీయొచ్చు. ఇవే ఇప్పుడు కలవర పెడుతున్నాయి. ఈ లక్షణమే టమోటా ఫ్లూ అనే పేరుకు దారితీసి ఉండొచ్చు. హెచ్‌ఎఫ్‌ఎండీ మామూలు సమస్యే. పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదు. వారం, పది రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. దీనికి కారణమయ్యే వైరస్‌ చాలావరకు మల విసర్జన తర్వాత చేతులు సరిగా కడుక్కోక పోవటం, మలం ఉన్నచోట తాకిన చేతులను నోట్లో పెట్టుకోవటంతో వ్యాపిస్తుంది. ఇది సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లతోనూ ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. లాలాజలం వంటి శరీర స్రావాలతోనూ సంక్రమిస్తుంది. వైరస్‌ సోకిన 3-6 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏదీ లేదు. జ్వరం ఉంటే పారాసిటమాల్‌ మాత్రలు, నోట్లో పుండ్లు తగ్గటానికి నోటి పూత మలాములు ఉపయోగపడతాయి. సమస్య తీవ్రమైతే ఎసైక్లోవిర్‌ వంటి యాంటీవైరల్‌ మందులు మేలు చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని