పిక్కలు పట్టేస్తున్నాయేం?

సమస్య: నాకు కొంత కాలంగా పిక్కలు పట్టేస్తున్నాయి. ఎంతోమంది డాక్టర్లకు చూపించుకున్నాను. ఎన్నో మందులు వాడాను. అయినా తగ్గటం లేదు. రాత్రి వేళల్లోనైతే తుంటి నుంచి అరికాలు వరకు మరీ ఎక్కువగా కండరాలు పట్టేసి బాధపెడుతుంటాయి. దీనికి శాశ్వత పరిష్కారం సూచించండి.

Published : 13 Sep 2022 00:37 IST

సమస్య: నాకు కొంత కాలంగా పిక్కలు పట్టేస్తున్నాయి. ఎంతోమంది డాక్టర్లకు చూపించుకున్నాను. ఎన్నో మందులు వాడాను. అయినా తగ్గటం లేదు. రాత్రి వేళల్లోనైతే తుంటి నుంచి అరికాలు వరకు మరీ ఎక్కువగా కండరాలు పట్టేసి బాధపెడుతుంటాయి. దీనికి శాశ్వత పరిష్కారం సూచించండి.

- రవికుమార్‌ శర్మ, నెల్లూరు

సలహా: మీరు సమస్య గురించి చెప్పారు గానీ వివరాలు పూర్తిగా తెలియజేయలేదు. వయసు, చేసే పని, ఇతరత్రా జబ్బులు, వాడే మందుల వంటి వివరాలు చాలా ముఖ్యం. ఇప్పటికే ఎంతోమంది డాక్టర్లను కలిశానని అంటున్నారు. అయినా తగ్గలేదంటే కారణాన్ని సరిగా గుర్తించలేదనే తోస్తోంది. కండరాలు హఠాత్తుగా, అసంకల్పితంగా సంకోచించటం వల్ల పిక్కలు పట్టేస్తుంటాయి. ఇదేమీ హానికరం కాదు గానీ ఉన్నట్టుండి తీవ్రమైన నొప్పి పుడుతుంది. కొందరు నొప్పితో నిద్రలోంచి హఠాత్తుగా లేస్తుంటారు కూడా. పిక్కలు పట్టేయటానికి మూలం కండరాల సంకోచ, వ్యాకోచాలకు తోడ్పడే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లవణాల మోతాదులు తగ్గటం. ఇందుకు రకరకాల సమస్యలు దోహదం చేస్తుంటాయి. వీటిల్లో ఒకటి మధుమేహం నియంత్రణలో లేకపోవటం. కండరాలు సరిగా బిగుసుకోవటానికి, వదులు కావటానికి గ్లూకోజు అవసరం. అయితే మధుమేహుల్లో గ్లూకోజు ఎక్కువగా ఉన్నా అది కండరాలకు ఉపయోగపడదు. దీంతో కండరాల్లో తలెత్తే జీవక్రియ మార్పులు సంకోచ, వ్యాకోచాలను అస్తవ్యస్తం చేస్తాయి. మూత్రం ఎక్కువగా రావటమూ సమస్యే. మూత్రంతో పాటు లవణాలూ పోతాయి. మరోవైపు మధుమేహుల్లో నాడులు, రక్తనాళాలు దెబ్బతింటుంటాయి. దీంతో రక్త ప్రసరణ తగ్గిపోయి పిక్కలు పట్టేసినట్టు నొప్పి రావొచ్చు. ఎండలో, వేడి వాతావరణంలో ఎక్కువసేపు పనులు చేసినప్పుడు.. అలాగే అతిగా వ్యాయామం, శారీరక శ్రమ చేసినప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి. విటమిన్‌ బి12, విటమిన్‌ డి లోపంతోనూ పిక్కలు పట్టేయొచ్చు. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులతోనూ సోడియం, పొటాషియం స్థాయులు పడిపోవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్స్‌ సైతం సమస్యకు కారణం కావొచ్చు. ఒకోసారి కిడ్నీ సమస్యల్లోనూ ఎలక్ట్రోలైట్ల మార్పులతో పిక్కలు పట్టేయొచ్చు. కాబట్టి కారణాన్ని గుర్తించి, చికిత్స తీసుకుంటే సమస్య నయమైపోతుంది. ఏదేమైనా ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండలో ఎక్కువగా పనిచేస్తున్నట్టయితే ఓఆర్‌ఎస్‌ పొడిని కలిపిన నీరు తాగటం మంచిది. దీంతో కండరాల కదలికలు సాఫీగా సాగుతాయి. రాత్రి పడుకునే ముందు పిక్క కండరాలను సాగదీసే వ్యాయామాలు చేస్తే పట్టేయకుండా చూసుకోవచ్చు. కాసేపు వ్యాయామ సైకిల్‌ తొక్కినా మంచిదే.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని