చర్మ క్యాన్సర్‌కు ప్రొటీన్‌ ప్రేరణ

తీవ్ర చర్మ క్యాన్సర్‌ (మెలనోమా) మరింత ఉద్ధృతమయ్యేలా చేస్తున్న ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి కణ కేంద్రకం ఆకారాన్ని మార్చేసే సామర్థ్యం ఉండటం విశేషం.

Published : 17 Jan 2023 00:44 IST

తీవ్ర చర్మ క్యాన్సర్‌ (మెలనోమా) మరింత ఉద్ధృతమయ్యేలా చేస్తున్న ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి కణ కేంద్రకం ఆకారాన్ని మార్చేసే సామర్థ్యం ఉండటం విశేషం. కొందరిలో మెలనోమా శరీరంలోని ఇతర భాగాలకూ విస్తరిస్తుంటుంది. క్యాన్సర్‌ సంబంధ మరణాలు పెరగటానికి ఇలా ఇతర భాగాలకు విస్తరించే క్యాన్సరే పెద్ద కారణం. క్యాన్సర్‌ విస్తరించటం మీద చాలా అధ్యయనాలే చేశారు గానీ ఇదెలా జరుగుతుందనేది అంతగా తెలియదు. ఈ నేపథ్యంలో క్వీన్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌, ఫ్రాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుల అధ్యయనం మెలనోమా విస్తరణపై కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. సాధారణంగా ప్రధాన కణితి నుంచి విడిపోయిన క్యాన్సర్‌ కణాలు ఇతర భాగాలకు చేరుకొని, అక్కడ వృద్ధి చెందటం ఆరంభిస్తాయి. నిజానికి కణితి చుట్టూ ఉండే మందమైన పరిసరాలు కణాలు విస్తరించకుండా అడ్డుకుంటుంటాయి కూడా. ఈ కణాల్లో జన్యు సమాచారంతో కూడిన పెద్ద, గట్టి కేంద్రకం ఉంటుంది. అందువల్ల ఇది సన్నటి మార్గాల ద్వారా అంతగా ప్రయాణించలేదు. కణ కేంద్రకం మెత్తబడితే గానీ వీటిల్లోంచి బయటకు రావటం సాధ్యం కాదు. ఇక్కడే క్యాన్సర్‌ కణాలు తెలివిని ప్రదర్శిస్తున్నాయి. తమ కేంద్రకం అంచుల వద్ద బుడిపెలను ఏర్పరచుకొని, తేలికగా బయటపడే మార్గాన్ని సృష్టించుకుంటున్నాయి. ఇలాంటి కణాల్లో ల్యాప్‌1 అనే ప్రొటీన్‌ పెద్ద మొత్తంలో ఉంటోందని, ఇదే కణ కేంద్రకం ఆకారం మారటానికి దోహదం చేస్తోందని పరిశోధకులు భావిస్తున్నారు. చర్మక్యాన్సర్‌ విస్తరణను అడ్డుకునే మందుల రూపకల్పనకు తాజా అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు