Updated : 08 Feb 2023 09:32 IST

Osteoporosis: బోలు ఎముక!

మనకు ఒక ఆకారాన్ని ఇచ్చేది, మనల్ని నిలబెట్టేది ఎముకే. ఇది పుష్టిగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. అదే చేవ తగ్గితే? చిన్న ఒత్తిడికే చతికిల పడుతుంది. మామూలుగా కింద పడినా పుటుక్కుమంటుంది. త్వరగా అతుక్కోదు. అతుక్కున్నా అంత బలంగా ఉండదు. ఎముకలను గుల్లబరచి, బోలుబోలుగా చేసే ఆస్టియోపోరోసిస్‌ (Osteoporosis) ఇలాంటి ఉపద్రవాలనే తెచ్చిపెడుతోంది. నడి వయసులో, వయసు మీరిన తర్వాత ఎంతోమందికి ఇదిప్పుడు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. దీని మూలంగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నారు. తుంటి ఎముక విరిగి మంచాన పడుతున్నారు. మంచి విషయం ఏంటంటే- దీన్ని నివారించుకునే వీలుండటం. ప్రస్తుతం దీని చికిత్సకు అధునాతన మందులూ అందుబాటులోకి వచ్చాయి.

ఎముక దృఢంగానే ఉండొచ్చు. వంగకుండా స్థిరంగానే ఉండొచ్చు. అంతమాత్రాన జడమైంది కాదు. అతి చురుకైనది. ప్రతి రోజూ మారుతుంది. తనకు తాను విచ్ఛిన్నమవుతూ.. కొత్తగా ఏర్పడుతూ.. లోపాలను సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు బలంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంది. పుట్టినప్పటి నుంచే ఎముకలు బలోపేతమవుతూ వస్తాయి. ముప్పయి ఏళ్లు వచ్చేసరికి ఎముక సాంద్రత ఉచ్ఛస్థితికి చేరుకుంటుంది. అనంతరం పునర్నిర్మాణ (రీమోడలింగ్‌) ప్రక్రియ మొదలవుతుంది. పాత ఎముక విచ్ఛిన్నమై, తిరిగి సమీకృతమవుతుంది (రిసార్‌ప్షన్‌). ఇందులో ఆస్టియోక్లాస్ట్‌, ఆస్టియోబ్లాస్ట్‌ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆస్టియోక్లాస్ట్‌ కణాలు అనవసర ఎముక కణాలను మింగేస్తాయి. కొత్త ఎముక ఏర్పడటానికి మంచి పునాదిని వేస్తాయి. అనంతరం ఆస్టియోబ్లాస్ట్‌ కణాలు కొత్త ఎముకను సృష్టిస్తాయి (ఫార్మేషన్‌). ఇదంతా ఒక క్రమ పద్ధతిలో సాగుతూ వస్తుంది. ఎముక విచ్ఛిన్నం కావటానికి 10 రోజులు పడితే.. ఎముక ఏర్పడటానికి 10 వారాలు పడుతుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగినంత కాలం ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇది గతి తప్పితే ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. ఎముకలు బోలుబోలుగా, బలహీనంగా అవుతాయి. పెళుసు బారతాయి. ఫలితంగా విరిగే ముప్పూ పెరుగుతుంది.


పెద్ద సమస్యే

ఆరోగ్య సమస్యలనగానే ఎంతసేపూ గుండెపోటు, క్యాన్సర్‌ వంటి తీవ్ర జబ్బులే గుర్తుకొస్తాయి. కానీ ఆస్టియోపోరోసిస్‌ తక్కువేమీ కాదు. మనదేశంలో ఆడవారిలో ప్రతి ఇద్దరిలో ఒకరు.. మగవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు దీంతో బాధ పడుతున్నారు. గుండెపోటుతో పోలిస్తే ఆస్టియోపోరోసిస్‌ ఫ్రాక్చర్లు రెండింతలు ఎక్కువ. రొమ్ముక్యాన్సర్‌ కన్నా ఇవి 2-3 రెట్లు ఎక్కువ. ఈ ఫ్రాక్చర్లు అప్పటికప్పుడు ప్రాణాల మీదికి తేకపోవచ్చు గానీ అసలే ప్రాణహాని ఉండదని అనుకోవటం పొరపాటు. తుంటి ఎముక విరిగినవారిలో 20% మంది ఏడాదిలోపే మరణిస్తుండటం విచారకరం. అంతేకాదు.. 20% మంది  ఏడాది లోపే తిరిగి ఫ్రాక్చర్‌కు గురవుతుంటారు కూడా.


నిర్వచనం మారింది

సాధారణంగా ఆస్టియోపోరోసిస్‌ను ఎముక సాంద్రతతో గుర్తిస్తారు. ఇది బాగుంటే ఎముక ఆరోగ్యంగానే ఉందనుకుంటారు. అయితే సాంద్రత ఒక్కటే కాదు, ఎముక నాణ్యతా ముఖ్యమే. సాంద్రత బాగానే ఉన్నా చాలామందికి ఎముక విరుగుతుండటం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు ఎముక సాంద్రత, నాణ్యత.. రెండూ తగ్గటం వల్ల ఎముక విరిగే అవకాశం ఉండటాన్ని ఆస్టియోపోరోసిస్‌గా నిర్వచిస్తున్నారు. ఎముక గుల్లబారటానికి ముందు క్షీణించే స్థితికి (ఆస్టియోపీనియా) చేరుకుంటుంది. ఆస్టియోపోరోసిస్‌లో కన్నా ఆస్టియోపీనియాలోనే ఎముకలు ఎక్కువగా విరుగుతుంటాయి. ఇందులో ఎముక ఆకృతి, నాణ్యత తగ్గుతాయి. చిక్కేంటంటే- ఎముక నాణ్యతను గుర్తించటం అంత తేలిక కాదు. ట్రాబిక్యులర్‌ బోన్‌ స్కోర్‌ వంటి పద్ధతులున్నాయి గానీ అంతగా అందుబాటులో లేవు.


ముప్పు కారకాలేంటి?

వయసు మీరటం: ఎముకలు గుల్లబారటానికి అతి పెద్ద ముప్పు కారకం ఇదే. ముప్పయి ఏళ్ల తర్వాత ఎముక సాంద్రత ఏటా ఒక శాతం చొప్పున తగ్గుతూ ఉంటుంది. దీంతో గుల్లబారే ముప్పూ పెరుగుతూ వస్తుంది. 65 ఏళ్లు దాటాక ఇది మరింత తీవ్రమవుతుంది.
నెలసరి నిలవటం: మగవారి కన్నా ఆడవారికి ఎముకలు గుల్లబారే ముప్పు ఎక్కువ. దీనికి కారణం నెలసరి నిలిచిన తర్వాత ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ గణనీయంగా తగ్గిపోవటం. ఈస్ట్రోజన్‌ ఎముక విచ్ఛిన్నం కాకుండా, క్షీణించకుండా కాపాడుతుంది. నెలసరి నిలిచాక దీని రక్షణ కొరవడుతుంది. దీంతో ఎముక సాంద్రత మరింత వేగంగా తగ్గుతుంది. మగవారిలోనూ హార్మోన్ల స్థాయులు తగ్గుతాయి గానీ ఇలా ఉన్నట్టుండి పడిపోవు. అందువల్ల ఎముక క్షీణత మీద ప్రభావం చూపవు.
బలహీనత: కండరాల మోతాదు తక్కువగా ఉండటం, బలహీనంగా, బక్కపలచగా ఉండటమూ ఎముక క్షీణతకు దారితీస్తుంది. అందుకే లావుగా ఉండేవారితో పోలిస్తే సన్నగా ఉండేవారికి ఆస్టియోపోరోసిస్‌ వచ్చే అవకాశం ఎక్కువ.


లక్షణాలు

ఆస్టియోపోరోసిస్‌ ఉన్నా పైకేమీ తెలియదు. దీని మూలంగా తలెత్తే వెన్నెముక ఫ్రాక్చర్లు సైతం భిన్నంగా ఉంటాయి. ఎరుపు, వాపు వంటివేవీ ఉండవు. కానీ ముందుకు వంగిపోతారు. వయసు మీరినవారిలో దీన్ని తరచూ చూస్తూనే ఉంటాం. శరీర ఎత్తు తగ్గటమూ మరో సంకేతం. కొన్నిసార్లు ఎముక నొప్పి, నడుం నొప్పి, బలహీనత కూడా ఉండొచ్చు. ఇలాంటివి తప్ప పెద్దగా లక్షణాలేవీ ఉండవు. అందుకే దీన్ని చాలామంది బలహీనతగానే భావిస్తుంటారు. ఇదే పెద్ద సమస్య. ఎముక విరిగేంత వరకూ గుల్లబారిన సంగతే బయటపడదు.  


నిర్ధరణ ఎలా?

ఆస్టియోపోరోసిస్‌ను గుర్తించటానికి డెక్సా స్కాన్‌ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇందులో టీ స్కోర్‌, జెడ్‌ స్కోర్‌ అని రెండు రకాలుంటాయి. వీటిల్లో టీ స్కోరే ప్రధానం. ఇది 0 నుంచి -1 వరకు నార్మల్‌. అదే -1 నుంచి -2.5 మధ్యలో ఉంటే ఆస్టియోపీనియాగా.. -2.5 కన్నా తగ్గితే ఆస్టియోపోరోసిస్‌గా నిర్ధరిస్తారు. 65 ఏళ్లు పైబడినవారికి ఈ పరీక్ష అవసరం. అయితే ఖరీదైనది కావటం వల్ల అందరికీ కుదరక పోవచ్చు. ఆస్టియోపోరోసిన్‌ అనుమానిత లక్షణాలు గలవారు, గతంలో ఎముకలు విరిగినవారు, కుటుంబంలో ఆస్టియోపోరోసిస్‌ ఫ్రాక్చర్ల చరిత్ర గలవారు చేయించుకోవటం మంచిది. పొగ, మద్యం అలవాటు గల మహిళలకూ ఇది అవసరమే.
ఫ్రాక్స్‌ స్కోర్‌: ఎముకలు గుల్లబారటమే కాదు, ఇతరత్రా అంశాలూ ఎముక విరిగే ముప్పును పెంచొచ్చు. గతంలో ఎముకలు విరగటమూ ఫ్రాక్చర్ల ముప్పును పెంచొచ్చు. రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌లోనూ ఎముక త్వరగా క్షీణిస్తుంది. దీర్ఘకాలంగా స్టిరాయిడ్‌ మందుల వాడకమూ ఎముకలు గుల్లబారేలా చేయొచ్చు. దీర్ఘకాల మధుమేహమూ ఎముకలను బోలుగా చేయొచ్చు. మధుమేహులకు డెక్సా స్కాన్‌ చేస్తే ఎముక సాంద్రత బాగానే ఉంటుంది. కానీ ఇది నిజమైంది కాదు. మధుమేహం ఎముక, మృదులాస్థి స్వభావాన్ని మార్చేసి ఎముక సాంద్రత ఎక్కువగా ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రాక్స్‌ స్కోర్‌ విధానం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఇతరత్రా అంశాలనూ పరిగణనలోకి తీసుకొని ఎముక విరిగే ముప్పును అంచనా వేస్తారు.  
బోన్‌ టర్నోవర్‌ మార్కర్‌ (బీటీఎం): ఇది రక్త పరీక్ష. దీంతో ఎముక విచ్ఛిన్నత పెరగటం, ఎముక ఏర్పడే ప్రక్రియ తగ్గటం తెలుస్తాయి. ఎముక విచ్ఛిన్నత ఎక్కువగా ఉన్నట్టు తెలిస్తే సీటీఎక్స్‌ అనే రక్త పరీక్ష చేస్తారు. ఇది 600 కన్నా ఎక్కువగా ఉంటే ఎముక విచ్ఛిన్నత అధికంగా ఉందనే అర్థం. ఎముక ఏర్పడటాన్ని తెలుసుకోవటానికి పీ1ఎన్‌పీ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇది 60 కన్నా తక్కువగా ఉంటే ఎముక అంతగా ఏర్పడటం లేదని అర్థం. ఆస్టియోపోరోసిస్‌ చికిత్సను నిర్ణయించటంలో ఇవి కీలకం.


చికిత్స

ఆస్టియోపోరోసిస్‌ గలవారికే కాదు.. ఆస్టియోపీనియా దశలో ఉన్నవారికీ చికిత్స అవసరం. అలాగే రుమటాయిడ్‌ కీళ్లవాతం, మధుమేహం, గతంలో ఎముక విరగటం వంటి ముప్పు కారకాలు ఉన్నవారూ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్టియోపోరోసిస్‌ చికిత్సలో ప్రధానమైనవి క్యాల్షియం, విటమిన్‌ డి. అలాగే అవసరాన్ని బట్టి ఎముక విచ్ఛిన్నతను ఆపే, కొత్త ఎముకను ఏర్పరచే మందులనూ ఇవ్వాల్సి ఉంటుంది.

* ఎముకలు గుల్లబారినవారికి రోజుకు 1,000 మి.గ్రా. క్యాల్షియం అవసరం. ఇది క్యాల్షియం కార్బొనేట్‌, క్యాల్షియం సిట్రేట్‌.. రెండు రూపాల్లో ఉంటుంది. క్యాల్షియం కార్బొనేట్‌ను శరీరం గ్రహించుకోవటానికి ఆమ్లం కావాలి. కాబట్టి భోజనం చేశాకే వేసుకోవాలి. క్యాల్షియం సిట్రేట్‌ను రోజులో ఎప్పుడైనా వేసుకోవచ్చు.

* విటమిన్‌ డి లోపం గలవారికి ముందుగా లోడింగ్‌ మోతాదు అవసరం. వారానికి 60వేల యూనిట్ల మోతాదు చొప్పున పది వారాల పాటు ఇస్తారు. అనంతరం నెలకు 60వేల యూనిట్ల చొప్పున జీవితాంతం వాడుకోవాలి. దీన్ని నెల మొత్తానికి ఒకేసారి తీసుకోవచ్చు. లేదూ రోజుకు 2వేల యూనిట్ల చొప్పున అయినా వేసుకోవచ్చు. ఇది కొవ్వులో కరిగే విటమిన్‌. పెద్దమొత్తంలో తీసుకున్నప్పుడు కాలేయంలో నిల్వ ఉంటుంది. అవసరమైన మేరకు విడుదలవుతుంది. సాధారణంగా విటమిన్‌ డిని పొడి, ద్రవ రూపాల్లో ఇస్తారు. పోషకాలను గ్రహించుకోలేక పోవటం వంటి సమస్యలు గలవారికి ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. విటమిన్‌ డి మోతాదులు మరీ మితిమీరితే దుష్ప్రభావాలు తలెత్తుతాయని గుర్తుంచుకోవాలి.

* నెలసరి నిలిచిన మహిళలకు ఎముక విచ్ఛిన్నాన్ని ఆపే బిస్‌ఫాస్ఫోనేట్‌ రకం మందులు ఉపయోగపడతాయి. ఎలెండ్రోనేట్‌ వంటి మాత్రలను వారానికి ఒకటి, పరగడుపున వేసుకోవాలి. గంట సేపటి వరకు పడుకోకూడదు. వీటితో చిక్కేంటంటే ఇవి ఎముకలో జీవితాంతం అలాగే ఉండిపోవటం. ఎముక పునర్నిర్మాణంలో ఎముక విచ్ఛిన్నం కావటం, కొత్త ఎముక ఏర్పడటం రెండూ ముఖ్యమే. ఎముక విచ్ఛిన్నం కాకుండా అడ్డుకోవటమంటే పరోక్షంగా ఎముక పునర్నిర్మాణాన్ని ఆపినట్టే. అందువల్ల ఈ మాత్రలను 5 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం వేసుకోకూడదు. గత పదేళ్లుగా జొలిండ్రోనిక్‌ యాసిడ్‌ అనే మంచి మందూ అందుబాటులోకి వచ్చింది. ఇంజెక్షన్‌ రూపంలో ఉండే దీన్ని ఏడాదికి ఒకసారి చొప్పున ఐదేళ్లు ఇస్తే సరిపోతుంది.

* ఇప్పుడు ఆరు నెలలకోసారి తీసుకునే అధునాతన బయోలాజికల్‌ మందూ వచ్చింది. దీని పేరు డీనోసుమాబ్‌. ఇదో మోనోక్లోనల్‌ యాంటీబాడీ. ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని 3-5 ఏళ్ల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని హఠాత్తుగా ఆపేస్తే ఎముక మరింత క్షీణించే ప్రమాదముంది. అందువల్ల దీన్ని నివారించటానికి ఎలెండ్రోనేట్‌ వంటి మందులు అవసరమవుతాయి. కాకపోతే ఖరీదు ఎక్కువ. కానీ మంచి ఫలితం చూపిస్తుంది.

* కొత్త ఎముక ఏర్పడటానికి టెరిపెరటైడ్‌ ఇంజెక్షన్‌ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వయసు మీరినవారికి, పీ1ఎన్‌పీ బాగా తక్కువగా గలవారికి బాగా పనిచేస్తుంది. వెన్నెముక ఫ్రాక్చర్లు తగ్గటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ఎముక నాణ్యతనూ మెరుగు పరుస్తుంది.

ఈ మందులతో ఎముక విరిగే ప్రమాదం 60% వరకు తగ్గుతుంది.

మామూలు ఎముక

ఆస్టియోపోరోసిస్‌


ముందు నుంచే నివారణ

మనదేశంలో నలబై ఏళ్ల తర్వాత ఎముక నొప్పి, కీళ్ల నొప్పి, నడుం నొప్పి సమస్యలు లేని మహిళలు లేరంటే అతిశయోక్తి కాదు. దీనికి ప్రధాన కారణం 30 ఏళ్ల వయసులో ఎముక సాంద్రత తక్కువగా ఉండటమే. ఈ వయసులో ఎముక సాంద్రత ఉచ్ఛస్థితికి చేరుకున్నవారికి మున్ముందు ఎముక క్షీణిస్తూ వస్తున్నా విరిగే ముప్పు తక్కువగానే ఉంటుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడాలి.

* క్యాల్షియం: ఎముక నిర్మాణంలో క్యాల్షియం చాలా కీలకం. సాధారణ వ్యక్తులకు రోజుకు 600 మి.గ్రా. క్యాల్షియం అవసరం. కౌమార పిల్లలకు, గర్భిణులకు, నెలసరి నిలిచినవారికి రోజుకు 1,200 మి.గ్రా. కావాలి. కానీ మనదేశంలో సగటున 400 మి.గ్రా. మాత్రమే తీసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్‌ వంటివి తగినంత తీసుకోకపోవటం. మనం తినే ఆహారంలో వీటితోనే 70-75% క్యాల్షియం లభిస్తుంది. మిగతా పదార్థాల్లో కొద్దిగానే ఉంటుంది. మాత్రల కన్నా ఆహారం ద్వారా లభించే క్యాల్షియమే మంచిది. దీన్నే శరీరం బాగా గ్రహిస్తుంది.

* విటమిన్‌ డి: మనం తీసుకున్న క్యాల్షియం ఒంట పట్టటానికి విటమిన్‌ డి తప్పనిసరి. ఇది ప్రధానంగా ఎండ ద్వారానే లభిస్తుంది. చర్మానికి ఎండ తగిలినప్పుడు శరీరమే దీన్ని తయారు చేసుకుంటుంది. మనదేశంలో అన్నికాలాల్లో ఎండ బాగానే కాస్తుంది. అయినా సుమారు 90% మంది విటమిన్‌ డి లోపం గలవారే! ఇది తయారు కావాలంటే రోజుకు గంట సేపు చర్మానికి ఎండ తగలాలి. అదీ మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల మధ్యలో.. శరీరంలో వీలైనంత ఎక్కువ భాగానికి ఎండ తాకాలి. ఇది ఒకరకంగా అసాధ్యమనే అనుకోవచ్చు. మధ్యాహ్నం వేళ ఎండ చురుక్కుమంటుంది. అతినీలలోహిత కిరణాల ప్రభావం తీక్షణంగా ఉంటుంది. దీంతో చర్మం కందిపోవటం వంటి ఇతరత్రా సమస్యలు తలెత్తొచ్చు. మన చర్మం ముదురు రంగులో ఉండటమూ కారణమే. ఇది విటమిన్‌ డి అంతగా తయారు చేసుకోలేదు. పాశ్చాత్యదేశాల్లో బ్రెడ్డు, బిస్కట్లు, పాల వంటి వాటికి విటమిన్‌ డి కలిపి అమ్ముతుంటారు. మనదగ్గర ఇలాంటి సార్వత్రిక విధానమేదీ లేదు. ఇవన్నీ విటమిన్‌ డి లోపానికి కారణమవుతున్నాయి. కాబట్టి రోజుకు 800 ఐయూ మోతాదులో విటమిన్‌ డి తీసుకోవటం మంచిది.  

* వ్యాయామం: అన్నింటికన్నా ముఖ్యమైంది ఇదే. కదలకుండా ఉండిపోతే ఎముక, కండర మోతాదు చాలా వేగంగా తగ్గిపోతాయి. వ్యాయామం, శారీరక శ్రమతో వీటిని కాపాడుకోవచ్చు. ప్రధానంగా శరీర బరువును మోస్తూ చేసే నడక, పరుగు, మెట్లు ఎక్కటం వంటివి బాగా ఉపయోగ పడతాయి. శరీర సామర్థ్యం మేరకు బరువులను ఎత్తే వ్యాయామాలూ చేయొచ్చు.

* ప్రొటీన్‌: తగినంత ప్రొటీన్‌ తినటమూ ముఖ్యమే. గరిష్ఠంగా కిలో శరీర బరువుకు 1 గ్రాము ప్రొటీన్‌ తీసుకోవాలి. అంతకన్నా పెరిగితే విరేచనాలు, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే మనదేశంలో సగటున 0.5 గ్రాముల ప్రొటీనే తీసుకుంటుండటం గమనార్హం.

ఇవి ఆస్టియోపోరోసిస్‌ నివారణకే కాదు.. చికిత్సగానూ ఉపయోగపడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని