రొమ్మువాపూ క్యాన్సర్‌ కావొచ్చు!

రొమ్ముక్యాన్సర్‌ ఆనవాళ్లు అనగానే ఆకారం మారటం, చనుమొనల నుంచి స్రావాలు.. ముట్టుకున్నప్పుడు చేతికి గడ్డలు, కణితులు తగలటం వంటివే గుర్తుకొస్తాయి. కానీ ఒకరకం క్యాన్సర్‌లో రొమ్ము వాపు (ఎడీమా), ఎరుపు (ఎరిత్మియా) సైతం ఉండొచ్చు. రొమ్ము మీద చర్మం లేత గులాబీ రంగులో లేదా కమిలినట్టూ కనిపించొచ్చు.

Published : 18 Oct 2022 01:11 IST

రొమ్ముక్యాన్సర్‌ ఆనవాళ్లు అనగానే ఆకారం మారటం, చనుమొనల నుంచి స్రావాలు.. ముట్టుకున్నప్పుడు చేతికి గడ్డలు, కణితులు తగలటం వంటివే గుర్తుకొస్తాయి. కానీ ఒకరకం క్యాన్సర్‌లో రొమ్ము వాపు (ఎడీమా), ఎరుపు (ఎరిత్మియా) సైతం ఉండొచ్చు. రొమ్ము మీద చర్మం లేత గులాబీ రంగులో లేదా కమిలినట్టూ కనిపించొచ్చు. ఇలాంటి రకాన్ని ఇన్‌ఫ్లమేటరీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అంటారు. ఒకరకంగా దీన్ని వాపుతో కూడిన రొమ్ముక్యాన్సర్‌ అనుకోవచ్చు. నిజానికిది అరుదే. రొమ్ముక్యాన్సర్‌ బారినపడుతున్న ప్రతి 5 మందిలో ఒకరిలోనే వస్తుంటుంది. కానీ చాలా తీవ్రమైంది. ప్రాణాంతకమైంది. దీని అసాధారణ హెచ్చరిక సంకేతాలను చాలామంది రొమ్ముక్యాన్సర్‌ ఆనవాళ్లుగా పోల్చుకోలేకపోవటం గమనార్హం. దీంతో దాదాపు సగం మందిలో నాలుగో దశలోనే బయటపడుతుంటుంది. ఇన్‌ఫ్లమేటరీ రొమ్ముక్యాన్సర్‌లో రొమ్ము మీది చర్మం నారింజ తొక్క మాదిరిగా చిన్న చిన్న గుంతలతో గరుకు గరుకుగా కనిపిస్తుంది. దీనికి కారణం చర్మంలోని లింఫు నాళాలను క్యాన్సర్‌ కణాలు అడ్డుకోవటం. దీంతో లింఫు ద్రవ ప్రవాహం అస్తవ్యస్తమై అక్కడే పోగుపడుతుంది. రొమ్ముల్లో బరువుగా అనిపించటం, చర్మం బిగుసుకుపోవటం, రొమ్ములు ఉబ్బటం వంటివీ ఉంటాయి. ఈ రకం క్యాన్సర్‌ రొమ్ములో ఎక్కడైనా ఏర్పడొచ్చు. కొన్నిసార్లు ఇది డాక్టర్లనూ అయోమయంలో పడేస్తుంటుంది. ఎందుకంటే సాధారణంగా రొమ్ము ఎర్రబడటాన్ని క్యాన్సర్‌కు సంకేతంగా భావించరు. ఏదో ఇన్‌ఫెక్షన్‌ వచ్చి ఉండొచ్చనే అనుకుంటుంటారు. సమస్యను త్వరగా గుర్తించి, నిర్ధరించటంలో ఇది పెద్ద సవాలుగా నిలుస్తోంది. జన సామాన్యంలోనూ 78% మంది గడ్డలను, కణితులను క్యాన్సర్‌ లక్షణంగా గుర్తిస్తున్నారు. కేవలం 44% మందే ఎరుపు, చర్మం గరుకుగా మారటాన్ని క్యాన్సర్‌ ఆనవాళ్లుగా భావిస్తున్నారు. అంటే మిగతావాళ్లంతా మామూలు గడ్డలనో, ఇన్‌ఫెక్షన్‌గానో పొరపడుతున్నారన్నమాట. కాబట్టి దీని అసాధారణ లక్షణాలపై అవగాహన కల్పించటం ఎంతైనా అవసరమని నిపుణులు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని