బ్యాక్టీరియాపై వైరస్‌ బాణం!

యాంటీబయాటిక్‌ మందులకు లొంగని బ్యాక్టీరియా పెను సమస్యగా మారుతోంది. ఆసుపత్రుల్లో విషమ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తోంది. అందుకే ఇలాంటి మొండి బ్యాక్టీరియా పని పట్టటానికి శాస్త్రవేత్తలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

Published : 22 Nov 2022 00:09 IST

యాంటీబయాటిక్‌ మందులకు లొంగని బ్యాక్టీరియా పెను సమస్యగా మారుతోంది. ఆసుపత్రుల్లో విషమ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తోంది. అందుకే ఇలాంటి మొండి బ్యాక్టీరియా పని పట్టటానికి శాస్త్రవేత్తలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వీటిల్లో ఒకటి బ్యాక్టీరియోఫేజెస్‌ను వాడుకోవటం. వీటిని ఫేజెస్‌ అనీ పిలుచుకుంటారు. ఇవి బ్యాక్టీరియాకు ఇన్‌ఫెక్షన్‌ తెచ్చిపెట్టే వైరస్‌లు. మనకు ఎలాంటి హాని చేయవు. ప్రాణాంతక ఊపిరితిత్తి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఒకరికి ఇటీవల ఇంగ్లండ్‌లో ఫేజెస్‌తో చికిత్స చేసి పరీక్షించారు కూడా. ఆ ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియాను చంపగలిగే రెండు ఫేజెస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని ఏడాది పాటు ఇవ్వగా ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా నయం కావటం విశేషం. అనంతరం మరో 19 మందికీ ఫేజెస్‌తో చికిత్స చేశారు. వీరిలో 11 మందిలో మొండి ఇన్‌ఫెక్షన్‌ నయం కాగా.. నలుగురిలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. మిగతా ఐదుగురిలో ఫలితాలు అంత స్పష్టంగా కనిపించలేదు. ఏదేమైనా మొండి బ్యాక్టీరియాను చంపటానికి ఫేజెస్‌ కొత్త ఆశా కిరణంగా కనిపిస్తున్నాయి. కాకపోతే రోగుల్లోని ఒకో బ్యాక్టీరియా రకానికి తగిన ఫేజెస్‌ను ఎలా గుర్తించాలి? ఎలా వృద్ధి చెందించాలి? అనేదే సవాలుగా నిలుస్తోంది. దీన్ని అధిగమించగలిగితే మొండి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల అంతానికి మార్గం సుగమమైనట్టే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని