హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ ఇంకా తోక ముడవలేదు!

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ అనగానే.. చాలామంది నోటి నుంచి ముందుగా వచ్చే మాట ‘అదింకా ఉందా?’ అనే. ఒకప్పుడు దాని పేరు వింటేనే గడగడలాడిన మనం ఇప్పుడది ఉందంటే ఆశ్చర్యపోయే స్థితికి చేరుకున్నాం.

Updated : 29 Nov 2022 00:23 IST

ఎల్లుండి వరల్డ్‌ ఎయిడ్స్‌ డే

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ అనగానే.. చాలామంది నోటి నుంచి ముందుగా వచ్చే మాట ‘అదింకా ఉందా?’ అనే. ఒకప్పుడు దాని పేరు వింటేనే గడగడలాడిన మనం ఇప్పుడది ఉందంటే ఆశ్చర్యపోయే స్థితికి చేరుకున్నాం. జబ్బు తీరుతెన్నులు, సంక్రమించే తీరు, నివారణ మార్గాలపై అవగాహన పెరగటంతో పాటు వైరస్‌ను సమర్థంగా తిప్పికొట్టే ఏఆర్‌టీ మందులు అందుబాటులోకి రావటంతో ఉద్ధృతి బాగా తగ్గిపోయిన మాట నిజమే. కానీ పూర్తిగా తోకముడవలేదు. ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కొన్ని వర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇదింకా ప్రబలంగానే ఉంది. ఒక్క గత సంవత్సరంలోనే కొత్తగా 15 లక్షల మందికి వ్యాధి సోకటం గమనార్హం. ప్రస్తుత సమాజం కొత్త పోకడలూ పోతోంది. స్వలింగ సంపర్కం, మాదకద్రవ్యాల వాడకం రోజురోజుకీ ఎక్కువవుతూ వస్తున్నాయి. హెచ్‌ఐవీ వ్యాప్తికి కారణమయ్యే ఇలాంటి ధోరణులు ఎప్పటికైనా ప్రమాదమే. అప్రమత్తంగా లేకపోతే అదను చూసి కాటేస్తుంది. కాబట్టి ప్రపంచ ఎయిడ్స్‌ దినం (డిసెంబరు 1) సందర్భంగా హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ గురించి చర్చించుకోవటం.. ముఖ్యంగా నేటి తరం తెలుసుకొని ఉండటం అవసరం.

ఒకప్పటిలా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ మరణ శాసనం కాదు. ఇప్పుడిది మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల మాదిరిగా సమర్థంగా నియంత్రించుకోగల జబ్బుగా మారిపోయింది. గత పదేళ్లలో దీని బారినపడుతున్నవారి సంఖ్య, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి కూడా. ఇది మంచి మార్పే అయినా దీన్ని పూర్తిగా నిర్మూలించాలన్న సంకల్పం మాత్రం నెరవేరటం లేదు. ప్రపంచవ్యాప్తంగా 3.84 కోట్ల మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నారని అంచనా. వీరిలో సగానికిపైగా మంది మహిళలు, బాలికలే. ఆందోళనకరమైన విషయం ఏంటంటే- వీరిలో సుమారు 15% మందికి తమకు జబ్బు ఉన్నట్టే తెలియకపోవటం. మనదేశంలో సుమారు 24 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో 4.76 లక్షల మందికి  (ఆంధ్రప్రదేశ్‌లో 3.21 లక్షలు, తెలంగాణలో 1.55 లక్షలు) హెచ్‌ఐవీ ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రాంతాలు, వర్గాల వారీగా వేర్వేరుగా, భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సెక్స్‌ వర్కర్లు, మగ స్వలింగ సంపర్కులు, సూదులతో మాదకద్రవ్యాలు తీసుకునేవారు, లింగమార్పిడి చేయించు కున్నవారు, ఖైదీల వంటి (కీ పాపులేషన్స్‌) వారిలో కేంద్రీకృతమై ఉంది. వీరితో సన్నిహితంగా మెలిగే లైంగిక భాగస్వాములకూ (విటులు, దూర ప్రాంతాలకు వెళ్లే ట్రక్‌ డ్రైవర్లు, వలస పోయేవారు) దీని ముప్పు పొంచి ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం హెచ్‌ఐవీ కేసుల్లో 70% వీరిలోనే కనిపిస్తోంది. ముప్పు ఎక్కువగా గలవారికి సన్నిహితంగా ఉండేవారి (బ్రిడ్జి పాపులేషన్స్‌) నుంచే సాధారణ ప్రజలకు హెచ్‌ఐవీ వ్యాపిస్తుండటం గమనార్హం.

హెచ్‌ఐవీ నుంచి ఎయిడ్స్‌

చాలామంది హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రెండూ ఒకటేనని భావిస్తుంటారు. నిజానికి హెచ్‌ఐవీని నిర్లక్ష్యం చేస్తే అది ఎయిడ్స్‌గా మారుతుంది. హెచ్‌ఐవీ అనేది ఒక వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌. దీనికి మూలం హ్యూమన్‌ ఇమ్యునోడెఫిసియెన్సీ వైరస్‌ (హెచ్‌ఐవీ). ఇది రోగనిరోధకశక్తిని నిర్వీర్యం చేసి, మనిషిని కుదేలు చేస్తుంది. మనల్ని జబ్బుల బారినపడకుండా కాపాడే రోగనిరోధక వ్యవస్థలో సీడీ4 తెల్ల రక్తకణాలు చాలా కీలకం. శరీరంలోకి ప్రవేశించిన హెచ్‌ఐవీ వీటిలోకే చేరుతుంది. వీటిని తెలివిగా వాడుకొని వృద్ధి చెందుతుంది. చివరికి వాటినే విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా సీడీ4 కణాల సంఖ్య గణనీయంగా పడిపోయి, రోగనిరోధక శక్తి నిర్వీర్యమైపోతుంది. దీంతో వివిధ రకాల అంటురోగాలు సంక్రమిస్తాయి. కొన్నిరకాల క్యాన్సర్లకూ దారితీయొచ్చు. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. చివరికి ఎయిడ్స్‌గా (అక్వయిర్డ్‌ ఇమ్యునో- డెఫిసియెన్సీ సిండ్రోమ్‌) పరిణమిస్తుంది. ఇది హెచ్‌ఐవీ చివరిదశ. గమనించాల్సిన విషయం ఏంటంటే- ఈ దశకు చేరుకోవటానికి చాలాకాలం పట్టటం. హెచ్‌ఐవీ సోకినా కొన్నేళ్ల వరకూ ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించవు. ఇదే చాలామందిని బురిడీ కొట్టిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా అంతా బాగానే ఉందని అనుకుంటుంటారు. భాగస్వాములతో మామూలుగానే దాంపత్య జీవనం గడుపుతుంటారు. ఇలా తెలియకుండానే వైరస్‌ను ఇతరులకు వ్యాపింపజేస్తుంటారు. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారు చికిత్స తీసుకోకపోతే సగటున పదేళ్ల తర్వాత ఎయిడ్స్‌ లక్షణాలు మొదలవుతుంటాయి. కొందరిలో 20 ఏళ్లు దాటినా ఎలాంటి లక్షణాలూ పొడసూపకపోవచ్చు. అయితే కొందరు హెచ్‌ఐవీ సోకిన రెండు, మూడేళ్లలోనే మరణించే అవకాశం లేకపోలేదు. ఎయిడ్స్‌ దశలోకి చేరుకున్నాక కూడా చికిత్స తీసుకోకపోతే ఒకట్రెండు సంవత్సరాల్లో మరణం సంభవించొచ్చు.

ఎలా వ్యాపిస్తుంది?

హెచ్‌ఐవీ రక్తం, చనుబాలు, వీర్యం, జననాంగ స్రావాల వంటి శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా సంక్రమిస్తుంది. 1. అసురక్షిత సంభోగం. చాలా అరుదుగా ముఖరతితోనూ (ఓరల్‌ సెక్స్‌) వ్యాపించొచ్చు. 2. సిరలోకి మాదకద్రవ్యాల ఇంజెక్షన్లు తీసుకోవటం. ఇలాంటివారు సాధారణంగా ఒకరికి వాడిన సూదులను, సిరంజీలను మరొకరు వాడుతుంటారు. మత్తు ఇంజెక్షన్ల వాడకం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇదే ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది. 3. హెచ్‌ఐవీతో కలుషితమైన రక్తమార్పిడి. ప్రస్తుతం బ్లడ్‌ బ్యాంకుల్లో పకడ్బందీగా పరీక్షలు చేస్తున్నారు. అందువల్ల వైరస్‌ వ్యాప్తి చాలా అరుదేనని చెప్పుకోవచ్చు. 4. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించటం. గర్భధారణ సమయంలో గానీ కాన్పు జరిగేటప్పుడు గానీ హెచ్‌ఐవీ బాధిత తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సోకొచ్చు. చనుబాల ద్వారానూ తల్లి నుంచి శిశువుకు సంక్రమించొచ్చు. అయితే ఇప్పుడు గర్భిణులకు ముందుగానే హెచ్‌ఐవీ పరీక్ష చేస్తున్నారు. ఇది ఉన్నట్టు తేలితే యాంటీరెట్రోవైరల్‌ (ఏఆర్‌వీ) మందులతో చికిత్స ఆరంభిస్తున్నారు. ఫలితంగా తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సోకటమూ అరుదుగానే కనిపిస్తోంది. తాకటం, కరచాలనం, చుంబించటం వంటి వాటి ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశం లేదని గుర్తించాలి. కాబట్టి హెచ్‌ఐవీ బారినడపడ్డవారిని చిన్నచూపు చూడటం తగదు. ఇది సమస్యను మరింత జటిలం చేస్తుందే తప్ప తగ్గించదని తెలుసుకోవాలి.

పరీక్ష తప్ప మరో మార్గం లేదు

హెచ్‌ఐవీ సోకినా చాలాకాలం వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీన్ని తొలిదశలో గుర్తించటానికి ఏకైన మార్గం రక్తపరీక్షే. హెచ్‌ఐవీ ముప్పు ఎక్కువగా ఉన్నవారితో లేదా హెచ్‌ఐవీ సోకినవారితో అసురక్షిత సంభోగంలో పాల్గొన్నామని అనుమానిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవటం మంచిది. మాదకద్రవ్యాల వినియోగంలో సూదులను పంచుకున్నా పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ వైరస్‌ సోకినట్టు తెలిస్తే వెంటనే చికిత్స ఆరంభించాలి. దీంతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాదు.. ఇతరులకు వైరస్‌ సంక్రమించకుండానూ నివారించుకోవచ్చు. ఇది అందరి సామాజిక బాధ్యతని గమనించాలి.

లక్షణాలేంటి?

హెచ్‌ఐవీ దశను బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అధిక శాతం మందికి మొదట్లో ఎలాంటి లక్షణాలూ ఉండవు. చాలా కొద్దిమందికి మాత్రమే జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు వంటి మామూలు వైరల్‌ జ్వరంలాంటి లక్షణాలు పొడసూపొచ్చు. కొందరికి చర్మం మీద దద్దూ రావొచ్చు. దీన్నే ఎక్యూట్‌ రెట్రోవైరల్‌ సిండ్రోమ్‌గా పిలుస్తారు. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమవుతున్నకొద్దీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతూ వస్తుంది. దీంతో చంకలు, గజ్జలు, మెడ వద్ద లింఫ్‌ గ్రంథులు ఉబ్బొచ్చు. బరువు తగ్గిపోవచ్చు. జ్వరం, విరేచనాలు, దగ్గు వంటివి విడవకుండా వేధించొచ్చు. సరైన చికిత్స తీసుకోకపోతే క్షయ, మెదడు పొరల వాపు వంటి తీవ్రమైన జబ్బులకు దారితీయొచ్చు. తీవ్రమైన బ్యాక్టీరియా, ఫంగల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లూ తలెత్తొచ్చు. కొన్నిరకాల క్యాన్సర్లూ బయలుదేరొచ్చు.

కర్తవ్యం-నివారణే 

హెచ్‌ఐవీ సోకిన తొలి దశలో రోగి నుంచి వైరస్‌ తేలికగా సంక్రమించే అవకాశముంది. కానీ చాలామందికి ఆ విషయమే తెలియదు. కాబట్టి హెచ్‌ఐవీ వ్యాప్తి, తీరుతెన్నులపై అవగాహన పెంచుకోవాలి.
*హెచ్‌ఐవీ ముప్పు ఎక్కువగా ఉన్నవారితో, వీరితో సన్నిహితంగా ఉండేవారితో అసురక్షిత సంభోగం జరపొద్దు. విధిగా కండోమ్‌ వాడుకోవాలి. మగవారు సున్తీ చేయించుకోవటం మంచిది. దీంతో సుఖవ్యాధులు వచ్చే అవకాశం 50-60% వరకు తగ్గుతుంది.
* మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సూదులను, సిరంజీలను కలిసి పంచుకోరాదు.
* ఇంజెక్షన్‌తో సిరల్లోకి మాదకద్రవ్యాలను తీసుకునే అలవాటును మానుకోవాలి. ఈ వ్యసనం నుంచి బయటపడటానికి తప్పకుండా డి-అడిక్షన్‌ చికిత్స తీసుకోవాలి.
* అవసరమైనప్పుడు బ్లడ్‌ బ్యాంకుల ద్వారా సురక్షితమైన రక్తాన్నే సేకరించి, ఎక్కించుకోవాలి.
* హెచ్‌ఐవీ గల గర్భిణులకు ఏఆర్‌వీ మందు లు ఇస్తే బిడ్డకు అసలు వైరస్‌ సంక్రమించ దనే చెప్పుకోవచ్చు.  బిడ్డకు దాదాపు 99% రక్షణ లభిస్తుంది.. హెచ్‌ఐవీ నియం త్రణలో దీన్నొక మైలురాయిగా పరిగణించొచ్చు.

నయం కాదు గానీ..

ప్రస్తుతం హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను పూర్తిగా నయం చేసే చికిత్స ఏదీ లేదు. కానీ దీన్ని తొలిదశలోనే గుర్తించి ఏఆర్‌వీ మందులను వేసుకోవటం మొదలెడితే దాదాపుగా వ్యాధి నియంత్రణలో ఉంటుంది. మూడు, నాలుగు ఏఆర్‌వీ మందులను కలిపి ఇచ్చే పద్ధతి ‘హార్ట్‌’ (హైలీ ఎఫెక్టివ్‌ యాంటీ-రెట్రోవైరల్‌ థెరపీ) బాగా పనిచేస్తుంది. హెచ్‌ఐవీ సోకిన తొలిదశ నుంచి దీన్ని కచ్చితంగా తీసుకుంటే శరీరంలోని వైరస్‌ పరీక్షల ద్వారా గుర్తించలేని స్థాయికి పడిపోతుంది. దీంతో చాలావరకు ఆరోగ్యకరమైన జీవితం గడపొచ్చు. అసురక్షిత సంభోగం చేసినా, వీరు వాడిన సూదులను వేరొకరు పంచుకున్నా కూడా వారికి వైరస్‌ సోకదు.
* హెచ్‌ఐవీ సోకినవారితో అసురక్షిత సంభోగంలో పాల్గొన్నా కూడా సంభోగానికి ముందుగా తీసుకునే మందులతో నివారించుకోవచ్చు. దీన్ని ప్రెప్‌ (ప్రి-ఎక్స్‌పోజర్‌ ప్రొఫైలాక్సిస్‌) అంటారు.

భవిష్యత్‌ ఆశ

దీర్ఘకాలం పనిచేసే ఏఆర్‌వీ మందులపై పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి. హెచ్‌ఐవీ నియంత్రణ, నివారణలో ఇవి విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవని ఆశిస్తున్నారు. ఈ మందుల్లో ముఖ్యమైనవి కాబోతేగ్రావీర్‌, రిల్పీవిరిన్‌ ఇంజెక్షన్ల మిశ్రమం. ఇంకా లెనాకాపావీర్‌, స్లాట్రోవీర్‌ ఇంజెక్షన్‌ ఇంప్లాంట్స్‌. వీటితో హెచ్‌ఐవీ చికిత్స చాలా తేలికవుతుంది. సురక్షిత మవుతుంది. వీటిని నెలకో, ఆర్నెల్లకో లేదా ఏడాదికో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు